స్ధానికతపై లీగల్ ఒపీనియన్

  • 317 జీవో కేబినెట్స బ్ కమిటీకి ఇవ్వనున్న జీఏడీ

హైదరాబాద్, వెలుగు: 317 జీవోతో నష్టపోయిన ఉద్యోగులకు తిరిగి స్థానికత ఆధారంగా న్యాయం చేయాలనే అంశంపై అడ్వకేట్ జనరల్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. స్థానికతలో ఉద్యోగి 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన జిల్లాను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

ఈ అంశంపై జీఏడీ అధికారులు అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకొని 317 జీవోపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి అందజేయనున్నారు. శనివారం సెక్రటేరియెట్ లో కమిటీ చైర్మన్​, మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జీఏడీ అధికారులతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.

 అడ్వకేట్ జనరల్ రిపోర్ట్ వచ్చాక  అన్ని శాఖల అధికారులతో సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించినట్టు తెలిసింది. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ అంశంలో  జీవో 46 వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేసే అంశంపై కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ మహేష్ దత్ ఎక్కా, పీఆర్సీ చైర్మన్ శివశంకర్,  జాయింట్ సెక్రటరీ
సునీతాదేవితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.