Health : రాత్రిళ్లు పిక్కలు పట్టేస్తున్నాయా?..అయితే ఇలా చేయండి.. క్షణాల్లో ఉపశమనం

రాత్రి పూట మంచి నిద్రలో ఉండగా పిక్క పట్టేస్తుంది. ఆ దెబ్బకి నిద్ర తేలిపోవడం మాట పక్కన పెడితే... ఆ క్షణానికి ప్రాణం పోతుందా అనిపిస్తుంది. ఆ తరువాత కొంత సేపటికి రిలీజ్​ అయినా ఆ భాగంలో నొప్పి మాత్రం మరో రోజు వరకు ఉంటుంది. అయితే దీనివల్ల ప్రాణానికి వచ్చే ముప్పు లేకపోయినప్పటికీ ఇలా జరగడం వెనక అనారోగ్య కారణాలు మాత్రం అనేకం ఉండొచ్చు. అందుకని అసలు అలా ఎందుకు అవుతుందనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్.

కాలి పిక్క ప్రాంతంలో కొన్ని సెకన్ల నుంచి  నిమిషాల వరకు కండరాల సంకోచాలు జరుగుతాయి. అప్పుడు ఆ ప్రాంతంలో కండరాలు బిగుతుగా మారి, చలనం లేకుండా ఉంటాయి. ఆ ప్రాంతంలో పట్టుకుంటే చేతికి గట్టిగా తగులుతుంది. గడ్డ కట్టినట్టు ఉంటుంది. ఇలా ఉండటాన్నే పిక్కలు పట్టేయడం అని వాడుక భాషలో చెప్తుంటారు. దీన్ని ‘‘చార్లే హార్స్’’ అని కూడా అంటారు. ఇలా జరగడానికి సిర్రోసిస్, వాస్కులర్ డిసీజ్, హీమోడయాలసిస్ వంటి అనేక రకాల హెల్త్ కండిషన్స్​కు సంబంధం ఉంటుంది. వీటిని ‘‘నోక్టర్నల్ లెగ్ క్రాంప్స్’’ అని అంటారు. వయసు మీద పడిన ఆడవాళ్లలో ఇలా జరగడం సర్వసాధారణం. కొన్ని మందులు వాడడం వల్ల కూడా రాత్రిళ్లు ఇలా పిక్క పట్టేస్తుంటుంది.

రాత్రిళ్లే ఎందుకు అంటే...

ఎక్కువసేపు నిలబడటం, కాళ్లలో సత్తువ లేక పోవడం వల్ల పిక్కలు పట్టేస్తుంటాయి. క్యాల్షియం లోపం లేదా కొన్ని మందులు వాడడం కూడా ఇందుకు కారణం కావచ్చు. పిక్కలు పట్టేయడాన్ని లెగ్ క్రాంప్స్ అంటారు. ఈ క్రాంప్స్​ సాధారణంగా కాలి వెనుక ఉండే పిక్క కండరాల​ను, కొన్నిసార్లు తొడలు, పాదాల్లోని కండరాల మీద  ఎఫెక్ట్ చేస్తాయి. పిక్క పట్టేయడం వల్ల విపరీతమైన నొప్పి ఉంటుంది. ఒక్కోసారి ఈ పరిస్థితి 24 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. తొడ భాగం గట్టిగా అనిపించొచ్చు. ఇది నడక, కదలికల మీద ప్రభావం చూపిస్తుంది. 

ఇలా పిక్క పట్టడానికి ఇతర కారణాలు కూడా ఉండే అవకాశం ఉంది. వాటిలో కొన్ని ఇవి.. సరిపడా నీళ్లు తాగకపోవడం, ఖనిజాల లోపం, 50 ఏళ్లు పైబడిన వయసు, ప్రెగ్నెన్సీ, ఆస్టియో ఆర్థరైటిస్, డీహైడ్రేషన్, క్యాల్షియం తగ్గడం, మద్యపానం, నరాల మీద ఒత్తిడితో పాటు గుండె జబ్బులు వంటి అనారోగ్యకర పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది. అలాగే.. బీటా-బ్లాకర్స్, యాంటిసైకోటిక్స్, డైయూరిటిక్స్, స్టాటిన్స్ వంటి కొన్ని మందుల వాడకం కూడా ఈ పరిస్థితికి దారితీస్తుందని చెప్తున్నారు ఎక్స్​పర్ట్స్.

ఉపశమనం ఇలా.. 

పిక్కలు పట్టేశాక వాటంతట అవి రిలాక్స్ అయ్యేందుకు కొంచెం టైం పడుతుంది. త్వరగా ఆ ఇబ్బంది నుండి బయటపడాలంటే ఇలా చేయాలి.. సాగదీయడం : కాలి వేళ్లను చేత్తో పట్టుకుని వెనక్కి లాగాలి. ఇలా చేయడం వల్ల కండరం (స్ట్రెచ్​) సాగుతుంది. దాంతో కండరాలు రిలాక్స్ అవుతాయి. నొప్పిని తగ్గించే జెల్​తో మసాజ్ చేసినా కండరాల బిగుతు తగ్గుతుంది. నిద్రపోవడానికి ముందు కండరాల్ని స్ట్రెచ్​, మసాజ్ చేస్తే పిక్కలు పట్టేసి రాత్రిళ్లు నిద్ర లేవాల్సిన అవసరం ఉండదు.

హైడ్రేషన్ : హైడ్రేషన్​ అనేది శరీరానికి చాలా అవసరం. హైడ్రేషన్ లేకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి. వాటిలో లెగ్ క్రాంప్స్ ఒకటి. శరీరం డీ–హైడ్రేట్​ అయినప్పుడు మినరల్స్ తగ్గుతాయి. ఎలక్ట్రోలైట్స్​లో అసమతుల్యత ఏర్పడుతుంది. అది కండరాల పనితీరు మీద ప్రభావం చూపుతుంది. అందుకని రోజుకి కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు లేదా జ్యూస్‌‌‌‌, కొబ్బరి నీళ్లు వంటి పానీయాలు తాగితే శరీరం డీ–హైడ్రేట్​ కాదు. లెగ్ క్రాంప్స్​ ఇబ్బంది ఉండదు.

నిలబడటం, నడవడం : గంటల తరబడి కదలకుండా ఒకే దగ్గర కూర్చుంటే కండరాలు బిగుతుగా అయ్యి పట్టేస్తాయి. ఇలాంటప్పుడు నడక వల్ల కండరాల కండరాల్లో కదలిక వస్తుంది. నొప్పి తగ్గుతుంది. నడిచేటప్పుడు కాలు కదపడం, నిలబడి ఉన్నప్పుడు పాదాలను నేలపై ఆన్చడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. దీంతో తరచుగా పిక్కలు పట్టడం అనేది ఉండదు. 

ప్యాక్‌‌‌‌లు : హీటింగ్ ప్యాడ్ లేదా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల పిక్క పట్టేయడం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఐస్ బ్యాగ్ వాడినా కండరాలు రిలాక్స్ అవుతాయి.

డాక్టర్​ అవసరం ఎప్పుడంటే..

రాత్రిళ్లు నిద్రలో పిక్కలు పట్టేయడం వల్ల నిద్ర డిస్టర్బ్​ అవుతుంది. దాంతో నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. అందుకని భరించలేనంతగా లెగ్ క్రాంప్స్​తో ఇబ్బందిపడుతున్నా, సమస్య పది నిమిషాల కంటే ఎక్కువసేపు ఉన్నా, తరచుగా జరుగుతున్నా డాక్టర్​ దగ్గరకి వెళ్లాల్సిందే. డాక్టర్లు అలా కండరాలు పట్టేయడం వెనక ఉన్న కచ్చితమైన కారణాన్ని గుర్తిస్తారు. సమస్యకు తగ్గ పరిష్కారం మందులు, వ్యాయామం, లైఫ్​ స్టయిల్​లో మార్పుల రూపంలో ఇస్తారు.