సూర్యాపేట జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల దందా

  • స్థానిక ఏజెన్సీలకు మొండి చేయి.. బయట వారికి ఎమ్ ప్యానెల్ మెంట్
  • ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలి ఏజెన్సీలు
  • నష్టపోతున్న చిరు ఉద్యోగులు  
  • పట్టించుకోని అధికారులు

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో అర్హత లేకున్నా అడ్డగోలుగా ఔట్ సోర్సింగ్‌‌‌‌ ఏజెన్సీలను ఎమ్ ప్యానెల్​మెంట్​ చేయడం పట్ల అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హత ఉన్నవారిని పక్కన పెట్టి నాన్ లోకల్ వారికి ఎమ్ ప్యానెల్​మెంట్​లో చోటు కల్పించారు. దీనిని ఆసరాగా చేసుకొని కొన్ని ఏజెన్సీలు దందాలకు పాల్పడుతున్నాయి. లోకల్ వారిని కాదని, నాన్ లోకల్ ఏజెన్సీలకు కట్టబెట్టడంతో ఔట్ సోర్సింగ్‌‌ ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతాల నుంచి కోత విధిస్తున్నారు. అంతేకాకుండా పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకుండా చేతివాటం ప్రదర్శిస్తూ చిరుద్యోగుల పొట్టకొడుతున్నారు. 

42 ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎమ్ ప్యానెల్​మెంట్.. 

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల కోసం అర్హత కలిగిన ఏజెన్సీలను మ్యాన్ పవర్ అందించేందుకు ఎమ్ ప్యానెల్ లో రిజిస్ట్రార్ చేయాల్సి ఉంటుంది. ఎమ్ ప్యానెల్​మెంట్ ఆధారంగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు కాంట్రాక్ట్ లను ప్రభుత్వం అప్పగిస్తుంది. అగ్రిమెంట్ చేసుకున్న ఏజెన్సీలు ఏటా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎమ్ ప్యానెల్​లో కమిటీ చైర్మన్ గా కలెక్టర్, కన్వీనర్ గా ఎంప్లాయీమెంట్ ఆఫీసర్ వ్యవహరిస్తారు. ఇటీవల జిల్లాలోని ఔట్ సోర్సింగ్‌‌ ఏజెన్సీలకు ఎమ్ ప్యానెల్​మెంట్​లో చోటు కల్పించేందుకు అధికారులు టెండర్ వేశారు. 52 మంది టెండర్ ఫామ్స్ తీసుకోగా, వీటిలో 47 మంది టెండర్ లో పాల్గొన్నారు. గత వారం స్కూట్నీ చేయగా, సెక్యూరిటీ డిపాజిట్ లేని ఐదు ఔట్ సోర్సింగ్‌‌ ఏజెన్సీలను రిజెక్ట్ చేశారు. చివరకు 42 ఔట్ సోర్సింగ్‌‌ ఏజెన్సీలను సోమవారం ఫైనల్ చేశారు.  

అర్హత లేని ఏజెన్సీలకు కట్టబెట్టిన అధికారులు..

ఎమ్ ప్యానెల్​మెంట్లో అర్హతలేని వాటికి చోటు కల్పించారని స్థానిక నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మొత్తం 52  ఏజెన్సీలు రిజిస్ట్రేషన్‌‌ చేసుకోగా, ఇందులో 42  ఏజెన్సీలు ఎమ్​ ప్యానెల్​మెంట్లో చోటు దక్కించుకున్నాయి. వీటిలో జిల్లాకు చెందిన ఏజెన్సీలు 10లోపే ఉండగా, మిగతా ఏజెన్సీలన్నీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందినవి కావడం విశేషం. నిబంధనల ప్రకారం పొరుగు జిల్లాలకు చెందిన ఏజెన్సీలు వాటికి సంబంధించిన కార్యాలయాలను స్థానికంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారుల అండదండలతో కాగితాలపై తప్పుడు చిరునామాలు సృష్టించి ఉద్యోగుల నియామకాలు జరుపుతున్నాయి.

ప్రధానంగా అర్హతలేని మూడు ఏజెన్సీలకు ఉద్యోగాలను కట్టబెట్టడంతో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల హుజూర్ నగర్ కు చెందిన ఔట్ సోర్సింగ్‌‌ ఏజెన్సీకి ఉద్యోగులను ఇవ్వడంతోపాటు వారిని తొలగించి కొత్తవారిని తీసుకుంటున్నామని బెదిరించి ఒక్కో ఉద్యోగి నుంచి రూ.లక్ష వసూళ్లు చేశారు. మరో ఏజెన్సీ ఉద్యోగులకు కనీసం పీఎఫ్, ఈఎస్ఐ కూడా చెల్లించకుండా ప్రతినెలా వారి వేతనల్లో కోత పెడుతున్నారు. ఎక్కడ తమ ఉద్యోగం పోతుందో అన్న భయంతో ఏజెన్సీ నిర్వాహకులను ఉద్యోగులు ప్రశ్నించలేకపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఏజెన్సీల నిర్వాహకులు ప్రతినెలా లక్షలు దండుకుంటున్నారు.