నామినేటెడ్​ పోస్టుల కోసం  లీడర్ల లాబీయింగ్!

  • ముగ్గురు మంత్రుల చుట్టూ ఆశావహుల చక్కర్లు
  • మార్కెట్​ కమిటీ, జిల్లా గ్రంథాలయ సంస్థ పాలక వర్గాల కోసం పట్టు
  • డీసీసీ పీఠంపై ఎమ్మెల్యేలతో పాటు నేతల కన్ను

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నేతలు, పదేండ్లుగా పదవులు లేక ఖాళీగా ఉన్న నాయకులు ఇప్పుడు నామినేటెడ్​ పోస్టుల కోసం లాబీయింగ్​ చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు మార్కెట్​ కమిటీలకు పాలకవర్గాలను ప్రభుత్వం ప్రకటిస్తుండడంతో జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్​ పాలక వర్గాల కమిటీ చైర్మన్ల కోసం, టెంపుల్స్​ పాలకవర్గాలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ కోసం నేతలు పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస​రెడ్డి వద్ద ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్నారు. 

మార్కెట్​ కమిటీల పదవుల పోటాపోటీ 

జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, దమ్మపేట, చర్ల, భద్రాచలం, బూర్గంపహాడ్​ వ్యవసాయ మార్కెట్​ కమిటీల పాలకవర్గాల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస​రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతోనూ సిఫార్స్​ చేయించుకునేందుకు జోరుగా యత్నాలు సాగిస్తున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి మండలంలో గల వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్​ కోసం పోటీ పడుతున్న నేతల సంఖ్య పెద్దగానే ఉంది. ప్రధానంగా భట్టి, పొంగులేటి వర్గాలకు చెందిన నాయకులు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ పోస్టుకు డిమాండ్

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ పదవికి మంచి డిమాం ఉంది. ఈ పదవి వస్తే పార్టీతో పాటు గవర్నమెంట్​ ప్రోగ్రామ్​లో ప్రోటోకాల్​ ఉంటుందనే ఆలోచనతో ఆశావహులు ఉన్నారు.

భద్రాచలం టెంపుల్​ కమిటీ చైర్మన్ ​ఎవరికో..

జిల్లాలోని భద్రాచలం సీతారామచంద్రస్వామి టెంపుల్​ చైర్మన్​ పదవికి రోజు రోజుకు పోటీ పెరుగుతోంది. జిల్లాలోని  పాల్వంచలోని పెద్దమ్మతల్లి, కొత్తగూడెంలోని గణేశ్​టెంపుల్​తో పాటు పలు దేవాలయాలకు చైర్మన్​లతో పాటు పాలకవర్గాలను ఏర్పాటు చేయనుండడంతో కాంగ్రెస్​ నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పదవులు దక్కించుకునేందుకు యత్నాలను ముమ్మరం చేశారు. 

డీసీసీ పీఠంపై పలువురి ఆశలు

జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు స్టేట్​ ఫారెస్ట్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ చైర్మన్​ పదవి ని రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ క్రమంలో డీసీసీ పదవి నుంచి ఆయనను పక్కన పెట్టే అవకాశం ఉందనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో జిల్లాలోని ముఖ్య నేతలంతా జిల్లా మంత్రులతోపాటు కొమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​కుమారెడ్డి ఆశీస్సుల కోసం ఎవరి స్థాయిలో వారు 
ప్రయత్నిస్తున్నారు.