అభివృద్ధి మంత్రం మరిచి విమర్శలకే ప్రయార్టీ..

  •     స్థానిక ఆంశాలు, ప్రధాన సమస్యలు ప్రస్తావించట్లే
  •     అగ్రనేతలు, అభ్యర్థులతో సహా నేతలంతా అదే తీరు

కామారెడ్డి ​, వెలుగు: ఎంపీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నాయకులు  విమర్శలకే ప్రయార్టీ ఇస్తున్నారు.  స్థానిక ఆంశాలు, ప్రధాన సమస్యలపై ఎక్కడ ప్రస్తావించట్లేదు.  ప్రధాన పార్టీల అగ్రనేతలు,  అభ్యర్థులతో పాటు, ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.  జహీరాబాద్​ పార్లమెంట్​ పరిధిలోని  కామారెడ్డి జిల్లాలో కొద్ది రోజులుగా ఎంపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.  

పోలింగ్​ తేదీ సమీపిస్తుండడంతో ప్రచారం మరింత ఊపందుకుంది.  అభ్యర్థులు, స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధుల ప్రచారానికి తోడు ఆయా పార్టీ అగ్రనేతలు కూడా వస్తున్నారు.  కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌‌ఎస్​ పార్టీల అభ్యర్థులతో పాటు,  నేతలు  వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతున్నారు.   జిల్లాలో ప్రధాన సమస్యలపై హామీలు ఇవ్వడం పక్కన పెట్టి.. గెలిస్తే ఏం చేస్తారో చెప్పడం లేదు.

దీంతో ఓటర్లకు నిరాశే మిగులుతోంది.  ప్రధాన పార్టీల నుంచి పోటీ లో ఉన్న సురేశ్ షెట్కార్ ​( కాంగ్రెస్​),  బీబీ పాటిల్​( బీజేపీ), గాలి అనిల్​కుమార్​ (బీఆర్​ఎస్​) ఎక్కడ కూడా ప్రధాన సమస్యలను ప్రస్తావించట్లేదు.  ఇప్పటికే పార్లమెంట్​ పరిధిలో  బీజేపీ అభ్యర్థి తరఫున సంగారెడ్డి జిల్లాలో నరేంద్రమోదీ సభ నిర్వహించారు.  కాంగ్రెస్​ నుంచి సంగారెడ్డి జిల్లాలో రేవంత్​రెడ్డి సభ జరిగింది. ఈ నెల 11న కామారెడ్డికి ప్రియాంకగాంధీ,  సీఎం రేవంత్​రెడ్డి వస్తున్నారు.  బీఆర్‌‌ఎస్​ తరఫున ఆ పార్టీ అధినేత కేసీఆర్​రోడ్డు షో నిర్వహించారు. కేసీఆర్ తన ప్రసంగంలో బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలపై విమర్శలకే ఎక్కువ టైం తీసుసుకున్నారు.  

స్థానికంగా ప్రధాన సమస్యలు

కామారెడ్డి జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.  యువతకు ఉపాధి అవకాశాలు, సాగునీటి సమస్య, ఇండస్ర్టీస్​ లేకపోవటం,  డబుల్​ రైల్వేలైన్​,  రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం,  కొత్త రైల్వే లైన్​ నిర్మాణం లాంటివి ప్రధానంగా ఉన్నాయి.  తాము గెలిస్తే ఆయా సమస్యలపై స్పందించి  అభివృద్ధి చేస్తామని చెప్పట్లేదు.  కామారెడ్డి జిల్లాలో బీడీ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు.

వీరికి ప్రస్తుతం సరైన ఉపాధి దొరకడం లేదు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామనే భరోసా ఇవ్వడంలో వెనకంజ వేస్తున్నారు. కేంద్రం నిధులతో చేపట్టే రైల్వే లైన్​ ప్రాజెక్టులపై సప్పుడు లేదు.  జిల్లా కేంద్రాన్ని  రైల్వై  లైన్​ రెండుగా విభజిస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో హై స్కూల్​ వద్ద ప్లై ఓవర్​బ్రిడ్జి,  అశోక్‌ నగర్ కాలనీ వద్ద రైల్వే గేటు ఉంది. బ్రిడ్జి చిన్నగా ఉంది.  రైలు వచ్చినప్పుడల్లా గేటు వేస్తుండటంతో వెహికిల్స్​జామ్​అవుతున్నాయి.  ఇక్కడ  ప్లై ఓవర్​ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంది. యువతకు స్కిల్​ డెవలప్​మెంట్​సెంటర్​ ఏర్పాటు విషయంలో చొరవ చూపాల్సి ఉంది.  వీటన్నింటిని మరిచిన నాయకులు కేవలం విమర్శలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో  ఓటర్లు ఇదేంటని చర్చించుకుంటున్నారు.