పోలీసుల పహారాలో జైనూర్

  • అడుగడుగునా ఆంక్షలతో కర్ఫ్యూ వాతావరణం
  • జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు బంద్
  • ఇరువర్గాలతో పోలీసుల చర్చలు
  • జైనూర్​లోనే మకాం వేసిన అడిషనల్ డీజీ

ఆసిఫాబాద్/జైనూర్/పద్మారావునగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించారు. ఆదివాసీ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం, దాడి ఘటనతో జైనూర్​లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. అడిషనల్ డీజీ, ఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు అక్కడే తిష్ట వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జైనూర్ లోనే సుమారు వెయ్యి మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. బుధవారం నుంచే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.

144 సెక్షన్ విధించడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జైనూర్ మండల కేంద్రానికి రాకపోకలను పూర్తిగా బంద్ పెట్టారు. ఆదిలాబాద్ ఎక్స్ రోడ్డు నుంచి ఉట్నూర్ ఎక్స్ రోడ్డు వరకు పికెటింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు గురువారం జైనూర్, కెరమెరి, సిర్పూర్ యు, లింగాపూర్, తిర్యాణి మండలాల్లో గిరిజనులు బంద్ పాటించారు. జైనూర్ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డిను ఏజెన్సీకి పంపించి పరిస్థితులను చక్కబెట్టాలని ఆదేశించింది. 

అందరూ సంయమనం పాటించాలి: మహేశ్ భగవత్

ఆదివాసీ మహిళపై దాడి దురదృష్టకరమని, ఘటనపై సమగ్ర విచారణ చేయిస్తున్నామని స్టేట్ అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్ అన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు. జైనూర్ ఎంపీడీవో ఆఫీస్​లో ఇరువర్గాలతో ఆయన వేర్వేరుగా చర్చలు జరిపారు. అల్లర్లు, దాడుల ఘటనలపై దర్యాప్తు మొదలైందని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు. సోషల్ మీడియాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివాసీ మహిళపై దాడి ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని సిర్పూర్ టీ ఎమ్మెల్యే హరీశ్ బాబు డిమాండ్ చేశారు. జైనూర్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆదివాసీ మహిళ మీద జరిగిన అత్యాచారయత్నం, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమురం మాంతయ్య అన్నారు.  

మతం రంగు పూసి రెచ్చగొడ్తున్నరు: మంత్రి సీతక్క

జైనూర్ ఘటనకు మతం రంగు పూసి గొడవలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. గాంధీ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న బాధితురాలిని గురువారం ఆమె పరామర్శించారు. ఎస్టీ సంక్షేమ శాఖ తరఫున లక్ష రూపాయల చెక్కును తక్షణ సాయం కింద బాధితురాలి భర్త మెస్రం నాగురావుకు అందజేశారు. 

ఏజెన్సీ ఏరియాల్లో ముస్లింలకు ఏం పని?: ఏలేటి మహేశ్వర్​రెడ్డి

ఏజెన్సీ ఏరియాల్లో ముస్లింలకు ఏం పని అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. బంగ్లాదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ముస్లింలు, రోహింగ్యాలు అటవీ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని మండి పడ్డారు. 

లక్ష ఇచ్చి చేతులు దులుపుకున్నది: బండి సంజయ్

ఆదివాసీ మహిళపై ముస్లిం యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడి దాడి చేస్తే లక్ష రూపాయలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. గురువారం రాత్రి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి బాధితురాలిని పరామర్శించి మాట్లాడారు.