జగిత్యాలలోని ఈ బేకరీలో కుళ్లిపోయిన కోడిగుడ్లు, బూజు పట్టిన బ్రెడ్తో కేకులు తయారుచేస్తున్నారు..!

జగిత్యాల: ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి లాభార్జనే లక్ష్యంగా వ్యాపారం చేస్తున్న జగిత్యాలలోని ఓ బేకరీకి మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. ఇంకోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని బేకరీ యజమానికి వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామంతో ఆ బేకరీలో కేకులు కొన్న కస్టమర్లు విస్తుపోయారు. ఇన్నాళ్లూ తాము లొట్టలేసుకుంటూ తిన్న కేకులు కుళ్లిన కోడిగుడ్లు, బూజుపట్టిన బ్రెడ్ తో తయారుచేసినవని తెలిసి కంగు తిన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల కొత్త బస్టాండ్ ఔట్ గేట్ ఎదురుగా ఉన్న బాబా సాయి బెంగళూరు బేకరీపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను ఏమాత్రం పాటించడం లేదని, బేకరీ లోపల కూడా అపరిశుభ్ర వాతావరణంలో కేకులు తయారుచేస్తున్నారని కొంతమంది కస్టమర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన జగిత్యాల మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు.

మూడు రోజుల క్రితం మున్సిపల్ అధికారులు ఈ బేకరీపై ఆకస్మిక తనిఖీలు చేశారు. కుళ్లిపోయిన కోడిగుడ్లు, బూజుపట్టిన బ్రెడ్తో కేకులు తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు తేల్చారు. ఈ విషయం తెలిసి బేకరీ యజమానిపై మున్సిపల్ అధికారులు మండిపడ్డారు.

బేకరీ ఐటమ్ తయారు చేసే వంటశాల పూర్తిగా అపరిశుభ్రంగా ఉండడంతో పాటు కుళ్లి పోయిన కోడిగుడ్లు, కేకులు, బ్రెడ్ కు వాడే ఆహార పదార్థాలు కాలం చెల్లినవి ఉండడంతో బేకరీని సీజ్ చేసి యజమానికి నోటీసులు ఇచ్చారు. మున్సిపల్ అధికారులు బేకరి యజమానికి 5000 రూపాయల జరిమానా విధించారు. నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయించే హోటళ్లు, బేకరీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.