డాక్యుమెంట్ ఫైల్స్, ఫొటోలు, వీడియోలు.. వంటివి ఇతరులకు షేర్ చేయాలంటే డాటా ఎక్కువ ఖర్చు అవుతుంది. దాంతోపాటు చాలా టైం కూడా పడుతుంది. దీనివల్ల యూజర్లు ఎంతో ఇబ్బందిపడతారు. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరికింది.
ఇంతకుముందు ఫైల్స్ వంటివి షేర్ చేయడానికి గూగుల్ ‘నియర్‌బై షేర్’ ఉండేది. ఇప్పుడు దాని పేరు ‘క్విక్ షేర్’గా మార్చారు. ఇది విండోస్, క్రోమ్ ఓఎస్, ఆండ్రాయిడ్ డివైజ్‌లలో అందుబాటులో ఉంది. దీని ద్వారా యూజర్లు డాక్యుమెంట్స్, ఇమేజెస్, వీడియోలను క్షణాల్లో షేర్ చేసుకోవచ్చు. ఫోన్ నుంచి ల్యాప్ టాప్, ట్యాబ్ వంటివాటికి క్విక్‌గా షేర్ చేయొచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే క్విక్ షేర్‌కు ఇంటర్నెట్ అవసరం లేదు. కాబట్టి మొబైల్ డాటా అయిపోతుందనే బాధ ఉండదు. క్విక్ షేర్ వాడాలంటే యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి, కిందకి స్క్రోల్ చేసి క్విక్ షేర్ మీద ట్యాప్ చేయాలి.
ఎలాగంటే..
ఒక ఫైల్ లేదా ఫొటో ఓపెన్ చేసి షేర్ సింబల్ మీద క్లిక్ చేస్తే యాప్స్ వస్తాయి. వాటితోపాటు గూగుల్ యాప్స్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే క్విక్ షేర్, ఎడిట్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో క్విక్ షేర్ ఆప్షన్ని సెలక్ట్ చేయాలి. అప్పుడు దగ్గరలో ఉన్న డివైజ్‌లు కనిపిస్తాయి. అందులో మీకు కావాల్సిన డివైజ్‌ని ఎంచుకుని షేర్ చేయాలి.
ఒకవేళ డివైజ్‌లు కనిపించకపోతే మూడు చుక్కల మెనూ మీద ట్యాప్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. ‘హు కెన్ షేర్ విత్ యు’ మీద ట్యాప్ చేయాలి. తర్వాత ‘విజిబుల్ టు నియర్‌బై డివైజెస్’ ఆప్షన్ ఎంచుకోవాలి. ఏ డివైజ్‌కి పంపాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోవాలి. ఒకవేళ మీ డివైజ్‌కే పంపుతుంటే ఆటోమెటిక్‌గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది.