టెక్నాలజీ  : స్క్రీన్ లేని ల్యాప్ టాప్ 

స్క్రీన్ లేని ల్యాప్ టాప్.. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా? మామూలుగా మొబైల్ ఫోన్స్​, ల్యాప్‌టాప్స్​ పనిచేయడానికి మూలం స్క్రీన్. ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటూ దాని అవుట్‌పుట్​ను స్క్రీన్‌లోనే చూస్తాం. మరి అలాంటిది స్క్రీన్ లేకుండా ల్యాప్‌టాప్ వస్తుందని ఊహించడం వింతగా అనిపించొచ్చు. 


స్క్రీన్ లేకుండా పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌ను సైట్‌ఫుల్ అనే కంపెనీ తయారుచేసింది. దీనికోసం ఆ కంపెనీ మూడేళ్లు కష్టపడింది. ఏఆర్ గ్లాసెస్ సాయంతో100 అంగుళాల వర్చువల్ డిస్‌ప్లేను చూపించే విధంగా దీన్ని తయారుచేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఆర్ ల్యాప్‌టాప్ ఇది. దీని పేరు ‘స్పేచ్‌టాప్ జీ1’ ల్యాప్‌టాప్‌.


ఫీచర్లు ఇవే..


క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇది పని చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్16 జీబీ ర్యామ్,128 జీబీ డేటా స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ కోసం, ఈ ల్యాప్‌టాప్‌లో రెండు యుఎస్‌బి టైప్–-సి పోర్ట్స్​, వైఫై7, 5జీ (నానో-సిమ్, ఇ-సిమ్ సపోర్ట్), బ్లూటూత్ వెర్షన్ 5.3కి సపోర్ట్ చేస్తుంది. ల్యాప్‌టాప్‌లో 60Wh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే బ్యాటరీ ఎనిమిది గంటలు వాడొచ్చు. త్వరలోనే స్క్రీన్స్​ ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి రానున్నాయి. 


ఏఆర్ టెక్నాలజీతో పనిచేసే సైట్‌ఫుల్ స్పేచ్‌టాప్ జీ1 ల్యాప్‌టాప్ ధర1700 డాలర్లు. రూపాయిల్లో దీని ధర రూ.1,42,035. మొదట100 డాలర్లు చెల్లించి ఈ ల్యాప్‌టాప్‌ బుక్ చేసుకోవాలి. ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమెరికాలో ఈ ల్యాప్‌టాప్స్​ డెలివరీ మొదలవుతుంది.