టైటిల్ : హీరామండి
డైరెక్షన్ : సంజయ్ లీలా భన్సాలీ
కాస్ట్ : మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి, రిచా చద్దా, సోనాక్షి సిన్హా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్
ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్
బ్రిటిష్ పాలన టైంలో అంటే..1920ల్లో లాహోర్‌లో ఉన్న వేశ్యావాటిక ‘హీరామండి’లో జరిగిన కథ ఇది. హీరామండిలో ఉండే షాహీ మహల్ మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) చేతిలో ఉంటుంది. ఆ ప్రాంతంలోని నవాబులంతా ఆమె మాటే వింటారు. అదే ప్రాంతంలో ఖ్వాభాగ్ అనే మరో మహల్‌ను ఫరీదాన్ (సోనాక్షి సిన్హా) చూసుకుంటుంది. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటుంది.
మల్లికా జాన్ చెల్లి వహీదా (సంజీదా షేక్), ఇద్దరు కూతుళ్లు బిబోజాన్ (అదితిరావ్ హైదరి), ఆలంజేబు (షర్మిన్ సెగల్), దత్తత కూతురు లజ్జో (రిచా చద్దా)లను ‘ప్రేమలో పడితే ప్రమాదంలో పడినట్టే’ అని హెచ్చరిస్తుంటుంది. వీళ్లంతా వేశ్యలుగా ఉంటూనే మల్లికా జాన్ మాట వినిపించుకోకుండా జొరావర్ అనే నవాబుతో లజ్జో, ఫిరోజ్ అనే నవాబుతో వహీదా, వలీ ఖాన్ అనే నవాబుతో బిబోజాన్ ప్రేమలో పడతారు. అప్పటికి ఇంకా వేశ్యగా మారని మల్లికా జాన్ చిన్న కూతురు ఆలంజేబు కూడా బాలోచి నవాబు తాజ్‌దార్ (తాహా షా బహదూర్ షా)ను ప్రేమిస్తుంటుంది.
కానీ.. మల్లిక మాత్రం ఆమెని వేశ్యలా మార్చాలని చూస్తుంది. ఆమె ప్రేమ విషయం మల్లికా జాన్‌తో పాటు తాజ్‌దార్ తండ్రికి కూడా నచ్చదు. ఒక వేశ్య తమ ఇంటి కోడలిగా రాకూడదని చెప్తాడు. ఈ ప్రేమ వ్యవహారంలో మల్లిక ప్రవర్తించిన తీరు ఎవరికీ నచ్చదు. దాంతో వహీదా తన అక్కకు గుణపాఠం చెప్పాలి అనుకుంటుంది. అందుకోసం ఆమె శత్రువు ఫరీదాన్‌తో చేతులు కలుపుతుంది. ట్విస్ట్ ఏంటంటే... బిబోజాన్ (అదితిరావ్ హైదరి) బ్రిటిషర్లతో జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటం కోసం గూఢచారిగా పనిచేస్తుంటుంది. బ్రిటిషర్లకు దగ్గరగా ఉంటూ వాళ్ల రహస్యాలు తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె గూఢచారిగా ఎందుకు మారింది? ఫరీదాన్ ఎలాంటి కుట్రలు పన్నింది? ఈ విషయాలు తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.
ఈ సిరీస్‌లో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ నటించారు. మనీషా కొయిరాలా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సోనాక్షి సిన్హా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్ వంటి స్టార్స్‌ని ఒకే స్క్రీన్‌పై చూడొచ్చు. మల్లికా జాన్ పాత్రలో మనీషా కొయిరాలా ఒదిగిపోయింది. ఫరీదాన్‌గా సోనాక్షి సిన్హా నెగెటివ్ రోల్లో మెప్పించింది. అదితిరావు హైదరి నటన కూడా బాగుంది.
వశమైపోయింది
టైటిల్ : షైతాన్
డైరెక్షన్ : వికాశ్ బెహల్
కాస్ట్ : అజయ్ దేవ్‌గణ్, మాధవన్, జ్యోతిక, జాంకీ బోడివాలా, అంగద్ రాజ్
ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్
కబీర్ (అజయ్ దేవ్ గణ్) కొన్నాళ్లు సరదాగా గడిపేందుకు ఒక ఫామ్‌హౌస్‌కు కుటుంబంతో సహా వెళ్తాడు. దారి మధ్యలో దాబా దగ్గర ఆగినప్పుడు వనరాజ్ (మాధవన్) పరిచయం అవుతాడు. తర్వాత ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోతారు. కట్ చేస్తే.. అదేరోజు రాత్రి కబీర్ ఫామ్‌హౌస్‌కు వచ్చి తలుపుకొడతాడు వనరాజ్. ‘ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకోవాల’ని అడుగుతాడు. అలా ఆ ఇంట్లోకి వెళ్లిన వనరాజ్.. కబీర్ కూతురు జాన్వి (జాంకీ)ని హిప్నటైజ్‌చేసి వశం చేసుకుంటాడు. అప్పటినుంచి వనరాజ్ ఏం చెప్తే ఆమె అదే చేస్తుంటుంది. వనరాజ్ చెప్పాడని తన తల్లిదండ్రులపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంది. ఇంతకీ వనరాజ్ ఎవరు? కబీర్ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేశాడు? జాన్వీని కాపాడటానికి కబీర్ ఏం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాలి.
కబీర్‌గా అజయ్ దేవ్‌గణ్, అతని భార్య పాత్రలో జ్యోతిక చాలా బాగా చేశారు. జాన్వి పాత్రలో నటించిన జాంకీ బోడివాలా కూడా మెప్పించింది. ఈ సినిమాలో హైలైట్ మాధవన్ యాక్టింగ్. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ బాగుంది. కాకపోతే.. ఫస్టాఫ్ ఉన్నంత థ్రిల్ సెకండ్‌ఆఫ్‌లో అనిపించదు.
లోయలో పడిన ఫ్రెండ్ కోసం..
టైటిల్ : మంజుమ్మల్ బాయ్స్
డైరెక్షన్ : చిదంబరం
కాస్ట్ : సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అర్జున్ కురియన్
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్(సౌబిన్ షాహిర్), సుభాష్ (శ్రీనాథ్ భాషి)తో పాటు వాళ్ల ఫ్రెండ్స్ అందరూ సొంత ఊళ్లోనే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, అందరూ కలిసికట్టుగా ఉంటారు. ఈ గ్యాంగ్‌కి ‘మంజుమ్మల్ బాయ్స్’ పేరుతో ఒక అసోసియేషన్ కూడా ఉంటుంది. ఒకసారి ఈ గ్యాంగ్ కొడైకెనాల్ టూర్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కానీ.. ఈ గ్యాంగ్‌లోని సుభాష్ ‘నేను ట్రిప్‌కు రాన’ని చెప్తాడు. కచ్చితంగా రావాలని కుట్టన్ బలవంతం చేయడంతో ఆఖరి నిమిషంలో వాళ్లతో బయల్దేరుతాడు. అందరూ కొడైకెనాల్‌లోని అన్ని టూరిస్ట్ ప్లేస్‌లు చూస్తారు.
చివరికి గుణ కేవ్స్ చూడటానికి వెళ్తారు. అయితే.. ఆ గుహలు చాలా ప్రమాదకరం. అక్కడ వందల అడుగుల లోతున లోయలు ఉంటాయి. వాటిలో ఒకటి డెవిల్స్ కిచెన్.150 అడుగులకు పైగా లోతున్న ఈ లోయలో 13 మందికి పైగా పడి చనిపోయారు. అందుకే ఆ ప్రాంతానికి పోలీసులు ఎవర్నీ వెళ్లనివ్వరు. కానీ.. ఎలాగైనా వాటిని చూడాలనే ఉద్దేశంతో మంజుమ్మల్ బాయ్స్ అక్కడున్న సెక్యురిటీ సిబ్బందిని బురిడీ కొట్టిస్తారు. ఫెన్సింగ్ దాటి కేవ్స్‌లోకి వెళ్తారు. అక్కడివరకు బాగానే ఉంది. కానీ అనుకోకుండా సుభాష్ డెవిల్స్ కిచెన్ లోయలో పడిపోతాడు. ఆ తర్వాత ఏమైంది? సుభాష్‌ను కాపాడేందుకు మంజుమ్మల్ బాయ్స్ ఏం చేశారు? అనేది కథ.
ఈ సినిమాని 2006లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా తీశారు. గుణ కేవ్స్‌లో చిక్కుకున్న తమ ఫ్రెండ్‌ని కాపాడేందుకు ఎర్నాకులం మంజుమ్మల్ బాయ్స్ చేసిన సాహసాన్ని సినిమాగా మలిచారు. అందరి యాక్టింగ్ బాగుంది. కానీ.. కథ కాస్త నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది.
ఆ ఆత్మ ఎవరిది?
టైటిల్ : గార్డియన్
డైరెక్షన్ : గురుశరవణన్, శబరి
కాస్ట్ : హన్సిక మోత్వాని, సురేష్ మేనన్, రాజేంద్రన్
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
అపర్ణ (హన్సిక) ఇంటీరియర్ డిజైనర్. ఓ ప్రమాదంలో గాయపడిన అపర్ణ జీవితం అంతా తారుమారు అవుతుంది. ఆమె ఏదైనా మంచి చేయాలి అనుకుంటే చెడు జరుగుతుంటుంది. అదంతా ఏదో అసహజంగా ఉందనిపిస్తుంది ఆమెకు. అందుకని అలా ఎందుకు జరుగుతుందో కారణాలు తెలుసుకునేందుకు సైకియాట్రిస్ట్‌ని కలుస్తుంది. వాస్తవానికి ఆమెని ఒక ఆత్మ ఆవహిస్తుంది. అపర్ణ సాయంతో సిటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కొంతమందిపై ప్రతీకారం తీర్చుకోవడానికి అపర్ణలోకి ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? అపర్ణ శరీరంలోకి ఎలా వచ్చింది? ఆ ఆత్మ వల్ల అపర్ణ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది అసలు కథ. సినిమా చూస్తుంటే.. కొన్నిసార్లు బోర్‌గా అనిపిస్తుంది. రెగ్యులర్ రివెంజ్ డ్రామాలానే ఉంటుంది.
ఊరంతా కరెంట్ కట్
టైటిల్ : లైన్‌మెన్
డైరెక్షన్ : రఘు శాస్త్రి
కాస్ట్ : త్రిగుణ్, కాజల్, జయశ్రీ, హరిణి శ్రీకాంత్
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
నట్టు(త్రిగుణ్) ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అనే ఊళ్లో లైన్‌మెన్‌గా పనిచేస్తుంటాడు. గ్రామంలో కరెంట్ సరిగ్గా సప్లై అయ్యేలా చూడడమే అతని పని. అదే ఊళ్లో గర్భిణీలకు పురుడు పోస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంటుంది దేవుడమ్మ(జయశ్రీ). ఆమె అంటే ఆ ఊళ్లో అందరికీ గౌరవం. 99 ఏళ్లు నిండి వందో సంవత్సరంలోకి అడుగుపెడుతుండడంతో ఆమె పుట్టిన రోజును ఘనంగా జరపాలని నట్టు ప్లాన్ చేస్తాడు.
రంగురంగుల లైట్ల మధ్య కేక్ కట్ చేయించాలి అనుకుంటాడు. అనుకున్నట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తారు. కానీ.. ఆ రోజు రాత్రి నట్టు కరెంటు సప్లై ఆపేస్తాడు. అందరూ నిరాశపడతారు. ఆ ఒక్కరోజే కాదు.. ఆ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆ ఊరివాళ్లు కరెంట్ లేకుండానే గడపాల్సి వస్తుంది. అందుకు కారణాలేంటి? నట్టు ఎందుకలా చేశాడు? ఆ గ్రామస్తులు ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చింది?