దొరికిపోయాడా?
టైటిల్ : అన్ దేఖీ సీజన్ 3
డైరెక్షన్ : ఆశిష్ ఆర్ శుక్లా
కాస్ట్ : సూర్య శర్మ, శివంగి సింగ్, ఆంచల్ జి సింగ్, అంకుర్ రాథీ, దిబ్యేందు భట్టాచార్య, హర్ష్ ఛాయా, మీనాక్షి సేథి, శివాని సోపోరి, వరుణ్ బడోలా
ప్లాట్ ఫాం : సోనీ లివ్
సోనీలివ్‌లో 2020లో అన్ దేఖీ మొదటి సీజన్ రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత 2022లో అన్ దేఖీ సీజన్–2 వచ్చింది. ఈ రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్ రావడంతో రెండేండ్ల తర్వాత ఇప్పుడు మూడో సీజన్‌ని తీసుకొచ్చింది. కథ విషయానికి వస్తే.. ఒక అమాయకపు యువతి హత్యతో మొదలవుతుంది. ఆ కేసు సురీందర్ సింగ్ అత్వాల్ అలియాస్ పాపాజీ ( హర్ష్ ఛాయా )ని వెంటాడుతుంది. దానికి కారణం.. ఆ హత్యకు సంబంధించిన ఒక వీడియో క్లిప్‌లో అతను కనిపించడమే.
అతని మేనల్లుడు రింకు ( సూర్య శర్మ ), కొడుకు దామన్ (అంకుర్ రాథీ) పాపాజీని రక్షించడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. డీఎస్పీ వరుణ్ ఘోష్ ( దిబ్యేందు భట్టాచార్య) మాత్రం హత్యకు గురైన అమ్మాయికి న్యాయం చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తుంటాడు. చివరకు పాపాజీ ఆ హత్య కేసు నుంచి తప్పించుకున్నాడా? లేదా? అనేదే అసలు కథ. అన్ దేఖీ మొదటి సీజన్ కథ బాగుండడంతో భారీ విజయాన్ని దక్కించుకుంది. దాంతో మేకర్స్ కథను పొడిగించి.. మరో రెండు సీజన్లు తీసుకొచ్చారు. అయితే.. ప్రతి సీజన్‌కు క్వాలిటీ తగ్గుతోంది. యాక్టర్స్ నటన మాత్రం అన్ని సీజన్లలో బాగుంది.
మోసం చేసిన అవకాశం
టైటిల్ : చిత్రం చూడర
డైరెక్షన్ : ఆర్ ఎన్ హర్షవర్ధన్
కాస్ట్ : వరుణ్ సందేశ్, శీతల్ భట్, ధనరాజ్, శివాజీరాజా, కాశీ విశ్వనాథ్, రవిబాబు, మీనాకుమారి, అన్నపూర్ణ, రచ్చ రవి
ప్లాట్ ఫాం : ఈటీవీ విన్
సినీ ఇండస్ట్రీలో ఒక ప్రొడక్షన్ కంపెనీకి మేనేజర్ మల్లేశం (శివాజీ రాజా). బాలా (వరుణ్ సందేశ్) ‘రుక్మిణి డ్రామా కంపెనీ’లో డ్రామా ఆర్టిస్ట్‌గా ఉంటాడు. బాలా పవన్ కల్యాణ్‌కి వీరాభిమాని. డ్రామా కంపెనీ కోసం వేరే ఊరికి లొకేషన్స్ చూసేందుకు వెళ్తాడు. అక్కడ మల్లేశంను కలుస్తాడు. ‘‘నేను తీయబోయే సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్ర ఉంది. అది చేయాలంటే హైదరాబాద్ వచ్చి నన్ను కలువు’’ అని బాలాతో చెప్తాడు మల్లేశం. తనకు సినిమాలో వచ్చిన ఛాన్స్ గురించి ఫ్రెండ్స్ రంగారావు (కాశీ విశ్వనాధ్), మొద్దు (ధనరాజ్) లతో కలిసి హైదరాబాద్‌కి వెళ్తాడు. హైదరాబాద్ వెళ్లిన వీళ్లు తమకు తెలియకుండా ఒక దొంగతనం కేసులో ఇరుక్కుంటారు.
తామెందుకు అరెస్ట్ అయ్యామో తెలియక ఇబ్బందిపడుతున్న వీళ్ల ముగ్గురికి జూనియర్ ఆర్టిస్ట్ చిత్ర (శీతల్ భట్) ఏం సాయం చేసింది? అసలు ఆ ముగ్గురు ఆ కేసునుంచి బయటపడ్డారా? లేదా? అనేది సినిమా. సీనియర్ నటుడు శివాజీ రాజా నటన మాత్రమే చెప్పుకోదగిన అంశం. కొన్ని సీన్స్‌లో మంచి ఎమోషన్స్ పండించాడు. ఇలాంటి సినిమాల్లో కథనం ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అదే ఇందులో మిస్ అయ్యింది.
సౌదీలో జీవితం
టైటిల్ : ది గోట్ లైఫ్
డైరెక్షన్ : బ్లెస్సీ
కాస్ట్ : పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్, జిమ్మీ జీన్–లూయిస్, కేఆర్ గోకుల్, తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
నజీబ్(పృథ్వీరాజ్ సుకుమారన్) సొంతూళ్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. భార్య సైను(అమలాపాల్) గర్భవతి. పుట్టబోయే బిడ్డకు మంచి భవిష్యత్ ఇవ్వాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి అని ఆశపడతాడు. అందుకోసం చాలా డబ్బుకావాలి. సౌదీకి వెళ్తే బాగా డబ్బు సంపాదించొచ్చు. దాంతో ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు అనుకుంటాడు. ఇంటిని తాకట్టు పెట్టి మరీ30 వేల రూపాయలు అప్పు తీసుకొని సౌదీకి వెళ్తాడు. అతనితో పాటు హకీమ్(కేఆర్ గోకుల్) కూడా వెళ్తాడు. వాళ్లకు హిందీ, ఇంగ్లిష్ తెలియవు. పైగా అంతకుముందు విదేశాలకు వెళ్లిన ఎక్స్‌పీరియెన్స్ లేదు. అలాంటివాళ్లు ఎయిర్‌పోర్ట్‌లో దిగి తమ స్పాన్సర్ కోసం ఎదురు చూస్తుంటారు. అది గమనించిన ఖఫీల్ (తాలిబ్ అల్ బలూషి) వాళ్లను మోసం చేయడం సులభమని అర్థం చేసుకుంటాడు.
వాళ్లను తన వెంట తీసుకెళ్తాడు. నజీబ్‌ని ఎడారి ప్రాంతంలోని ఒక పొలంలో గొర్రెలు, మేకలు, ఒంటెలు కాసే పనిలో పెడతాడు. హకీమ్‌ని మరోచోటికి తీసుకెళ్తాడు. ఆ ఎడారిలో నజీబ్‌కు ఎదురైన ఇబ్బందులు ఏంటి? అక్కడి నుంచి బయటపడేందుకు నజీబ్ ఎన్ని కష్టాలుపడ్డాడు? ఆఫ్రికన్ ఇబ్రహం ఖాదిరి (జిమ్మీ జీన్ లూయిస్) నజీబ్‌కి చేసిన సాయం ఏంటి? అనేది సినిమా. పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూలీ పాత్రలో ఒదిగిపోయాడు. బాడీ లాంగ్వేజ్‌తో సహా అన్నీ బాగున్నాయి. మిగతావాళ్లు కూడా బాగానే నటించారు. ఇక కథ విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ.. పెద్దగా విసుగు తెప్పించదు.
మెట్రో కలిపిన స్నేహం
టైటిల్ : 8 ఎ.ఎం. మెట్రో
డైరెక్షన్ : రాజ్ రాచకొండ
కాస్ట్ : గుల్షన్ దేవయ్య, సమామీ ఖేర్, కల్పికా గణేష్, నిమిషా నాయర్, ఉమేష్ కామత్, మహేందర్ (30 వెడ్స్ 21 ఫేమ్)
ప్లాట్ ఫాం : జీ5
మల్లేశం సినిమాతో రాజ్ రాచకొండ తెలుగు చిత్రసీమకు దర్శకుడిగా, నిర్మాతగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా తర్వాత తీసిన సినిమా ‘8 ఎఎం మెట్రో’. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ‘అందమైన జీవితం’ నవలను నేటి పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించాడు. హైదరాబాద్ నేపథ్యంలో తీసిన ఈ సినిమా కథలోకి వెళ్తే... ఇరావతి (సయామీ ఖేర్) భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నాందేడ్‌లో ఉంటుంది. హైదరాబాదులో ఉన్న చెల్లెలు ఒక రోజు ఫోన్ చేసి ‘‘ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో చేరా. మా ఆయన అమెరికాలో ఉన్నాడు. నాకు తోడుగా ఉండేందుకు రా” అని అడుగుతుంది. అయితే ట్రైన్లో వెళ్ళడానికి ఇరావతి చాలా భయపడుతుంది. భర్త ఎలాగోలా నచ్చచెప్పి ట్రైన్ ఎక్కిస్తాడు. హైదరాబాద్ వచ్చాక ఆస్పత్రి నుంచి చెల్లెలు ఇంటికి మెట్రో రైల్లో ఎక్కి వెళ్లాల్సి వస్తుంది. దాంతో మెట్రో స్టేషన్‌కి వెళ్లిన ఇరావతికి భయంతో చెమటలు పడతాయి. అప్పుడు ఇరావతికి వాటర్ బాటిల్ అందిస్తాడు ప్రీతమ్ (గుల్షన్ దేవయ్య).
అలా మెట్రోలో పరిచయమైన ఇరావతి, ప్రీతమ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది.
ఇరావతి హైదరాబాదులో ఉన్నన్ని రోజులూ అతన్ని కలుస్తుంది. అలా కలిసినప్పుడల్లా ఫిల్టర్ కాఫీ తాగడం నుంచి పుస్తకాలు చదవడం, కొనడం, ఇరావతి కవితలను ప్రీతమ్ ప్రశంసించడం వరకు... బోలెడు కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరూ. ఆ పరిచయం ఏ తీరాలకు చేరింది? హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్ళేముందు ప్రీతమ్ గురించి ఇరావతి తెలుసుకున్న నిజం ఏమిటి? ప్రీతమ్ భార్య మృదుల (కల్పికా గణేష్) పాత్ర ఏమిటి? ట్రైన్ అంటే ఇరావతికి ఎందుకు అంత భయం? చివరకు ఆమె ఏం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాలి.
పెళ్లి కాని అబ్బాయి, అమ్మాయిలే కాదు పెళ్లయిన ఆడ, మగ సన్నిహితంగా ఉన్నా కూడా ఇప్పటికీ చెవులు కొరుక్కునే కొందరు ఉన్నారు ఈ సమాజంలో. అటువంటి వాళ్ళ కళ్ళు తెరిపించే సినిమా ఇది అని చెప్పొచ్చు. అలాగని, క్లాస్‌లు తీసుకున్నట్టు ఉండదు. ఈ సినిమాలోని పాత్రల్లో సహజత్వం, జీవం కనిపిస్తాయి. పాత్రల భావోద్వేగాలు, వాటి వెనుక నేపథ్యాలను తెరమీద చూపించిన తీరు బాగుంది. సినిమా స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు కథలోకి వెళ్ళడానికి టైమ్ పట్టింది.
గుల్జార్ కవితల గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది? సయామీ ఖేర్ మధ్య తరగతి గృహిణి రోల్లో జీవించింది. ప్రీతమ్ పాత్రలో గుల్షన్ దేవయ్య నటన బాగుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మెట్రోలో అటువంటి కో– పాసింజర్ మనకూ పరిచయం అయితే బాగుండు అనిపిస్తుంది. ఫీల్ గుడ్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా మంచి ఆప్షన్.
గ్యాంగ్ స్టర్
టైటిల్ : ఆవేశం
డైరెక్షన్ : జీతూ మాధవన్
కాస్ట్ : ఫహద్ ఫాజిల్, హిప్‌స్టర్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాస్, షాజిన్ గోపు, మన్సూర్ అలీఖాన్
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
కేరళకు చెందిన అజు (హిప్‌స్టర్), బీబీ (మిథున్ జై శంకర్), శంతన్ (రోషన్ షానవాజ్) ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదవడానికి బెంగళూరుకు వెళ్తారు. కాలేజ్ హాస్టల్‌లో కన్నా బయట ఉంటే ఫ్రీడమ్ ఉంటుందని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో చేరతారు. కాలేజీలో సీనియర్ కుట్టి (మిధుట్టి)తో గొడవ పడతారు. దాంతో కుట్టి వాళ్లను ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాడు. తన గ్యాంగ్‌తో కలిసి ర్యాగింగ్ చేస్తాడు. బట్టలు ఊడదీసి చిత్రహింసలుపెడతాడు. దాంతో ఈ ముగ్గురు కలిసి కుట్టీపై పగ తీర్చుకోవాలి అనుకుంటారు. అందుకు లోకల్ గ్యాంగ్‌స్టర్ రంజిత్ గంగాధర్ అలియాస్ రంగా (ఫహద్ ఫాజిల్)ని కలుస్తారు. వీళ్లని ఏడిపించిన సీనియర్లను చితకబాదుతాడు రంగా. అజు, బీబీ, శాంతన్‌లను తన గ్యాంగ్‌లో చేర్చుకుని సొంత తమ్ముళ్లలా చూస్తాడు.
హాస్టల్‌లో ఇబ్బందిగా ఉంటుందని తన ఇంటిని వాళ్లకు ఇచ్చేస్తాడు. అప్పటినుంచి వాళ్లపై రంగా మనుషులనే ముద్ర పడుతుంది. వాళ్లకు కాలేజీలో ఎదురే ఉండదు. దాంతో చదువు పక్కదారి పడుతుంది. అందరూ ఫెయిల్ అవుతారు. అందుకే ఎలాగైనా రంగా నుంచి దూరంగా వెళ్లిపోయి చదువుకోవాలని అనుకుంటారు. మరి రంగా వీళ్లను వదిలిపెట్టాడా? ఇంతకీ రంగాకు వాళ్లంటే ఎందుకంత ఇష్టం. రంగా నుంచి వాళ్లు ఎలా తప్పించుకున్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గ్యాంగ్‌స్టర్‌గా ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది. కాలేజ్ కుర్రాళ్లుగా హిప్‌స్టర్, మిథున్, రోషన్ బాగా నటించారు. కథ సింపుల్‌గా ఉన్నా.. తెరకెక్కించిన విధానం బాగుంది. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ ఫహద్ యాక్టింగ్.