నిండా ముంచిన గండి ..  పెద్ద చెరువు నుంచి పొలాల్లోకి ఇసుక మేటలు, వరద

  • కొట్టుకుపోయిన పత్తి, వరి, పామాయిల్​ మొక్కలు
  • పరిస్థితిని పరిశీలించిన మంత్రి పొంగులేటి నష్టపరిహారం ప్రకటన

భద్రాద్రికొత్తగూడెం/ అశ్వారావుపేట, వెలుగు : అశ్వారావుపేట మండలంలోని పెద్ద చెరువుకు పడిన గండి రైతులను నిండా ముంచింది. పంట పొలాల్లో, పామాయిల్​ తోటల్లో ఎక్కడ చూసినా ఇసుక మేటలు, బురదే కనిపిస్తోంది. ఈ నెల 18న పడిన గండివల్ల దాదాపు 400 నుంచి 500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.  గండి పడి నాలుగు రోజులైనా పొలాల్లోకి వరద ఆగట్లేదు. రూ. వేలల్లో అప్పు చేసి పెట్టిన పెట్టుబడి వరద నీటిలో కొట్టుకుపోయిందని రైతులు వాపోతున్నారు.
 
పరిహారం ప్రకటన

ప్రాజెక్ట్​ కు వెంటనే రిపేర్లు చేసేందుకు ప్రభుత్వం రూ. 8కోట్లు సాంక్షన్​ చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. పెద్ద చెరువును ఆయన సోమవారం సందర్శించారు. పరిస్థితిపై ఇరిగేషన్​ ఆఫీసర్లు, కలెక్టర్​ను అడిగి తెలుసుకున్నారు. ఇసుక మేటను తొలగించుకునేందుకు ఎకరానికి రూ. 10వేలు పరిహారం ఇస్తున్నట్టు , గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి ఒక్కొక్కదానికి రూ. 3వేలు, వరదలో పశువులు కోల్పోయిన వారికి ఒక్కొక్కటికి రూ. 20వేలు ఇస్తామని, వరి, పత్తి విత్తనాలు ఉచితంగా అందిస్తామని చెప్పారు.

ఇండ్లు కోల్పోయిన వారికి సెప్టెంబర్​ లోగా ఇందిరమ్మ ఇండ్లను  కట్టిస్తామన్నారు. గండి పడడంలో ఇరిగేషన్​ ఆఫీసర్ల నిర్లక్ష్యం కనిపిస్తోందని మంత్రి చెప్పారు. వరద ను అంచనా వేయడంలో ఆఫీసర్లు ఫెయిల్​ అయ్యారన్నారు. ప్రాజెక్టు మూడో గేట్​ను ఎత్తకపోవడం వల్ల ప్రమాదం ముంచుకొచ్చిందని , ఇప్పటికే ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఖరీఫ్​ సీజన్​లో రైతులను ఆదుకునే క్రమంలో పంటలకు నీళ్లు ఇచ్చేందుకు ఫీడర్​ ఛానల్​ ఏర్పాటు చేయడమా, రింగ్​ బంద్​​ ఏర్పాటు చేయడమా అన్న విషయాలను సీనియర్​ ఆఫీసర్లతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. వరదలో చిక్కుకున్న రైతులు, రైతు కూలీలను కాపాడడంలో ఆంధ్రప్రదేశ్​ సహకారం మరువలేనిదన్నారు.

హెలీ కాప్టర్​ సాయంతో వరదలో చిక్కుకున్న వారిని రక్షించినందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్​ రెండు రాష్ట్రాలకు సంబంధించిందని, ఏపీ సీఎంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చర్చిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​, ఎస్పీ బి. రోహిత్​ రాజు, ఐటీడీఏ పీఓ రాహూల్​, ఇరిగేషన్​తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

రూ.15లక్షల నష్టం

ఈ గండితో రూ. 15లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. 23 ఎకరాల్లోని పామాయిల్​ తోటలో ఇసుక మేటలు వేశాయి. మూడు ఎకరాల్లో మిర్చి నారు కొట్టుకుపోయింది. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టా, పెద్ద వాగు గండి రూపంలో పెట్టుబడిని మింగేసింది. 

సీహెచ్​. వెంకటేశ్వర్లు 

పొలమంతా ఇసుక మేటలు

నాకు సెంటు భూమి లేదు. ఏడెకరాలు కౌలుకు తీసుకున్నా.  ఎకరానికి ఏడు బస్తాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని వరి వేశా. పెద్దచెరువుకు పడిన గండితో పొలమంతా ఇసుక మేటలు, బురదతో కూరుకుపోయింది. ఇప్పుడు మళ్లీ అప్పు చేసి పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. 

తుమ్మల సాంబశివరావు