సెస్ లో బకాయిలు ఫుల్ .. వసూళ్లు నిల్

  • సెస్ లో  పెరిగిపోతున్న మొండి బకాయిలు
  • పెండింగ్ లిస్టులో ప్రభుత్వ కార్యాలయాలు

రాజన్న సిరిసిల్ల,వెలుగు:  సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) లో పెద్దఎత్తున   బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి.    గ్రామపంచాయతీ నుంచి  కలెక్టరేట్   వరకు  బకాయిలు పేరుకుపోయాయి.  వీటిని వసూల్​ చేసేందుకు  అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  

పెండింగ్ లిస్ట్ లో ప్రభుత్వ కార్యాలయాలు ..

 సెస్​కు  ప్రభుత్వ కార్యాలయాల నుంచే  పెండింగ్ బకాయిలు ఉండటం   ఆశ్చర్యంగా మారింది.   
వేములవాడ లోని సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి రూ.2లక్షల53వేల  బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని  ఇటీవల సెస్​ అధికారులు ఆ ఆఫీస్​కు కరెంట్​ కట్​ చేశారు. బకాయిల చెల్లిస్తామని హామీ ఇచ్చాకే సెస్​ అధికారులు కరెంట్​ పునరుద్దరించారు.
 
మనుగడ ప్రశ్నార్థకమే ! 

సెస్​కు 54ఏండ్ల చరిత్ర  ఉంది.  అంతర్జాతీయ గుర్తింపూ ఉంది. కానీ ఇలా భారీ మొత్తంలో బకాయిలు పెరిగితే భవిష్యత్తులో సెస్​ మనుగడకే ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.  

నోటీసులకే పరిమితం!

బకాయిల రికవరీకి అధికారులు కేవలం నోటీసులు పంపి  ఊరుకుంటున్నారని,  కానీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  మరోవైపు  సంస్థలో అవినీతి, అక్రమాలు,  సెస్​లో రాజకీయ జోక్యం వల్ల సెస్​ నష్టపోతోందని  పలువురు అంటున్నారు. దీని వల్లే లాభాల్లో ఉన్న సెస్​ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్తోందని చెబుతుననారు.  

సెస్​  సంస్థను కాపాడి, పునర్వైభవం తేవాలంటే  దీన్ని ఎన్పీడీసీ ఎల్ లో కలపాలని  తెలంగాణ రాష్ర్ట విద్యుత్ నియంత్రణ మండలి ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.  గతంలో ఇక్కడ జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన నివేదిక ఇప్పటికీ రాలేదు.  ముఖ్యమైన ఫైళ్లు దగ్ధమైనప్పటికీ పోలీసుల దర్యాప్తు వేగం అందుకోకపోవడం గత   పాలకులపై అనుమానాలకు తావిస్తోంది.  

సామాన్యులపై కఠిన చర్యలు

విద్యుత్ బకాయిలు   ప్రభుత్వ కార్యాలయాలు,   బడా సేట్ల నుంచి కోట్లలో పెండింగ్​లో ఉన్నా అధికారులు మాత్రం  నోటీసులు జారీ చేసేందుకే పరిమితం అయ్యారు.  కానీ, సామాన్య గృహ  వినియోగదారులకేమో విద్యుత్ కనెక్షన్​ కట్ చేస్తున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లిస్తేనే  కరెంట్ ను పునరిద్దరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

వసూళ్ల కోసంతర్జనభర్జనలో అధికారులు

పెండింగ్ బిల్లులు కోట్లలో ఉంటే వసూళ్లు మాత్రం వేలు,   లక్షల్లో  ఉన్నాయి .  వారం రోజుల కిందట వేములవాడ మున్సిపల్ కు ఒక రోజు కరెంట్ కట్ చేస్తే  పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.  సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ లు రెండు కలిపి 7 కోట్ల వరకు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. వీటికి నోటీసులు జారీ చేసినప్పుడల్లా  రెండు లక్షలు చెల్లించి కరెంట్ కనెక్షన్ పునరుద్దరించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల బకాయిల వసూల్లకు సెస్  పాలక వర్గం, అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  పెండింగ్ బకాయిలు సెస్ ను  కలవరపెట్టడమే కాకుండా సంస్థ అభివృద్ధి కి బకాయిలు  అడ్డకట్టగా మారుతున్నాయి.

రికవరీకి చర్యలు.. 

జిల్లా వ్యాప్తంగా పెండింగ్​లో  ఉన్న బకాయిలను  రికవరీ చేపడుతున్నాం. దీని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిత్యం బిల్లులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రతినెల నోటీసులు పంపిస్తున్నాం. నిధులు మంజూరు అయినప్పుడు ప్రభుత్వ కార్యాలయాల పెండింగ్ బిల్లులు కొంతమేర చెల్లిస్తున్నారు. మొదట ఎక్కువ మొత్తంలో పెండింగ్ బిల్లులు ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. అయినప్పటికీ వినియోగదారుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో వినియోగదారులే పెద్ద మనసుతో ఆలోచించి పెండింగ్ బకాయిలను సకాలంలో చెల్లించి, సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. 

సెస్ ఇన్​చార్జి ఎండీ ఎల్. శ్రీనివాస్ రెడ్డి