లాప్రోస్కోపిక్​ చికిత్సతో కణతి తొలగింపు : డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి

హనుమకొండ సిటీ, వెలుగు: అడ్రినల్ గ్రంథిలో కణతిని లాప్రోస్కోపిక్ పద్ధతిలో తొలగించి రోగి ప్రాణాలను కాపాడామని హనుమకొండ శ్రీనివాస కిడ్నీ సెంటర్  వైద్యుడు యూరాలజిస్ట్ డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లో కొన్ని ఆస్పత్రులకు పరిమితమైన ఈ చికిత్సను ఇప్పుడు హనుమకొండలో అందుబాటులోకి తెచ్చామన్నారు. శ్రీనివాస కిడ్నీ సెంటర్​లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ కు చెందిన మానస ఎడమవైపు కడుపునొప్పితో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది చివరికి తమ హాస్పిటల్​కు వచ్చినట్లు డాక్టర్ తెలిపారు.

ఆమెకు ఎడమ అడ్రినల్ గ్రంథిలో కణతి ఉందని గుర్తించామన్నారు. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ అని రోగికి వివరించి లాప్రోస్కోపిక్ పద్ధతిలో మూడు గంటల పాటు శ్రమించి కణతిని తొలగించి ఆపరేషన్ ను విజయవంతం చేశామన్నారు. యూరాలజిస్ట్ డాక్టర్ రాంప్రసాద్ రెడ్డితోపాటు డాక్టర్లు అభినయ్, ప్రభు రామ్, అనస్తీషియా వైద్యులు సామ్రాట్ తదితరులు లాప్రోస్కోపిక్ సర్జరీలో పాల్గొన్నారు.