తెలంగాణలో గాడి తప్పిన భూసేకరణ

 నీరు, ప్రకృతి వనరులు. భూమి ఒక వ్యక్తిగత ఆస్తిగా ఏనాడో సమాజం, ప్రభుత్వాలు గుర్తించాయి. నీటిని కూడా గత దశాబ్ద కాలంగా పూర్తిగా కాకున్నా ఒక రకంగా వ్యక్తిగత ఆస్తిగా మారింది. సమాజం నీటి వనరులను ప్రైవేటు ఆస్తిగా గుర్తించలేదు. నదులను, చెరువులను, సముద్రాలను ఉమ్మడి వనరుగానే గుర్తింపు ఉన్నా వాడకంలో కొంత ‘ప్రైవేటీకరణ’ కనపడుతున్నది. ఒక బాటిల్ కొనుక్కోవడం అంటే దాని సోర్స్ ఎవరికో ధారాదత్తం అయినట్టే.  

మిషన్ భగీరథ, నీటికి పైపులైన్ల వ్యవస్థ, భారీ సాగునీటి ప్రాజెక్టులు, ఆయకట్టు కింద కాలువల వ్యవస్థ నీటిని ‘సర్కారు’ ఆస్తిగా మార్చినాయి. సర్కారు నిర్ణయించిన వారికి ఆ నీరు అందుతుంది. పైకి ఎన్ని లక్ష్యాలు ప్రకటించినా కార్పొరేటీకరణ నేపథ్యంలో అంతిమంగా సర్కారు తన విధానాల ద్వారా, చట్టాల ద్వారా ప్రకృతి వనరులను ప్రైవేటు ఆస్తిగా మారుస్తున్నది. ఇదే మంచిది అని భావించే ఆర్థికవేత్తలకు, ఉదారవాదులకు, విదేశీయులకు కొదవ లేదు. ఎందుకంటే, ప్రైవేటు అంటే మన దేశంవారే కానక్కరలేదు. ప్రపంచం కుగ్రామం అని భావించేవారికి మన పౌరులు, విదేశీయుల మధ్య తేడా కనిపించదు. 

ల్యాండ్ మార్కెట్ పెరగాలంటే మొట్టమొదటి సూత్రం భూమి మీద హక్కులను సరళీకృతం చేసి, కొన్నవారి హక్కుకు చట్టపర రక్షణ కల్పించడం. ఆ రక్షణ కల్పించే వ్యవస్థకు ఆధారం ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెగ ప్రయత్నం చేస్తున్న భూమి రికార్డుల డిజిటలైజేషన్.  ఒకవైపు పెట్టుబడులకు అనుగుణంగా భూమిని, భూమి యాజమాన్య నియంత్రణ వ్యవస్థను మారుస్తున్న ప్రభుత్వం, ఇంకొక వైపు భూమి బదలాయింపు ప్రక్రియలు కూడా కొనసాగిస్తున్నది.  

మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల అభివృద్ధి , పట్టణాల అభివృద్ధి  కోసం భూమిని తీసుకుంటున్నారు. వ్యతిరేకిస్తే చట్టాలు తెస్తున్నారు.  తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు లక్ష ఎకరాల ప్రైవేటు, అటవీ భూములను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా కాళేశ్వరం, పాలమూరు-–రంగారెడ్డి,  సీతారాం సాగర్, దేవాదుల, ఎలిమినేటి  మాధవరెడ్డి ప్రాజెక్ట్,  డిండి,  ఎల్లంపల్లి సహా ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులకు తీసుకోవాలనుకున్నారు. 

గత ప్రభుత్వం కొత్త భూసేకరణ చట్టం తెచ్చింది 

పారిశ్రామిక అవసరాల కోసం 2,50,000 ఎకరాల్లో ల్యాండ్‌‌బ్యాంకు నిర్మించాలని సంకల్పించింది. హైద రాబాద్ ఫార్మా సిటీ, జహీరాబాద్‌‌లో నిమ్జ్‌‌తో సహా మరికొన్ని పారిశ్రామిక ప్రాజెక్టులను ప్రకటించింది. మిషన్ భగీరథ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు, రోడ్ల విస్తరణకు, ఇంకా అనేక ఇతర ప్రాజెక్టులకు కూడా భూమి అవసరమని గుర్తించిన తగిన చట్టపరచర్యలు చేపట్టింది.

 భూసేకరణకు ప్రజల నుంచి ప్రతిఘటనను ఊహించి, కేంద్ర భూసేకరణ చట్టం 2013 వద్దని, తెలంగాణ ప్రభుత్వం తనకు తానుగా సేకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. భూసేకరణ సులభతరం చేయడానికి తెచ్చిన చట్టం ఇదివరకు బ్రిటిష్ చట్టం స్థాయిలో లేదా అంతకంటే ఘోరంగా ఉన్నా  ప్రజా ప్రతినిధులు ఎవరూ పట్టించుకోలేదు. 

భూసేకరణతో జీవనోపాధి కరువు

అత్యంత వివాదాస్పద హైదరాబాద్ ఫార్మా సిటీతో సహా హైవే ప్రాజెక్టులు, మెట్రో రైలు, రైల్వేలు, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌‌షిప్ ప్రాజెక్టుల కోసం భూసేకరణ వేగాన్ని పెంచేందుకు చర్చ లేకుండానే తెలంగాణ భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చారు. హైదరాబాద్ ఫార్మా సిటీ పరిధిలో సుమారు 7 వేల ఎకరాలను జీఓ నెం.45 ద్వారా సేకరించగా దానిని హైకోర్టు కొట్టివేసింది. ఈ ప్రాజెక్టు కోసం 19,333 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం భావించింది.

 అప్పట్లో తెలంగాణా ప్రభుత్వం భూసేకరణకు జారీ చేసిన ఉత్తర్వు భూసేకరణ,  పునరావాస చట్టం, 2013లో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కును ఉల్లంఘిస్తుంది అని తెలంగాణా హైకోర్టు ఒక కేసు విషయంలో వ్యాఖ్యానించింది. 2013 చట్టంలో ఉన్న లోపాన్ని కూడా ఎత్తి చూపింది.  ఇది కేవలం భూములు, ఇతర స్థిరాస్తులను రాష్ట్రం స్వాధీనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రాజెక్టుల వల్ల నిర్వాసితుల పునరావాసానికి ఈ చట్టం పనిచేయదు. భూ సేకరణ వల్ల భూయజమానులే కాకుండా, వ్యవసాయ కార్మికులు, కౌలురైతులు, చేతివృత్తిదారులు, గ్రామీణ ఉపాధి మీద ప్రభావం పడుతున్నది అని హైకోర్టు గుర్తించింది. 

భూసేకరణ కోసం చట్టం

 భూమి యజమానులకు ఒకేసారి తాను నిర్ణయించిన ధర చెల్లించడం ద్వారా భూమిని సేకరించేందుకు ప్రభుత్వానికి 2017 చట్టం అధికారం ఇస్తుంది. ఈ చట్టంలో ప్రాజెక్ట్ వలన నిర్వాసితులు అయ్యే బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారానికి విధివిధానాలను తయారు చేయలేదు. జనవరి 2014 నుంచి నోటిఫై చేశారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి. ఈ సరళీకరణ కేవలం జాతీయ ప్రయోజన ప్రాజెక్టులకే కాకుండా పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌‌షిప్ విధానంలో చేపట్టే ప్రాజెక్టుల కోసం భూసేకరణ కూడా ఇందులో ఉంది. కేంద్ర చట్టం 2013లో ఉన్నట్లుగా 2017 తెలంగాణా భూసేకరణ చట్టంలో ఏడాదికి రెండు పంటలు పండే భూమి సేకరణ నుంచి తప్పనిసరి మినహాయింపు లేదు. 

హైకోర్టు అల్టిమేటం

భూసేకరణ చట్టం ప్రకారం కోర్టులు అనేక తీర్పులు ఇచ్చినా చట్టప్రకారం ప్రభుత్వాలు పరిహారం చెల్లించడం లేదని మహబూబ్‌‌నగర్ జిల్లా న్యాయమూర్తి హైకోర్టుకు రాసిన లేఖ ఆధారంగా ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని స్వీకరించింది. 2018 జనవరిలో  హైదరాబాద్‌‌ హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్‌‌ రమేశ్‌‌ రంగనాథన్‌‌, జస్టిస్‌‌ గంగారావులతో కూడిన డివిజన్‌‌ ​​బెంచ్‌‌, ప్రభుత్వాలు చేపట్టిన వివిధ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన వ్యక్తులకు పరిహారం చెల్లించడంలో  ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అలసత్వంపై విస్మయం వ్యక్తం చేసింది.

 రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు అల్టిమేటం ఇచ్చిన హైకోర్టు, భూములు సేకరించినా ఇంకా నష్టపరిహారం చెల్లించని కేసులను కోర్టుకు సక్రమంగా తెలియజేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయకపోతే వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ముందుగా రైతుల నుంచి భూములు లాక్కొని, పరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరిగేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పద్ధతి కొనసాగిస్తే ఏపీ, తెలంగాణల్లో భూసేకరణ చర్యలన్నింటినీ నిలిపివేస్తామని హెచ్చరించింది. 

గత పదేండ్లలో ఇష్టారీతిన భూసేకరణ

భూసేకరణ గత 10 ఏండ్లలో ఇష్టారీతిన, గందరగోళంగా  జరిగింది. హైకోర్టును తప్పుదోవ పట్టించిన గత రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం ప్రజలకు తెలుసు. గౌరవెల్లి, మల్లన్నసాగర్, శివన్నగూడెం తదితర ప్రాంతాలలో నిర్వాసితుల గోస ఏ ఒక్క రాజకీయ పార్టీకి పట్టలేదు. స్వయంగా ప్రభుత్వమే కేంద్ర చట్టాన్ని నిర్వీర్యం చేసింది. సరళీకృతం చేసిన 2017 చట్టంలో ఉన్న విధి విధానాలు కూడా పాటించలేదు. 

పోలీసులను ఉపయోగించి, అధికారం చెలాయించి తెలంగాణాలో అనేక గ్రామాలలో భూమి ఉన్న రైతులను, భూమిలేని నిరుపేదలను నానా ఇబ్బందులకు గురి చేసిన తాజా చరిత్ర మరిచిపోలేం.  కొత్త ప్రభుత్వం వచ్చింది. గతంలో అన్యాయానికి గురి అయిన నిర్వాసి తుల పట్ల సానుభూతి ప్రకటించి వారికి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్నది. తెలంగాణలో భూసేకరణ ఆస్తిపరుల ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కును ఉల్లంఘిస్తుంది. ప్రజలందరి ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించడం రాష్ట్ర బాధ్యత. నిర్వాసిత కుటుంబాలు అన్నింటికీ పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలి. 

నిర్వాసితుల సహాయనిధి ఏర్పాటు చేయాలి

తెలంగాణలో రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ (నష్ట పరిహారం, ఉపశమనం, పునరావాసం) విధానం లేదు. అది తీసుకురావాలి. దానికి అనుగుణంగా భూసేకరణ చట్టం తయారు చెయ్యాలి.  అందుకే గత 10 ఏండ్లలో తెలంగాణాలో జరిగిన భూసేకరణపై, ఒప్పందం చేసుకున్న నష్ట పరిహారంపైన నిష్పక్షపాత ఆడిట్ జరగాలి. 2017 తెలంగాణా భూసేకరణ చట్టం ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం రద్దు చెయ్యాలి. తెలంగాణ బడ్జెట్లో నిర్వాసిత కుటుంబాలకు పూర్తి స్థాయి సహాయానికి ఒక నిధి ఏర్పాటు చెయ్యాలి.  నష్ట పరిహారం అందనివారికి ఒప్పందం మేరకు తక్షణమే అందించాలి. 

నష్టపరిహారం తక్కువ ఇచ్చినట్లయితే తగిన అదనపు నష్టపరిహారం ఇవ్వాలి. వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. లేదా వారికి ఇంకెక్కడైన సాగు భూమి ఇచ్చి వ్యవసాయం చేయడానికి ప్రోత్సాహక చర్యలు చేపట్టాలి. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఇదివరకు చేసిన భూసేకరణ మీద, చేయబోయే భూసేకరణ మీద ఒక నివేదిక తయారు చేసి ప్రజల ముందుపెట్టాలి.  పారదర్శకంగా ఎన్ని ఎకరాలు సేకరించారు, ఎంత నష్ట పరిహారం చెల్లించారు, ఆయా కుటుంబాల ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అనే అంశాల మీద సమాచారం ఈ నివేదికలో ఇవ్వాలి. తెలంగాణకు కొత్త భూసేకరణ విధానం రావాలి.  అందరు ఆమోదించే విధానపత్రం తీసుకురావాలి.

- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​