గ్రీన్ ఫీల్డ్​ హైవేకు భూసేకరణ గండం.. ఎనిమిదేండ్లుగా NH63 పనులకు గ్రహణం

మంచిర్యాల, వెలుగు: నేషనల్​హైవే 63లో భాగంగా నిజామాబాద్​జిల్లా ఆర్మూర్​నుంచి మంచిర్యాల జిల్లా క్యాతన్​పల్లి వరకు నిర్మించనున్న గ్రీన్​ ఫీల్డ్​హైవేకు భూసేకరణ సమస్యగా మారింది. లక్షెట్టిపేట మండలం మోదెల నుంచి హాజీపూర్​మండలం ముల్కల్ల వరకు భూములు కోల్పోతున్న రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో నెల రోజుల పాటు భూసేకరణ అవార్డును నిలిపేయాలని కోర్టు ఇటీవల స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు భూసేకరణను ఆపాలని సూచించింది. దీంతో జనవరిలో టెండర్లు పిలిచి మార్చిలో పనులు స్టార్ట్​చేయడానికి నేషనల్​హైవేస్​అథారిటీ ఆఫ్​ఇండియా(ఎన్​హెచ్ఏఐ) అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు తాత్కలికంగా బ్రేక్​ పడింది. దీనిపై త్వరలోనే కౌంటర్​ పిటిషన్ ఫైల్​ చేయడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

మూడుసార్లు మారిన అలైన్​మెంట్.. 

ఎన్​హెచ్ 63 నిజామాబాద్​జిల్లా బోధన్​నుంచి చత్తీస్​గఢ్‎లోని జగ్దల్​పూర్​వరకు విస్తరించి ఉంది. ఈ రూట్‎లో ట్రాఫిక్​ రద్దీ విపరీతంగా పెరగడంతో ఆర్మూర్​ నుంచి క్యాతన్​పల్లి వరకు కేంద్ర ప్రభుత్వం ఫోర్​లేన్​ శాంక్షన్​ చేసింది. రూ.2,600 కోట్ల అంచనాతో 132 కిలోమీటర్ల పొడవున పొలాల మీదుగా గ్రీన్​ఫీల్డ్​ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్​ ఇచ్చింది. ఎన్​హెచ్ఏఐ అధికారులు లక్షెట్టిపేట శివారులోని పొలాలు, అటవీ ప్రాంతం మీదుగా 2018లో ఫస్ట్​ అలైన్​మెంట్​ను రూపొందించారు. విలువైన సాగు భూములను ఇవ్వబోమని రైతులు ఆందోళనలు చేయడంతో పాటు కొంతమంది భూస్వాములు, రియల్టర్లు తమ భూములు పోకుండా పైరవీలు చేసి అడ్డుకున్నారు.

రెండోసారి ప్రస్తుతం ఉన్న రోడ్డునే బ్రౌన్​ఫీల్డ్​గా మార్చడానికి కొత్త అలైన్​మెంట్​ తయారుచేసి 2023లో నోటిఫికేషన్​ జారీ చేశారు. అయితే రోడ్డు పక్కనున్న ఇండ్లు, భూములు కోల్పోతున్నవారు వ్యతిరేకించడంతో దానికి సైతం బ్రేక్​ పడింది. అనంతరం లక్షెట్టిపేట మండలం మోదెల నుంచి క్యాతన్​పల్లి వరకు ఎన్​హెచ్ఏఐ అధికారులు మూడో అలైన్​మెంట్​ను రూపొందించారు. గోదావరి తీరం వెంట 35 కిలోమీటర్లు నిర్మించనున్న ఈ రోడ్డు కోసం జిల్లాలోని 17 రెవెన్యూ గ్రామాల్లో 1,433.75 ఎకరాల భూసేకరణకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్​ ఇచ్చారు. 

నాడు ఎల్లంపల్లిలో.. నేడు ఫోర్​లేన్​లో..

థర్డ్​ అలైన్​మెంట్​ పూర్తిగా గోదావరికి సమాంతరంగా రూపొందించడంతో భూములు ఇవ్వడానికి రైతులు ఒప్పుకోవడం లేదు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో వేల ఎకరాల సాగు భూములను తీసుకున్నారు. 9 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు. ఇప్పుడు గ్రీన్​ఫీల్డ్​ హైవే కోసం మళ్లీ అదే రైతులు భూములు కోల్పోవాల్సి వస్తోంది.15 ఏండ్ల కింద ఎల్లంపల్లి ప్రాజెక్టులో విలువైన సాగు భూములు కోల్పోయామని, మిగిలిన కాస్త భూములు గుంజుకొని తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దని వేడుకుంటున్నారు. 

ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులకు వినపతిపత్రాలు అందజేస్తున్నా స్పందన లేదు. ఇటీవల జిల్లాకు వచ్చిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ను కలిసి తమ గోడు వినిపించారు. సాగు భూములు నష్టపోకుండా బ్రౌన్​ ఫీల్డ్​ హైవే నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వానికి వందల కోట్ల భారం తగ్గుతుందని వివరించారు. హైవేలు, ప్రాజెక్టుల కోసం ఓసారి భూములు కోల్పోయిన వారి నుంచి రెండోసారి భూసేకరణ చేయవద్దని సుప్రీంకోర్టు గైడ్​లైన్స్​ ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బాధిత రైతులు పేర్కొంటున్నారు.

మూడున్నర ఎకరాలు పోతుంది..

మాకు వ్యవసాయమే జీవనాధారం. నాడు ఎల్లంపల్లి ప్రాజెక్టులో 15 ఎకరాల భూమి పోయింది. ఇప్పుడు హైవేలో మూడున్నర ఎకరాలు పోతుంది. ఉన్న కాస్త భూమిని గుంజుకొని మాకు అన్యాయం చేయొద్దు. 

– నాగిరెడ్డి గంగారెడ్డి, గుల్లకోట

ఉన్న భూములు పోతే ఎట్ల బతకాలె..

ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం గవర్నమెంట్​ మా భూములను గుంజుకున్నది. నాడు 7.10 ఎకరాల భూమి పోయింది. ఇప్పుడు హైవే కింద 2 ఎకరాలకు సర్వే చేసిన్రు. ఉన్న భూములు పోతే మేం ఎట్ల బతకాలె.

            -  గొల్ల పోచయ్య, ఇటిక్యాల