పరిచయం : ఈవెంట్ మేనేజర్ నుంచి..

లక్ష్మీ రామకృష్ణన్.. నటి, దర్శకురాలు, రచయిత, యాక్టివిస్ట్​. ఇన్ని స్కిల్స్ ఉన్న ఆమె మల్టీ టాలెంటెడ్​ మాత్రమే కాదు పద్దెనిమిదేండ్లకే పెండ్లి అయి, పాతికేండ్లకే ముగ్గురు పిల్లలకు తల్లిగా బాధ్యతలు తీసుకున్న ఇల్లాలు. ఈ రెండింటిలో దేని బాధ్యతలకీ వెన్నుచూపని వ్యక్తిత్వం ఆమెది. ధైర్యం, సాహసం, తపన, ఓర్పు వంటి పదాలకు నిదర్శనంగా ఆమె ఎదిగిన తీరు ఎందరికో ఇన్​స్పిరేషన్. ఈవెంట్ మేనేజర్​ నుంచి మూవీ డైరెక్టర్​ వరకు ఆమె ఇంట్రెస్టింగ్​ జర్నీ ఇది. 

కేరళలోని పాలక్కడ్​లో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది లక్ష్మీ రామకృష్ణన్. ఆరుగురు తోబుట్టువుల్లో ఆమె ఒకరు. తండ్రి పి.కె. కృష్ణస్వామి. బిజినెస్ మ్యాన్. తల్లి విజయలక్ష్మి. ఆమె బాగా చదువుకుంది. దంపతులిద్దరూ కలిసి పనిచేసుకునేవాళ్లు. అయితే... లక్ష్మి పదో తరగతి పూర్తిచేయగానే పెండ్లి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. అలా పదహారేండ్లకే ఎంగేజ్​మెంట్​, పద్దెనిమిదేండ్లకు పెండ్లి జరిగిపోయాయి. అప్పటికే ఆమె భర్త రామకృష్ణన్​.. ఐఐటిలో చదివి అమెరికా, సింగపూర్​ దేశాల్లో పనిచేశాడు. పెండ్లయ్యాక భర్త ఉద్యోగం రీత్యా ఆయనతో కలిసి లక్ష్మి కూడా ఒమన్​లో పన్నెండేండ్లు ఉంది. అక్కడే ఆమె కెరీర్​కు నాంది పడింది. 

ఈవెంట్ మేనేజర్​గా..

ఒమన్​లో ఉన్నప్పుడు అరవై మంది పిల్లలతో కలిసి సమ్మర్ క్యాంప్​ ఒకటి నడిపేది. దాన్నే వెంచర్​గా మలిచి ఆ క్యాంప్​లో ఆర్ట్, డ్రాయింగ్, క్రాఫ్ట్​ వర్క్​ వంటివి పెట్టింది. అది పాపులర్​ కావడంతో ఐదు వేలమందికి పైగా స్టూడెంట్స్ వచ్చారు. దీంతోపాటు.. విదేశాల్లో ఉండే ఇండియన్ విమెన్​ మీద ఫోకస్ చేసింది. వాళ్ల కోసం వంట, కుట్లు వంటివి కాకుండా ఇంటీరియర్ డిజైనింగ్​, ఫ్యాషన్​ డిజైనింగ్​ వంటివి చేయించేది. అక్కడే కొన్నాళ్లు ఈవెంట్​ మేనేజర్​గా వర్క్​ చేసింది. ఆ తర్వాత తనే వ్యాపారవేత్తగా మారి ఒమన్​లోని మస్కట్​నగరంలో ఈవెంట్​ మేనేజ్​మెంట్​ బిజినెస్​ చేశారు. ఈ బిజినెస్​1992 నుంచి 2001 వరకు కంటిన్యూ చేశారు.

ఆమె చేసిన పనులకుగాను ఒమన్​లో అవార్డ్​ కూడా అందుకుంది. అవార్డు అందుకున్న రోజు ఆమె చేసిన ప్రసంగంలో ... ‘నన్ను అర్థం చేసుకుని, ప్రోత్సహించే భర్త ఉండడం వల్లే నేను ఇదంతా చేయగలిగా. నాలాగే టాలెంట్​ ఉన్న మహిళలు ఎందరో బయటకు రాలేకపోతున్నారు’ అని చెప్పింది. దాదాపు పదేండ్లు వ్యాపారవేత్తగా పేరు సంపాదించిన ఆమె.. పిల్లల చదువు కోసం ఇండియాకి వచ్చేసింది. అప్పుడు మొదలైంది ఆమె సినిమా జర్నీ. 

అనుకోకుండా నటిగా

ఇండియాకు వచ్చాక ఫ్యామిలీతో కలిసి కోయంబత్తూర్​లో ఉంది. అప్పుడు డైరెక్టర్ లోహితాదాస్ షూటింగ్​ కోసం  ఇంటిని వెతుకుతున్నాడు. అలా లక్ష్మి వాళ్ల ఇంటికి వెళ్లాడట. ఆ తర్వాత ఆయన నెక్స్ట్​ సినిమాలో సపోర్టింగ్​ రోల్ ఆఫర్ చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోయినా.. కన్విన్స్​ చేసి ‘చక్కర ముత్తు’ (2006) సినిమాలో దేవయాని అనే టీచర్ క్యారెక్టర్ చేయించారు. ఆ తర్వాత వరుసగా సపోర్టింగ్​ క్యారెక్టర్స్ చేసే అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ‘ప్రణయకాలం, జులై4, నావెల్​’ వంటి సినిమాల్లో నటించింది.

అలా వరుసగా మలయాళ సినిమాల్లో నటించింది. కానీ, వాటికి అంత పేరు రాలేదు. అప్పుడు డైరెక్టర్ కరు పళనిప్పన్ తమిళ సినిమా ‘పిరివం సంతిప్పొం’(2008)లో హీరోయిన్ స్నేహకు తల్లి పాత్ర కోసం అడిగాడు. ఆ సినిమాలో చేసిన పాత్రకి ఆమెకి మంచి పేరొచ్చింది. దాంతో తమిళంలో మూవీ ఆఫర్లు వరుస కట్టాయి. 

పాత్ర కోసం గుండు

తెలుగులో వచ్చిన ‘ఏమాయ చేశావే’ (2010)లో హీరోయిన్ జెస్సీ క్యారెక్టర్​కి తల్లిగా కనిపించింది. ఆ తర్వాత సిద్దార్థ్ హీరోగా వచ్చిన ‘ఓ మై ఫ్రెండ్’, ‘180’ సినిమాల్లో ​హీరోకి తల్లిగా నటించింది. ఈ రెండు సినిమాలు 2011లో వచ్చాయి. అయితే, తమిళంలో ఆమె నటించిన ‘యుద్ధం సెయి’ సినిమా కూడా అదే ఏడాది విడుదలైంది. ఆ సినిమాలో కూడా ఆమె చేసింది తల్లి పాత్రే. కానీ.. అందులో కూతురి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న తల్లి పాత్ర. నిజానికి ఆమెకది ఛాలెంజింగ్​ రోల్​. ఎందుకంటే అప్పటి వరకు ఓ మామూలు తల్లిగా, స్క్రీన్​ మీద ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె ఈ సినిమాలో రౌద్రంగా చేయాల్సి వచ్చింది.

అది పెద్ద సవాలే. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే... ఆ పాత్ర కోసం ఆమె గుండు చేయించుకుంది. పాత్రకు తగ్గట్టు కనిపించాలనే తపనతో గుండు చేయించుకుందట. ఆ విషయం గురించి ఆమెని అడిగితే.. ‘‘ఇలాంటి క్యారెక్టర్లు లైఫ్​లో ఒక్కసారే వస్తాయి. వాటిని మిస్​ చేసుకోకూడదు. అందుకే గుండు చేయించుకున్నా’ అని చెప్పింది. 

టీవీలో సంచలనం!

‘సొల్వతెల్లమ్ ఉన్మయ్( చెప్పేదంతా నిజం)’ అనే టెలివిజన్ రియాలిటీ షోతో సంచలనంగా మారింది.  తెలుగులో ‘బతుకు జట్కాబండి’లాగ సామాన్య ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నిజ జీవితం​లో ఎదురైన పరిస్థితులకు న్యాయం చేసే విధంగా ఆ ప్రోగ్రామ్​ రూపొందించారు. ఈ షోకి మొదట ‘సొల్ల తుడిక్కుతు మనసు(నా మనసు ఇది చెప్పాలనుకుంటోంది)’ అని పేరు పెట్టారు. తర్వాత ‘చెప్పేదంతా నిజం’ అని మార్చారు. ఈ షో క్రియేట్​ చేసిన వాళ్లలో లక్ష్మీ రామకృష్ణన్​ ఒకరు. ఆమె పార్తిబన్​తో కలిసి తయారుచేసిన ప్రోగ్రామ్​ ఇది​.

దీనికి డైరెక్టర్​ పార్తిబన్ కాగా లక్ష్మి స్పాన్సర్​​ చేశారు. ఈ షోకి యాంకర్​ కూడా ఆమే. దాదాపు గంటసేపు టెలికాస్ట్​ అవుతున్న ఈ షో సక్సెస్​ఫుల్​గా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది.  ఈ షో 2011లో ‘సొల్వతెల్లమ్ ఉన్మయ్’గా మొదలై.. ఇప్పుడు ‘నెర్కొండ పార్వై’ పేరుతో ఉంది. దీనికి ముందు 2008లో ‘ది ఆఫీసర్’ అనే మలయాళ టీవీ సీరియల్​లో కనిపించింది. తర్వాత తమిళంలో ‘అవల్’ అనే సీరియల్​లో 2011 నుంచి 2013 వరకు నటించింది.

దర్శకురాలిగా...

నటిగా కొనసాగుతూనే.. మరో వైపు దర్శకురాలిగా మెగా ఫోన్​ పట్టింది. ఇప్పటికే ఐదు సినిమాలు డైరెక్ట్​ చేసింది. డైరెక్టర్​గా ఆమె తీసిన మొదటి సినిమా ‘ఆరోహణం’. ఇది 2012లో రిలీజ్​ అయింది. మొదటి సినిమా తర్వాత రెండేండ్లకు ‘నెరుంగి వా ముత్తమిడాతె’, మరో రెండేండ్లకు ‘అమ్మణి’ వంటి సినిమాలు తీసింది. ఆ తర్వాత 2019లో ‘హౌస్​ ఓనర్​’ అనే సినిమా తెరకెక్కించింది. ఇప్పుడు మళ్లీ ‘ఆర్ యు ఓకే బేబీ’ అనే సినిమాతో ఆడియెన్స్​ ముందుకొచ్చింది. అయితే ఈ ఐదు సినిమాల్లో ఆమె కూడా ఒక పాత్రలో కనిపించింది. ఆమె డైరెక్షన్​ చేసే సినిమాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ‘నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలను చూసి ఇన్​స్పైర్​ అయ్యి తీస్తాను. సింపుల్​ స్టోరీస్ చెప్పడం  ఇష్టం. అందుకే నా సినిమాలన్నీ అలానే సింపుల్​గా ఉంటాయి. 

నా మొదటి సినిమా చాలా చిన్నది. కానీ, ఇందులో నటించిన ఆర్టిస్ట్​లు, లొకేషన్స్ సంఖ్య చాలా పెద్దది. ఆ సినిమా షూటింగ్ చేసేటప్పుడు సవాలుగా అనిపించింది. కానీ, కేవలం ఇరవై రోజుల్లో కంప్లీట్​ చేశాం. ఇప్పుడు డైరెక్షన్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నా. నిజానికి ఏ పనైనా చూస్తున్నంతసేపు పెద్దదిగా, సవాలుగా కనిపిస్తుంది. ఒక్కసారి మొదలుపెడితే అన్నీ మన చేతిలోకి వచ్చేస్తాయి. దాంతో ఆ పని చేయడం ఈజీగా అనిపిస్తుంది” అంటుంది లక్ష్మి.

ఆ ఆలోచన వచ్చినా కూడా..

‘‘ఈ సినిమా స్క్రిప్ట్​ రాయడం మొదలుపెట్టే ముందే స్క్రీన్​ ప్లే ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు ఉండాలనుకున్నా. ఎమోషనల్ డ్రామా, సోషల్ ఎలిమెంట్స్, ఇన్వెస్టిగేషన్ వంటివి పెట్టాలనుకున్నా. ఈ సినిమాలో చాలా మంచి టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్లందరికీ మంచి సీన్స్ ఉన్నాయి. కానీ, చెప్పుకోదగ్గ విషయం.. క్లైమాక్స్​లో అందరూ ఒకే సీన్​లో కనిపిస్తారు. అది చాలా బాగా వచ్చింది. అంతమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్​లతో ఒక సీన్​ ఒకే ఫ్రేమ్​లో కనిపించేలా తీయడంతో నా కల నెరవేరింది. అలాగే యాక్టింగ్, డైరెక్షన్​ రెండింటిని హ్యాండిల్ చేస్తూ చిన్న విషయాలను గుర్తు పెట్టుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా తీయడమనేది ఛాలెంజ్. కానీ ఆ సాహసం చేయడం నా పనికి చాలా ఉపయోగపడింది. మంచి అవుట్​పుట్ ఇవ్వడానికి సాయపడింది.  

ఈ సినిమా పేరెంటింగ్​ గురించి. కాబట్టి.. ఇది చేస్తున్నప్పుడు నేను సరిగానే తీస్తున్నానా? అనే అనుమానం వచ్చింది. ఎందుకంటే నేను షూటింగ్​లో ఉంటే ఇంటిని ఎవరు చూసుకుంటారు? నా భర్త నాకు ఎంత సపోర్ట్​ చేసినా నేను పనుల్ని పక్కన పెట్టకూడదు కదా! ఈ ఆలోచన ఆడవాళ్లలో ఎక్కువగా వస్తుంటుంది. ఆ ఆలోచన మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. అలాగని నా సినిమాల ద్వారా మెసేజ్​లు ఇవ్వను. కాకపోతే అలాంటి క్యారెక్టర్స్ ఉంటే.. ఆడియెన్స్ వాటి గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు” అని తన డైరెక్షన్​ ఎక్స్​పీరియెన్స్​ గురించి చెప్పింది.

అవార్డులు 

  •  ఉడచితనై ముహర్తన్​తాల్​’ (మలయాళం) మూవీకి తమిళ నాడు స్టేట్ ఫిల్మ్​ అవార్డ్. 
  •   యుద్ధంసెయి’ మూవీకి బెస్ట్​ సపోర్టింగ్​ యాక్ట్రెస్​గా విజయ్ అవార్డ్​.
  •   జాకబింటె స్వర్గరాజ్యం’ (మలయాళం) సినిమాకు సైమా అవార్డ్​.