Telangana Tour : ఆకాశమంత లక్నవరం చూసొద్దామా.. హైదరాబాద్ నుంచి ఇలా వెళ్లాలి.. ఇవి చూడాలి..!

చుట్టూ కొండలు.. మధ్యలో నీరు.. వేలాడే వంతెన... అన్నీ కలబోసి గగనతలం నుంచి తీసిన ఈ సిత్రాలు భలే ఉన్నాయి కదా! ఈ దృశ్యాలను చూసి ఏ ఐలాండో, ఏ మలేషియా అనుకుంటే పొరపడినట్లే. ఇది ఎక్కడో కాదు.. మన తెలంగాణలోనే, జయశంకర్ జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన లక్నవరం సరస్సు...

వరంగల్ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. 202 జాతీయ రహదారికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి ప్రత్యేక బస్సు సర్వీసులు లేవు. ప్రైవేటు రవాణాలో వెళ్లాల్సిందే.. ఆర్టీసీ బస్సుల్లో, సొంత వాహనాల్లో వచ్చేవాళ్లు... ములుగు డివిజన్ కేంద్రం దాటిన తర్వాత గోవిందరావు పీట మండలంలోని చల్యాయి గ్రామం వద్దగల బుస్సాపూర్ క్రాస్ నుంచి కుడివైపుకు ఎనిమిది. కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే లక్నవరం చేరుకోవచ్చు.

మరో వేలాడే వంతెన

లక్నవరం సరస్సుకు వెళ్తే మనసు దోచే ఎన్నో అందాలు ఆకట్టుకుంటాయి. నూట అరవై మీటర్ల పొడవు ఉన్న వేలాడేవంతెనపై పర్యాటకులు ప్రకృతి బందాలను ఆస్వాదిస్తూ తన్మయత్వం  పొందుతారు. అలలపై పయనించేందుకు బోటింగ్, భోజన వసతి కోసం రెస్టారెంట్, విశ్రాంతి కోసం కాటేజీలు ఉన్నాయి. కొత్తగా మరో వేలాడే వంతెన కూడా టూరిజం అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. దాంతో రోజు రోజుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది..

ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న ఈ సరస్సు తెలంగాణలోనే ప్రధాన పర్యాటక కేంద్రంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడి పరిసరాలు, సరస్సు, మధ్యలోని దీవులు పర్యాటకానికి అనువుగా ఉండటంతో పర్యాటక శాఖ అదనపు హంగులు అద్దింది. మొదట ఈ సరస్సుపై హరిద్వార్ తరహాలో రాష్ట్రంలో మొట్టమొదటి వేలాడే వంతెనను నిర్మించారు. 

కాకతీయుల శిల్ప కళా సందడను తిలకించేందుకు వీలుగా దీనిని రూపొందించారు. సరస్సులో ఆరు దీవులను ఆరు రణాలగా  ముస్తాబు  పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు పర్యాటకశాఖ ఏర్పాట్లు చేసింది. సెలవు దినాల్లోనే కాకుండా, మిగతా రోజుల్లో ప్రాంతానికి చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. 

చారిత్రక ఆనవాళ్లు 

కాకతీయులు చెరువులు నిర్మించిన ప్రతిచోట ఆలయ నిర్మాణాలు చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. కానీ లక్నవరం, పాకాల సరస్సులను  మాత్రం వ్యవసాయ కేంద్రాలుగానే భావించినట్లు తెలుస్తోంది. లక్నవరం దగ్గర ఉన్న బుస్సాపూర్ గ్రామంలో అడవుల్లో చిన్న చిన్న గుడులు కట్టారు. రామలింగేశ్వరుడిని ప్రతిష్టించిన అనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. పాడి పంటలు బాగా పండాలని కాకతీయులుఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

-వెలుగు,లైఫ్-