అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి లడ్డు ప్రసాదం హైదరాబాద్ నుంచే వెళ్లింది. సికిందరాబాద్ మారేడ్ పల్లికి చెందిన నాగభూషణ్ రెడ్డి భారీ లడ్డును తయారుచేశాడు. జనవరి18న శోభాయాత్రగా రోడ్డు మార్గాన అయోధ్యకు బయల్దేరిన ఈ మహా ప్రసాదం గురించి వివరిస్తూ ‘‘అయోధ్యలో ప్రసాదంగా పంచడానికి1265 కిలోల లడ్డు తయారుచేశాం. దీని తయారీకి మూడు రోజులు పట్టింది. లడ్డు తయారీ కోసం 350 కిలోల శనగపిండి, 700 కిలోల చక్కెర, 40 కిలోల జీడిపప్పు, 35 కిలోల బాదం పప్పు, 5 కిలోల ఎండుద్రాక్షలతోపాటు తిరుపతి నుంచి పచ్చకర్పూరం తెప్పించాం.
దాంతోపాటు 35 గ్రాములు కుంకుమపువ్వు వాడాం. ఇంటి సభ్యులతోపాటు 25 మంది స్టాఫ్ కలిసి తయారుచేశాం. మా వీధిలో ఉండేవాళ్లంతా కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తం18 మందికి పాస్‌లు అందాయి. ఐదు వాహనాలకు పర్మిషన్ వచ్చింది. అయోధ్యకు వెళ్లడానికి విశ్వహిందూ పరిషత్ వాళ్లు రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు. 2000 సంవత్సరం నుంచి నేను శ్రీరామ్ కేటరింగ్ సర్వీస్ పేరుతో బిజినెస్ చేస్తున్నా.
అయోధ్యలో రామ మందిరం భూమి పూజ చేసినప్పటి నుంచి మా వంతుగా ఏదైనా చేయాలనుకున్నాం. భూమి పూజ జరిగిన రోజు నుంచి ప్రారంభోత్సవం వరకు ప్రతి రోజు కిలో లడ్డు పంచాలని నిర్ణయించుకున్నాం. అలా1265 కిలోల ఈ లడ్డు తయారుచేయడానికి నాలుగు గంటలు పట్టింది. ఈ లడ్డు అక్కడికి వెళ్లేవరకు పాడవ్వకుండా ఉండేందుకు రిఫ్రజరేటర్ బాక్స్‌లో పెట్టామని’’ అని చెప్పాడు నాగభూషణ్ రెడ్డి.