తినకపోతే నీరసం..తినాలంటే భయం

  • గురుకులాలు, హాస్టళ్లలో పత్తాలేని పర్యవేక్షణ
  • వరుస ఘటనలతో స్టూడెంట్స్, పేరెంట్స్​లో ఆందోళన
  • పని చేయని ఆర్వో  ప్లాంట్లు, గీజర్లు, సోలార్​ సిస్టం

నాగర్​కర్నూల్,​ వెలుగు : ప్రభుత్వ గురుకులాలు, హాస్టల్స్, బెస్ట్​ అవైలబుల్​ స్కూళ్లతో పాటు​స్కీమ్​లో ఉన్న  ప్రైవేట్​ స్కూల్స్​ హాస్టల్స్​లో డేంజర్​ బెల్స్​ మోగుతున్నాయి. కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతూ పదుల సంఖ్యలో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలతో స్టూడెంట్స్,​ పేరెంట్స్​ ఆందోళన చెందుతున్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలు, హాస్టల్స్, స్టూడెంట్స్ ​సెల్ఫ్ మేనేజ్​మెంట్​ హాస్టల్స్, బెస్ట్​ అవైలబుల్  హాస్టల్,​ స్కీం స్కూల్స్​లో ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

తమకు పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డెక్కుతుంటే సమస్య మూలాలను వదిలేసి, నాణ్యమైన భోజనం పెడతామని చెబుతూ అధికారులు తప్పించుకోవడం విద్యార్థుల ప్రాణాల మీదికి తెస్తోంది. వారం రోజులుగా కొల్లాపూర్​ నియోజకవర్గం పెంట్లవెల్లి కేజీబీవీ, జడ్చర్ల గురుకుల పాఠశాల, అచ్చంపేటలో ప్రైవేట్​ స్కూల్​ హాస్టల్​లో జరిగిన ఘటనలు దీనికి నిదర్శనం. గురుకులాల్లో విద్యార్థులకు పెడుతున్న మెనూలో వాడుతున్న కూరగాయలతో పాటు తాగునీరు సమస్యకు కారణమవుతున్నట్లు చెబుతున్నారు.

క్వాలిటీ ఫుడ్​కు రేట్ల సమస్య..

కేజీబీవీలు, బీసీ, మైనార్టీ గురుకులాలు, హాస్టల్స్​పై పర్యవేక్షణ తగ్గుతోందన్న విమర్శలున్నాయి. గురుకులాల్లో కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్లు, కిరాణ, ఇతర వస్తువుల సప్లై కోసం టెండర్లు పిలుస్తారు. అయితే టెండర్​ దక్కించుకున్న​కాంట్రాక్టర్​ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. మెనూ ప్రకారం స్టూడెంట్స్​కు బ్రేక్​ఫాస్ట్, లంచ్, డిన్నర్​ పెట్టాల్సి ఉండగా, మార్కెట్  రేట్లలో పెరుగుదలతో క్యాలిటీ, స్టాండర్డ్స్​ పడిపోతున్నాయి.

కిరాణం, మటన్, చికెన్, గుడ్లు, కూరగాయల సప్లై కాంట్రాక్టర్​ దయాదాక్షిణ్యాలపై ఆధార పడుతున్నాయి. ఇదిలాఉంటే కాంట్రాక్టర్లతో కేజీబీవీలు, గురుకులాలు, రెసిడెన్షియల్​ కాలేజీల ఎస్​వోలు, ప్రిన్సిపాళ్లు​కుమ్మకవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక డైనింగ్​ హాళ్లు​లేక వరండాలు, క్లాస్​ రూమ్స్​లో ఎక్కడ స్థలం ఉంటే అక్కడే భోజనాలు చేయాల్సి వస్తోంది.

వెంటాడుతున్న తాగునీటి సమస్య..

జిల్లాలో 20 కేజీబీవీలు, మైనార్టీ, ఎస్టీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. స్టూడెంట్స్​ తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఆర్వో​ప్లాంట్స్​ వర్కింగ్​ కండీషన్​లో ఉన్నవి చాలా తక్కువ. మెయింటెనెన్స్, రిపేర్లు లేక మూలకు పడుతున్నాయి. గురుకులాలు, హాస్టల్స్​లో మిషన్ భగీరథ నీటిని సప్లై చేస్తుండగా, వర్షాకాలంలో పైప్​లైన్​​లీకేజీలతో నీళ్లు కలుషితమై రోగాలకు కారణమవుతోంది. ఇక వర్షాకాలం, చలికాలంలో చల్లటి నీళ్లతో స్నానాలు చేసి జ్వరాలు, చర్మవ్యాధుల బారిన పడుతున్నారు. ఆర్వో  ప్లాంట్లు, గీజర్లు, సోలార్​ సిస్టం పని చేయకపోయినా పట్టించుకునే వారే కరువయ్యారు. 

పర్యవేక్షణ అంతంతే..

వివిధ శాఖల ఆధీనంలో పని చేస్తున్న ప్రభుత్వ గురుకులాల పర్యవేక్షణకు మూడంచెల్లో అధికారులు ఉన్నా కీలక బాధ్యతలు నిర్వహించే పోస్టులు ఖాళీగా ఉండడం, కాంట్రాక్ట్​ సిబ్బంది, ఇన్​చార్జీల పర్యవేక్షణతో సమస్య వస్తోంది. కేజీబీవీలకు స్పెషల్​ ఆఫీసర్లను నియమిస్తున్న ప్రభుత్వం.. ఆ పోస్టులో కాంట్రాక్ట్​ ఉద్యోగులను నియమిస్తోంది. అలాగే వైద్యారోగ్య శాఖకు చెందిన హెల్త్ ఎడ్యుకేటర్లు విజిట్​ చేసి స్టూడెంట్లకు అవగాహన కల్పించాల్సి ఉన్నా, ఆచరణలో కనిపించదు. విద్య, వైద్య, మిషన్​ భగీరథ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు, మండలాలకు కేటాయించిన స్పెషల్​ ఆఫీసర్లు గురుకులాలు

ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లను  విజిట్​ చేసిన దాఖలాలు లేవు. వర్షాకాలంలో స్టూడెంట్స్​ మెనూలో వాడే కూరగాయలు, తాగునీటి విషయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను చెప్పే వ్యవస్థ లేదు. వేలాదిమంది స్టూడెంట్స్​ ఉండే గురుకులాల్లో క్వాలిటీని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో వరుసగా పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారని అంటున్నారు. ఇకనైనా పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు విద్యా సంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, పేరెంట్స్ కోరుతున్నారు.