OTT MOVIES : ఆనాటి యుద్ధం

ఆనాటి యుద్ధం...

టైటిల్ - పిప్పా

కాస్ట్​ - ఇషాన్​ ఖట్టర్​, మృణాల్​ ఠాకూర్​, ప్రియాన్షు పైనియులి, సోనీ రజ్దానా

డైరెక్షన్ - రాజా కృష్ణ మీనన్​

ప్లాట్​ఫాం -​ అమెజాన్​ ప్రైం వీడియో

లాంగ్వేజ్ - హిందీ

బ్రిగేడియర్​ బలరామ్​ సింగ్​ మెహతా రాసిన ‘ది బర్నింగ్​ చాఫే’ పుస్తకానికి దృశ్య రూపం ‘పిప్పా’. ఇది1971లో జరిగిన ఇండో–పాకిస్తాన్​ యుద్ధానికి అక్షర రూపం. ఢాకా లైబ్రరీలో జరుగుతున్న బంగ్లా విముక్తి పోరాట సమావేశంపై పాక్​ సేనలు దాడి చేసి, దొరికిన వారిని దొరికినట్టు కాల్చి చంపే సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. రష్యా అందించిన యుద్ధ ట్యాంకును పరీక్షించే బృందంలో ఒకడిగా కెప్టెన్​ బలరామ్​గా ఇషాన్​ ఖట్టర్​ పాత్ర పరిచయం అవుతుంది. దాంతో పాటు విపత్కర పరిస్థితుల్లో బలరామ్​ ఎంత ధైర్యంగా ఉంటాడో చెప్తుంది ఆ సీన్​. యుద్ధం అంటే శత్రు సేనలను చంపుకుంటూ వెళ్లడమే కాదు. తన సేనలను కూడా రక్షించుకుంటూ ముందుకు సాగడం అని చెప్పేలా బలరామ్​ చీఫ్​ చేసే సాహసం ఒళ్లు గగుర్పొడుస్తుంది. 

బంగ్లా విముక్తి కోసం ఉద్యమించిన వాళ్లతో పాటు సామాన్య ప్రజలను కూడా దారుణంగా చంపేస్తుంది పాకిస్తాన్​ సైన్యం. ఆడవాళ్లను, పసిపిల్లలను బందీలుగా చేసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో భారతదేశం బంగ్లాదేశ్​ నుంచి వచ్చే శరణార్ధులకు ఆశ్రయం ఇస్తుంది. అది పాకిస్తాన్​ సహించలేదు. ఇండియాలో బాంబు దాడులు చేస్తుంది. దాంతో ప్రధాని ఇందిరా గాంధీ బంగ్లా విముక్తికి పూర్తి మద్దతు ప్రకటించి, అక్కడికి సైన్యాన్ని పంపుతారు. నేల, నీళ్ల మీద నడిచే యుద్ధ ట్యాంకులను ఇండియాకు ఇస్తుంది రష్యా. వాటి సాయంతో పాక్​ అధీనంలో ఉన్న గర్బీపూర్​కు ఇండియా సేనలు వెళ్తాయి.

అందులో ఒక యుద్ధట్యాంకుకి నాయకత్వం వహిస్తాడు కెప్టెన్​ బలరామ్​ సింగ్. గర్బీపూర్​ వెళ్లే క్రమంలో బలరామ్​కు ఎదురైన పరిస్థితులు ఏంటి? వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు? బలరామ్​ సోదరుడు మేజర్​ రామ్​ మెహతా(ప్రియాన్షుకు)కు సైన్యం అప్పగించిన మిషన్​ ఏంటి? వీళ్ల సోదరి రాధా మెహతా (మృణాల్​) సైన్యానికి చేసిన సాయం ఏంటి? ఈ వివరాలు తెలియాలంటే సినిమా చూడాలి. పిప్పా అంటే ‘లవర్​ ఆఫ్​ హార్సెస్’​ అని అర్థం. కెప్టెన్​ బలరామ్​ సింగ్ చాలా బరువైన పాత్ర. ఆ పాత్రకు ఇషాన్​ ఖట్టర్​ చిన్న పిల్లాడిలా కనిపించాడు.

జేమ్స్​బాండ్​ ఫ్లేవర్​ లేదు

టైటిల్ - 007: రోడ్​ టు ఎ మిలియన్​​

కాస్ట్​ -  బ్రయాన్​ కాక్స్​, జోష్​ అలీ, జేమ్స్​ బోనె, జెన్నీ డోర్వర్డ్​, సన పిర్​మొహమ్మద్​ 

డైరెక్షన్ -  జూలియన్ జోన్స్​, టామ్​ డుమికన్,  జేమీ గూల్డ్​, ​ఏలిస్​ స్మిత్​

ప్లాట్​ఫాం - అమెజాన్​ ప్రైమ్​​

లాంగ్వేజ్ - ఇంగ్లిష్

సినిమా తెర మీద జేమ్స్​ బాండ్​ చేసే అడ్వెంచర్స్​ చాలా ఎగ్జయిటింగ్​గా అనిపిస్తాయి. బాండ్ ఇన్​స్పిరేషన్​తో చేసిన అడ్వెంచరస్​ రియాలిటీ షో ‘007:రోడ్​ టు ఎ మిలియన్’. తొమ్మిది జంటలు ఈ అడ్వెంచర్​ షోలో పాల్గొన్నాయి. జేమ్స్​ బాండ్​ సినిమాలు ఎక్కువగా షూటింగ్ చేసిన లొకేషన్స్​కి వెళ్లి క్లూస్​ ఆధారంగా అక్కడ దాచిన నిధిని కనుక్కోవాలి. అలా కనుక్కున్న వాళ్లకి తొమ్మిది మిలియన్​ డాలర్ల ప్రైజ్​​.

ఈ షో కోసం బ్రెజిలియన్​ అమెజాన్​ అడవుల నుంచి ఇటలీ, ఇస్తాం​బుల్​ వరకు వెళ్లి షూటింగ్​ చేశారు. కానీ ఈ షో మొత్తంలో బ్రయాన్​ కాక్స్​ హోస్ట్​గా కనిపించడం ఒక్కటే ప్లస్​ పాయింట్. ‘007 రేస్​ టు ఎ మిలియన్’​ అమెజాన్ స్టూడియోస్​ డెబట్​ ప్రాజెక్ట్. కానీ ఈ షో అనుకున్నంత బాగా రాలేదు. ఇంట్లో కూర్చుని అడ్వెంచర్​ రియాలిటీ ఎక్స్​పీరియెన్స్​ చేయాలనుకునే వాళ్లు ఈ షో ఒకసారి చూడొచ్చు.

‘లేబుల్​’ పడాలి

టైటిల్ - లేబుల్​

కాస్ట్​ - జై, తాన్యా హోప్​, చరణ్​ రాజ్​, మహేంద్రన్​, హరిశంకర్​ నారాయణన్​

డైరెక్షన్ - అరుణ్​ రాజా కామరాజ్​

ప్లాట్​ఫాం - డిస్నీ + హాట్​స్టార్​

లాంగ్వేజ్ - తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, మరాఠీ, బెంగాలి, కన్నడ

తమిళనాడులోని వాలీ నగర్​ కాలనీ వాసులంతా రౌడీలు, గూండాలనే అభిప్రాయం ఉంటుంది.అలాంటి వాలీనగర్​ కాలనీకి చెందిన ప్రభాకర్​ (జై) పన్నెండేండ్ల వయసులో చేయని నేరానికి జువనైల్​ హోంకి వెళ్లాల్సి వస్తుంది. వారం రోజుల తరువాత నిరపరాధిగా బయటకు వస్తాడు. అప్పుడు తనతో పాటు, కాలనీ వాసుల మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని చెరిపేయాలని అనుకుంటాడు. ఆ లక్ష్యం చేరుకునేందుకు ‘లా’ చదివి అడ్వకేట్​ అవుతాడు. జడ్జి కావాలని ట్రై చేస్తుంటాడు. దాంతోపాటు ‘వాలి నగర్’లోని యువకులను సరైన దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తుంటాడు. స్పోర్ట్స్​, చదువు వైపు యువతను ఎంకరేజ్ చేస్తుంటాడు. ఇదిలా ఉంటే.. ఒక వైపు ‘సెంగుట్టన్’ మరో వైపు ‘అయ్యా’ గ్యాంగులు ఆ ఏరియా మీద పట్టుకోసం పోటీపడుతుంటారు.

ఈ విషయంలో ‘సెంగుట్టన్’ దగ్గర ప్రధాన అనుచరుడైన ‘పాతాళం’, ‘అయ్య’ దగ్గర పనిచేసే బంకు సురేశ్​వి ప్రధాన పాత్రలు. ఫలానా రౌడీ తాలూకు మనిషిని అనేది ఒక ‘లేబుల్’గా పనిచేస్తుంటుంది. ఆ లేబుల్ ఉన్న వాళ్లకి వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం చెప్పరు. అలాంటివాళ్లకి జైల్లో మర్యాదలు జరుగుతుంటాయి. ఆ ‘లేబుల్’ కోసం శేఖర్, కుమార్ అనే కుర్రాళ్లు ట్రై చేస్తుంటారు. పాతాళంను చంపేస్తే ఆ  లేబుల్ తమకి దక్కుతుంది అనుకుంటారు. వాళ్లను దార్లో పెట్టడానికి ఒక వైపు ప్రభాకర్ ట్రై చేస్తుంటే, మరో వైపు వాళ్లు పాతాళంను చంపడానికి ప్లాన్ చేస్తుంటారు. అదేటైంలో జడ్జి కావాలన్న ప్రభాకర్​ కలకు అడ్డంకి ఏర్పడుతుంది. ఆ సమస్య ఏంటి? తమ ఏరియాకి మంచి పేరు తీసుకురావడానికి ప్రభ చేసే ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ. ఈ సిరీస్​ మొత్తం పది ఎపిసోడ్లతో ఉంది. మూడు ఎపిసోడ్లు రిలీజ్​ అయ్యాయి. ప్రతి శుక్రవారం ఒక్కో ఎపిసోడ్​ విడుదల అవుతుంది.