- చిన్న కొడుకును ఎమ్మెల్యేగా, పెద్ద కొడుకును ఎంపీగా గెలిపించుకున్న సీనియర్ లీడర్
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ కాంగ్రెస్ లీడర్కుందూరు జానారెడ్డి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పన్నిన రాజకీయ వ్యూహం ఫలించింది. చిన్న కొడుకు జైవీర్‌రెడ్డిని నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంలో, పెద్ద కొడుకు రఘువీర్‌రెడ్డిని పార్లమెంట్‌కు పంపడంలో జానారెడ్డి సక్సెస్ అయ్యారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన జానారెడ్డి తన ఛరిష్మాతో ఇద్దరు కొడులను రాజకీయ అరంగ్రేటం చేయించడమేగాక, వారి వెనకాలే ఉండి గెలుపునకు పాటుపడ్డారు.
తెలంగాణ వచ్చాక 2014లో జరిగిన ఎన్నికలే జానా గెలుపుకు చివరి ఎన్నికలు. 2019లో, ఆ తర్వాత వచ్చిన బైపోల్లో జానారెడ్డి ఓడిపోయారు. నోముల నర్సింహయ్య, ఈయన కొడుకు భగత్ చేతిలో జానారెడ్డి అపజయం పొందడంతో రాజకీయాల్లో ఆయన పనైపోయిందని చాలామంది అభిప్రాయపడ్డారు. వయసు మీద పడడంతో జానారెడ్డి కూడా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని, సీఎం ఆఫర్ వస్తేనే తెరపైకి వస్తానని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పారు.
కానీ, ఆయన కొడుకులు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపడంతో అనివార్యంగా జానారెడ్డి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌నే గాక, కమ్యూనిస్టులను ఏకం చేయడంలో, పార్టీ రహితంగా ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించి కొడుకును గెలిపించుకోగలిగారు. అది కూడా రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో కావడం గమనార్హం.