ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, బీఆర్​ఎస్​ కుట్ర : కూనంనేని సాంబశివరావు

  • కృత్రిమ అలజడి సృష్టించేందుకు రెండు పార్టీల ప్రయత్నం : కూనంనేని
  • నిరుద్యోగులతో ప్రభుత్వం మాట్లాడాలి
  • మూసీ పునరుజ్జీవంపై అన్ని పార్టీలతో చర్చించాలి
  • కబ్జాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  • పేదలను అడ్డుపెట్టుకొని అక్రమాస్తులు కాపాడుకునే పనిలో బీఆర్​ఎస్​
  • పేదలపై కాకుండా భూకబ్జాదారులపై హైడ్రా ప్రతాపం చూపాలని సూచన

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్​ఎస్​, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని,  ఇలాంటి చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ‘‘బీఆర్ఎస్​,  బీజేపీ  చీకటి ఒప్పందంలో భాగంగా ఆ పార్టీల నేతలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నట్లు నాటకాలాడుతున్నరు. రాష్ట్రంలో అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తూ కృత్రిమ అలజడి సృష్టిస్తున్నరు. దీని ద్వారా రాష్ట్రంలో  అశాంతి వాతావరణాన్ని నెలకొల్పి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా చేసి శాంతి భద్రతలను సాకుతో  ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నరు”

అని ఆయన ఆరోపించారు.  హైదరాబాద్​లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్​లో ఆదివారం సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్, జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ తో  కలిసి కూనంనేని మీడియాతో మాట్లాడారు. హైడ్రా అత్యుత్సాహంతో అనాలోచితంగా పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చుతున్నదని.. దీన్ని ఆసరాగా చేసుకొని బడాబాబులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని,

ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మూసీ పునరుజ్జీవంపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, పర్యావరణవేత్తలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. 

అక్రమాస్తులు కాపాడుకునే పనిలో బీఆర్​ఎస్​

మూసీ పునరుజ్జీవం అంశంలో పేదలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్​ తన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నదని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. హైడ్రా నిర్ణయాలు బీఆర్ ఎస్​కు కలిసొచ్చేలా ఉంటున్నాయని, దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయి దృష్టిసారించాలని  సూచించారు.  హైడ్రా పేదల జోలికి వస్తే సీపీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని, మిత్రపక్షంగా ఉంటూనే  పోరాటం చేస్తామని అన్నారు.  హైడ్రా కమిషనర్ తన ప్రతాపం పేదలపై కాకుండా  భూకబ్జాదారులపై చూపాలని ఆయన పేర్కొన్నారు.  

బడాబాబులు అక్రమించుకుని నిర్మించుకున్న భవనాలను ముందుగా కూల్చాలని.. దానిని పక్కనపెట్టి పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లు  కూల్చడమేంటని  ప్రశ్నించారు. అమీన్​పూర్​లో ఓ మధ్యతరగతి కుటుంబం కష్టపడి స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుంటే ఓ అవినీతి ఎమ్మార్వో చేసిన ఫిర్యాదుకు తక్షణమే స్పందించి హైడ్రా అధికారులు ఎలాంటి విచారణ లేకుండా ఆ ఇంటిని కూల్చడం పెద్ద తప్పు అని పేర్కొన్నారు. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూములు, కబ్జాలకు గురైన భూములపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కూనంనేని సాంబశివరావు  డిమాండ్ చేశారు. చెరువులు, కుంటలు, నాలాల వద్ద ఇండ్లు కట్టుకుని ఏండ్ల తరబడి ఉంటున్న పేదలను గుర్తించి, వారికి పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయం కల్పించాలన్నారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు 58, 59 తదితర జీవోల్లో ఏది వర్తిస్తే దాని కింద వారి స్థలాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్​ చేశారు. 

నిరుద్యోగుల అనుమానాలు నివృత్తి చేయాలి

గ్రూప్ 1 మెయిన్స్​పై నిరుద్యోగుల్లో నెలకొన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని కూనంనేని అన్నారు. నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వానాకాలం పంటకు కూడా రైతు భరోసా ఇవ్వాల్సిందేనని,  గత ప్రభుత్వం మాదిరిగా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని ఆయన అన్నారు. కాగా, సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ మాట్లాడుతూ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్​ అసలు ఏమి చేస్తున్నారో, ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదని వ్యాఖ్యానించారు.

హుస్సేన్ సాగర్​ వద్ద అక్రమంగా జలవిహార్​ను నిర్మించి యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటూ నీళ్లను కలుషితం చేస్తున వారిపై సీపీఐ ప్రతినిధి బృందం ఆధారాలతో రంగనాథ్​కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. దేశవ్యాప్తంగా ఇక పెద్ద పార్టీలకు కాలం చెల్లినట్లేనని.. పెద్ద నాయకులను చూసి ఓట్లు వేసే పరిస్థితి  లేదని.. అన్ని రాష్ట్రాల్లో చిన్న, స్థానిక పార్టీలకు ఆదరణ పెరుగుతున్నదని..దీంతో సంకీర్ణ శకం రాబోతున్నదనే విషయం స్పష్టమవుతున్నదని ఆయన పేర్కొన్నారు.