ఎంపీ అర్వింద్​ తెస్తానన్న పసుపు బోర్డు ఎక్కడ..?

  •      బూతులు తిట్టుకునే వేదికగా అసెంబ్లీ
  •      విద్య, వైద్యం ఉచితంగా అందించాలి
  •     సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

నిజామాబాద్​, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తే అసలైన లబ్ధి చేకూరుతుందని సీపీఐ పార్టీ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.   ఆదివారం ఆయన నిజామాబాద్  నగరంలోని టీఎన్జీవో భవన్​లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాల పార్టీ రాజకీయ శిక్షణ సభలో మీడియాతో మాట్లాడారు. సెంట్రల్​, స్టేట్​ గవర్నమెంట్​లు బడ్జెట్​తో అంకెల గారడి ప్రదర్శిస్తున్నారని పేదలకు రావాల్సిన ప్రయోజనాన్ని  గమనించడం లేదన్నారు.  

డైరెక్ట్​గా లబ్ధి కలిగించే పథకాలు కావాలన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేయలేని పనులను కాంగ్రెస్​ గవర్నమెంట్​ చేసి చూపాలన్నారు.  ప్రధాని మోదీ బడా పారిశ్రామిక వేత్తలకు రూ.30 లక్షల కోట్లు మాఫీ చేశారని పేదల అప్పులు మాఫీ చేయడానికి మాత్రం అంగీకరించడం లేదన్నారు.  ప్రజా సమస్యలను చర్చించడానికి ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపితే  అక్కడ బూతులు తిట్టుకోవడంతో పాటు  పరస్పరంగా నిందించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  అలాంటి ఎమ్మెల్యేలపై వేటు వేసే చట్టాలు రావాలన్నారు.

  ఔట్​ సోర్సింగ్​, కాంట్రాక్టు పేర్లతో రాష్ట్రంలో అసంఘటిత కార్మికులు 2 కోట్ల దాకా ఉన్నారని వారికి కనీస వేతనాలు లభించడం లేదన్నారు.  ప్రజల పక్షాన ఎప్పటికీ పోరాడేది ఎర్ర జెండాలేనన్నారు.  పేదల పక్షాన పోరాడే గొంతుకగా మున్ముందు  సీపీఐ పార్టీకి మంచి రోజులు ఉన్నాయని తాను ఎక్కడికి వెళ్లినా అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలను తెలుపుతున్నారని చెప్పారు.  ఎంపీ అర్వింద్​ తెస్తానన్న పసుపు బోర్డు ఎక్కడుందని ప్రశ్నించారు.  సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, జిల్లా కార్యదర్శి పి.సుధాకర్​, ఏఐటీయూసీ జిల్లా జనరల్​ సెక్రెటరీ వై.ఓమయ్య, సాయిలు, తదితరులు ఉన్నారు.