ప్రైవేటు వ్యాపారులే దిక్కు

  • ఇంకా ఓపెన్ కాని సీసీఐ కొనుగోలు కేంద్రాలు

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి పంట చేతికి వచ్చినా ఇంకా సీసీఐ కేంద్రాలు ఏర్పాటు కాలేదు.  రైతులు పంట అమ్మేందుకు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.  ఇదే అదునుగా భావిస్తున్న ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకు కాకుండా తగ్గించి కొంటున్నారు.  కొందరు రైతులు మహారాష్ట్రకు వాహనాల్లో తీసుకెళ్లి అక్కడి ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులో అమ్ముకుంటున్నారు. 

15 రోజులుగా రైతులకు పత్తి పంట చేతికి వస్తున్నా  ఇంకా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు  ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు.  కెరమెరి, జైనూర్, లింగపూర్, సిర్పూర్ యూ, తిర్యాణి, ఏజెన్సీ ప్రాంతంతో పాటు కాగజ్ నగర్ డివిజన్ లోని ఏడు మండలాల రైతులు పత్తి పంట విక్రయించేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. 

రైతులకు నష్టం..  దళారులకు లాభం 

ఆసిఫాబాద్ జిల్లాలో  3 లక్షల 30 వేల ఎకరాల్లో పత్తిసాగు చేయగా, 23 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు.  పత్తిలో తేమశాతం 8 నుంచి 12 మధ్య ఉండాలి.  8 శాతం తేమ ఉంటే రూ . 7,521 మద్దతు ధర లభిస్తుంది. జిల్లాలో వర్షాల ప్రభావం, మంచు విపరీతంగా ఉంది.  సహజంగానే పత్తిలో తేమశాతం పెరుగుతుంది.  ప్రైవేట్ వ్యాపారులు తేమశాతాన్ని సాకుగా చూపి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటే తక్కువగా ఇస్తూ  రూ. 6,500  నుంచి 6,800 వరకు  కొనుగోలు చేస్తున్నారు. 

దీంతో  క్వింటాల్ పత్తిపై రూ. 800 నుంచి  900  వరకు తేడాతో తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుని రైతులు నష్టపోతున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, జైనూర్, కాగజ్ నగర్ లలో మార్కెట్ యార్డులు ఉండగా ఇప్పటి వరకు సీసీఐ కొనుగోళ్లను ఏర్పాట్లు చేయలేదు.  ఏటా దసరా తర్వాత పత్తి కొనుగోలు మొదలవుతుంది. 

 కానీ ఈ ఏడాది కొనుగోలు చేసేందుకు సీసీఐ తీవ్ర జాప్యం చేస్తోంది. జైనూర్ సిర్పూర్ యు, లింగాపూర్ మండలాలకు దగ్గరలో  సీసీఐ కొనుగోలు సెంటర్ లేక వార సంతలో అమ్ముకుంటున్నారు.  మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఉంటే ఖర్చు తగ్గేదని , దూర ప్రాంతాలకు పంట తరలించేందుకు ట్రాక్టర్, కూలీల ఖర్చు పోను రైతులకు ఏమి మిగలదని వాపోతున్నారు.

పట్టించుకోని అధికారులు.

జిల్లాలో విచ్చలవిడిగా అనుమతి, లైసెన్సు లేకుండానే గ్రామాల్లో, వారసంతల్లో పత్తి కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో దళారులు దర్జాగా కాంటలు ఏర్పాటు చేసుకుని తక్కువ ధరలకే కొనుగోలు చేస్తున్న అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహారిస్తుండటంతో వారి దందాకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. 

 ప్రతీ కొనుగోలుకు కనీసం రసీదు ఇవ్వకుండా కేవలం తెల్ల కాగితం మీద రాసి ఇస్తున్నారు.  గ్రామాల్లో మండల కేంద్రంల్లో పంటలు కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని ఉండాలి కానీ అదేమీ కనబడడం లేదు. రైతుల మేలు కోసం ఇప్పటికైనా ప్రభుత్వం ,అధికారులు చొరవ చూపాలని రైతన్నలు కోరుతున్నారు.కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..  

కలెక్టర్ కు వినతి

జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే కు రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. భారీ వర్షాల కారణంగా పత్తి దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టపోయామని,  క్వింటాలు కు రూ. పది వేలు మద్దతు ధర కల్పించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. 

సీసీఐ ద్వారానే పత్తి కొనాలి

ప్రైవేట్ వ్యాపారస్తులతో రైతు తీవ్రంగా నష్ట పోతున్నారు. ప్రభుత్వ మద్దతు ధరతో జైనూర్ మండల కేంద్రంలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. ఇటు ఆదిలాబాద్ అటు ఆసిఫాబాద్ తరలించాలంటే ట్రాన్స్‌ పోర్టు ఖర్చులు అదనంగా భరిస్తున్నాం.  ఈ సంవత్సరం అసలే దిగ్గుబడి తగ్గింది. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.- పెందోర్ .దాదేరావు ,రైతు, జంగాం జైనూర్