వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలి..బండి సంజయ్​కు కేటీఆర్ లీగల్ నోటీసులు

  • లేదంటే పరువు నష్టం దావా వేస్తా

హైదరాబాద్, వెలుగు : తనపై నిరాధారమైన, పరువుకు నష్టం కలిగించేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్లు చేశారంటూ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. ‘‘నా పై చేసిన కామెంట్లకు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే పరువు నష్టం దావా వేస్తా. ఈ నెల 19వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. నేడు డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్​కు పాల్పడ్డానని అన్నారు. ఆయన చేసిన కామెంట్లు నా వ్యక్తిత్వాన్ని అవమానపర్చేలా ఉన్నాయి.

నా ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి..’’అని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. దురుద్దేశంతోనే తనపై సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ‘‘కేసుల నుంచి తప్పించుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డితో నేను రహస్యంగా కలిశానని సంజయ్ ఆరోపించారు. ఇదే నిజమైతే ఆయన దీన్ని నిరూపించాలి. ఎలాంటి ఆధారాల్లేకుండా ఇష్టానుసారంగా నా పరువుకు భంగం కలిగించే కామెంట్లు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. వెంటనే వ్యాఖ్యలను ఉప సంహరించుకొని వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలి’’ అని కేటీఆర్ హెచ్చరించారు.  

పరువు నష్టం దావా కేసులో కేటీఆర్‌‌ స్టేట్‌మెంట్‌ రికార్డ్‌

మంత్రి కొండా సురేఖపై  కేటీఆర్‌‌ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి మనోరంజన్‌ కోర్ట్‌ బుధవారం స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాల ఆధారంగా దాదాపు 15 నిమిషాల పాటు కోర్టు వాంగ్మూలం తీసుకుంది. సాక్షిగా దాసోజు శ్రవణ్‌ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.స్టేట్‌మెంట్స్‌ను తిరిగి  సరిచూసుకోవాలని కోర్టు సూచించింది.

మిగితా సాక్షులు బాల్క సుమన్‌, సత్యవతి రాథోడ్, తుల ఉమ స్టేట్‌మెంట్స్​ను రికార్డ్ చేసేందుకు సమయం లేక పోవడంతో విచారణ ఈ నెల30కి వాయిదా వేసింది.అక్కినేని నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కేటీఆరే ప్రధాన కారణమని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఇటీవల పరువు నష్టం దావా వేశారు.