ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణ?

  • న్యాయ సలహా కోరుతూ ఏజీఐకి గవర్నర్ లేఖ!  
  • ఏజీఐ సలహాఅనంతరం విచారణకు అనుమతి ఇచ్చే చాన్స్
  • ఇప్పటికే రెగ్యులర్ఎంక్వైరీ ప్రారంభించినఏసీబీ అధికారులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఫార్ములా ఈ రేస్‌‌‌‌‌‌‌‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ను విచారించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎమ్మెల్యేల అరెస్ట్‌‌‌‌‌‌‌‌, ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ప్రొసీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గవర్నర్ కార్యాలయం దృష్టిసారించింది. న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా(ఏజీఐ)కు లేఖ రాసినట్టు తెలిసింది. ప్రివెన్షన్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ కరప్షన్ యాక్ట్‌‌‌‌‌‌‌‌–2018,సెక్షన్ 17( ఏ) కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే వివరాలు వెల్లడించాలని కోరినట్టు సమాచారం.

ఈ కేసుకు సంబంధించి మున్సిపల్ శాఖ, ఏసీబీ అందించిన ఆధారాలను కూడా లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జత చేసినట్టు తెలిసింది. ప్రజాప్రతినిధులను విచారించే క్రమంలో ఏసీబీకి ఎలాంటి పరిమితులు ఉంటాయి? ప్రివెన్షన్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ కరప్షన్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ వర్తిస్తుందా? లేదా? వివరాలకు సంబంధించిన లీగల్‌‌‌‌‌‌‌‌ ఒపీనియన్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నట్టు సమాచారం. ఏజీఐ సలహా అనంతరం సంబంధిత ప్రజాప్రతినిధులను విచారించేందుకు ఏసీబీకి గవర్నర్ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. 

బ్యాంక్ లావాదేవీలపై ఏసీబీ ఆరా.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ టైమ్ లో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాసింది.

ఏసీబీకి కూడా మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది. దీంతో రెగ్యులర్ ఎంక్వైరీ కింద ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఫార్ములా ఈ రేస్‌‌‌‌‌‌‌‌ కోసం జరిగిన బ్యాంక్ లావాదేవీలపై ఏసీబీ ఆరా తీస్తున్నట్టు తెలిసింది. హెచ్ఎండీఏ నుంచి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ అయిన నిధులు.. ఏ అకౌంట్స్ లోకి చేరాయనేది? గుర్తించినట్టు సమాచారం.