కళ తప్పిన కొత్తచెరువు పార్క్‌‌‌‌

రాజన్నసిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని కొత్తచెరువు పార్క్‌‌‌‌ కళ తప్పింది. మున్సిపల్ పాలకవర్గం, అధికారుల  నిర్లక్ష్యంతో నిర్వహణ లేక ట్యాంక్‌‌‌‌ బండ్‌‌‌‌పై వివిధ ఆకారాల్లో నిర్మించిన జంతువుల బొమ్మల మధ్య పిచ్చి మొక్కలు పెరగడంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారింది. సుందరీకరణలో భాగంగా గత ప్రభుత్వం కొత్తచెరువుపై రూ.14కోట్లతో మినీ ట్యాంక్‌‌‌‌ బండ్ పార్కును నిర్మించింది. మరో రూ.3 కోట్లతో చెరువు సుందరీకరణ చేపట్టారు. మొత్తంగా రూ.17కోట్లతో 1.2 కి.మీ పొడవున నిర్మించిన బండ్‌‌‌‌ను 2022 ఆగస్టులో ప్రారంభించగా.. నాణ్యతా లోపంతో నిర్మించడంతో రెండేళ్లకే బండ్‌‌‌‌పై పగుళ్లు వచ్చాయి. 

అలాగే చెరువులో బోటింగ్ కోసం రెండు బోట్లను ఏర్పాటు చేయగా.. ఒక్కసారి కూడా బోటింగ్‌‌‌‌ చేయలేదు. చెరువు బండ్‌‌‌‌పై తిరిగేందుకు ఏర్పాటు చేసిన టాయ్‌‌‌‌ ట్రైన్‌‌‌‌ నిరుపయోగంగా ఉంటోంది. ఓపెన్‌‌‌‌ స్టేజీ, బండ్‌‌‌‌ కట్టపై ఏర్పాటు చేసిన ‘ఐ లవ్‌‌‌‌ సిరిసిల్ల’ లోగో కళ తప్పింది. మరోవైపు కొత్తచెరువుకు ఆకర్షణగా నిలిచే ఐలాండ్‌‌‌‌ పనులు ఇంకా మొదలుకాలేదు. దీనిపై సిరిసిల్ల మున్సిపల్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జి కమిషనర్‌‌‌‌‌‌‌‌ మీర్జా ఫసహాత్‌‌‌‌ అలీబేగ్‌‌‌‌ మాట్లాడుతూ కొత్తచెరువు బండ్‌‌‌‌ పార్క్‌‌‌‌లో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తామన్నారు. కట్టపై పేరుకుపోయిన గడ్డి, పిచ్చి మొక్కలను తొలగిస్తామన్నారు.