మాల ధారణ భక్తులతో కొండగట్టు కాషాయమయం

కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ( మే 31)   ఉదయం స్వామి వారిని అరటి పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్థాపితా దేవారాధన, హోమం, సుందరకాండ పారాయణం, పంచామృత అభిషేకం, సహస్ర నామార్చన, మహా నివేదన, మంత్రపుష్పం అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. మాలధారణ భక్తులు వారిని దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలిరావడంతో కొండగట్టు కాషాయమయం అయింది. 

రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు, మాలధారులు పెద్ద ఎత్తున అంజన్న కొండకు చేరుకుంటున్నారు. ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఏటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు

ఉత్సవాల్లో భాగంగా బుధవారం ( మే 29)  రుత్వికులు అంకురార్పణ చేసి ఉత్సవాలు ప్రారంభించారు. మాల విరమణకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో అంజన్న క్షేత్రంలో రద్దీ ఏర్పడింది. కాగా, ఉత్సవాల దృష్ట్యా ఆర్జిత సేవలు, వాహన పూజలను అధికారులు రద్దుచేశారు. 900 మంది పోలీసులతో భద్రత ఏర్పాటుచేశారు. ఈ ఉత్సవాలు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు కొండగట్టు అంజన్నను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.   వీరికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.  ఉత్సవాల సందర్భంగా పార్కింగ్ స్థలం నుంచి గుట్టపైన వై జంక్షన్ వరకు నాలుగు ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం 28 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. దీక్షాపరుల మాలవిరమణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కేశఖండనానికి కోనేరు పక్కన స్థలం కేటాయించారు. ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో 650 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తారు. 

కొండగట్టులో జూన్ 1 హనుమత్  జయంతి కార్యక్రమ వివరాలు 

 

  • జూన్ 1న ఉదయం 3 గంటలకు తిరుమంజనము , ద్రావిడ ప్రబంధ పారాయణములు
  • ఉదయం 9 గంటలకు హవనము, శ్రీస్వామి వారికి  పంచామృత క్షీరాభిషేకం, సహస్రనాగవల్లి అర్చన
  • ఉదయం 10 గంటలకు తులసి అర్చన హోమము
  • మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పూర్ణాహుతి, స్నపన తిరుమంజనము, ఊయల సేవ, మంత్ర పుష్పము, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగము, సామూహిక భజన.
  • సాయంత్రం  3 గంటల 30 నిమిషాలకు కంకణోద్వాసన, మంత్రపుష్పము, మహదశీర్వాదము, సామూహిక భజన, తీర్థ ప్రసాద వినియోగం
  • సాయంత్రం 5 గంటలకు ఆరాధన
  • సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం
  • సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అమ్మవారి కుంకుమార్చన, ఓడిబియ్యము.
  • సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు సహస్ర దీపాలంకరణ
  • సాయంత్రం 9 గంటలకు గరుడ వాహన సేవ , సామూహిక భజన, తీర్థ ప్రసాద వినియోగం