గుట్టలో ‘గోల్డ్ మేన్’ సందడి..ఫొటోల కోసం పోటీపడ్డ భక్తులు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన గోల్డ్ మేన్ సందడి చేశారు. సోమవారం తెలంగాణ హాకీ అధ్యక్షుడు, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్(గోల్డ్ మేన్) తన బృందంతో కలిసి స్వామివారి దర్శనం కోసం యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చారు. మెడ నిండా బంగారు ఆభరణాలు ధరించిన అతడిని చూసిన భక్తులు ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ప్రతి ఒక్కరితో ఫొటోలు, సెల్ఫీలు దిగారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించడం తనకు ఇష్టమన్నారు. 2016లో 'హోప్ ఫౌండేషన్' ఏర్పాటు చేసి పలు సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు ఎలాంటి విరాళాలు సేకరించడం లేదని, దేవుడి దయతో వ్యాపారం ద్వారా సంపాదించిన సొంత డబ్బుతోనే పలువురు సాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.