తన భర్త రెండో పెండ్లి చేసుకున్నాడని .. కొమురవెల్లి ఎస్​ఐ భార్య ధర్నా

కొమురవెల్లి, వెలుగు : తన భర్త చెప్పకుండా రెండో పెండ్లి చేసుకున్నాడని, పిల్లలను తన నుంచి దూరం చేసి విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడంటూ కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు భార్య బంధువులతో కలిసి మంగళవారం పోలీస్​స్టేషన్​ఎదుట ఆందోళనకు దిగింది.  బాధితురాలి కథనం ప్రకారం..కరీంనగర్​ జిల్లా గోపాలపూర్​కు చెందిన నాగరాజు కొమురవెల్లి ఎస్ఐగా పని చేస్తున్నాడు. గోపాలపూర్​కు చెందిన మానసను పదేండ్ల కింద పెండ్లి చేసుకున్నాడు. వీరికి ఎనిమిది, నాలుగేండ్ల వయస్సున్న ఇద్దరు కొడుకులున్నారు. నాగరాజు రెండేండ్ల కింద భార్యకు చెప్పకుండా రెండో పెండ్లి చేసుకున్నాడు. 

అప్పటి నుంచి ఇంటికి సరిగ్గా రాకపోవడంతో ఎక్కడకి వెళ్తున్నావని నిలదీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండేండ్ల కింద మానసకు చెప్పకుండా పిల్లలను తీసుకుని కొమురవెల్లికి వచ్చాడు. పిల్లల్ని తల్లి దగ్గరకు పంపకుండా విడాకులివ్వాలంటూ మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో ఇటీవల మానస ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబసభ్యులు కాపాడారు. పిల్లల కోసం నాగరాజుకు ఫోన్ చేస్తే బ్లాక్ చేస్తున్నాడు. దీంతో నాగరాజుపై సిద్దిపేట పోలీస్​ కమిషనర్ కు​, చేర్యాల సీఐకి, కరీంనగర్ ఉమెన్స్ సెల్ లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. తల్లి, అక్క, బంధువులతో కలిసి మంగళవారం కొమురవెల్లికి వచ్చింది. 

ఎస్ఐ నాగరాజు ఇంటి అడ్రస్​ కనుక్కుని అక్కడికి వెళ్లగా తాళం వేసి ఉంది. దీంతో పోలీస్​స్టేషన్​కు వచ్చింది.  తను ఎస్ఐ నాగరాజు భార్యనని, అతడికి ఎక్కడికి వెళ్లాడని సిబ్బందిని అడిగింది. వారు ఎస్ఐ భార్య వేరే ఉన్నారని, మానసను మీరెవరంటూ ప్రశ్నించారు. దీంతో తన భర్త నాగరాజును వెంటనే రప్పించి, తన ఇద్దరు పిల్లలను తనకు అప్పగించకపోతే ఇక్కడి నుంచి వెచేలా చర్యలు తీసుకోవాలంటూ అక్కడే ధర్నాకు దిగింది. రాత్రి తొమ్మిది గంటల వరకు పీఎస్​ మెట్లపైనే బైఠాయించిన ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో వెళ్లిపోయింది. ఈ విషయమై ఎస్​ఐ నాగరాజును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన 
అందుబాటులోకి రాలేదు.

కమలాపూర్​లో భర్త ఇంటి ఎదుట నిరసన 

కమలాపూర్ :  తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ, తన కూతురితో కలిసి భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది.  బాధితురాలి కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్​కు చెందిన రాముతో..హనుమకొండకు చెందిన భూక్య సరితకు 2011లో పెండ్లయ్యింది. హనుమకొండలోనే కొంతకాలం కాపురమున్నారు. వీరికి పాప ఉండగా గొడవలు జరగడంతో 2016లో హనుమకొండ మహిళా పీఎస్​లో సరిత ఫిర్యాదు చేసింది. తనకు కలిసి ఉండడం ఇష్టం లేదని చెప్పిన రాము సరితకు రూ. 3 లక్షల నగదు , 60 గజాల జాగా ఇస్తానని పేపర్ ​రాసిచ్చాడు. తర్వాత కనిపించకుండా పోయాడు. 

కమలాపూర్​ జీపీ ఆఫీసులో రాము కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడని తెలుసుకుని అతడి ఇంటికి వెళ్లి ఆందోళన చెసింది. రాము పరార్ ​కాగా, తనకు రాసిచ్చిన విధంగా డబ్బులతో పాటు ఇంటి స్థలం ఇవ్వాలని అత్తమామలను డిమాండ్ చేసింది. విషయం తెలుసుకున్న సీఐ హరికృష్ణ అక్కడికి వచ్చి న్యాయం చేస్తానని సరితతో మాట్లాడారు. రాము అందుబాటులో లేడని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందన్నారు.  వీలైనంత తొందరలో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో  ఆందోళన విరమించింది.