- కేసీఆర్ నల్గొండ పర్యటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్
- బీఆర్ఎస్ గురించి మాట్లాడటం టైం వేస్ట్: మంత్రి ఉత్తమ్
- కార్యకర్తల కష్టం ఫలితంగానే అధికారంలోకి వచ్చాం: దీపాదాస్
నల్గొండ/ సూర్యాపేట, వెలుగు: ప్రజల్లోకి వెళ్లే ముఖం లేక కరువు యాత్ర పేరుతో నల్గొండకు వస్తున్న కేసీఆర్‌కు సిగ్గుండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ చేసిన మోసాల వల్లే రాష్ట్రంలో కరువొచ్చిందని ఫైర్ అయ్యారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. పదేండ్ల కింద కృష్ణా జలాలను ఏపీ సీఎం జగన్‌కు తాకట్టు పెట్టి తెలంగాణకు నీళ్లు లేకుండా చేసిన కేసీఆర్.. ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప ఇతర ప్రాజెక్టుల గురించి కేసీఆర్ ఆలోచన చేయలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, పదేండ్లు పని ఎగ్గొట్టి ఫాంహౌస్‌లో పడుకున్న కేసీఆర్‌కు పోటీ జరుగుతున్నదని, ఇందులో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. అధికారం పోయిన బాధలో హరీశ్‌రావు, కేటీఆర్ సోయి తప్పి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పని అయిపోయింది: మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఎంపీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ అని స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికల్లోనూ దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీకి ఇక్కడ ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. నల్గొండలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు చెప్పడం కూడా వేస్ట్ అని, ఓ కబ్జాకోరును అభ్యర్థిగా నిలబెట్టిందని దుయ్యబట్టారు.
ఆరు గ్యారంటీలు అమలు చేసినం: దీపాదాస్
కార్యకర్తలు పడ్డ కష్టానికి ప్రతిఫలంగానే నేడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని దీపాదాస్ మున్షీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసినట్టు చెప్పారు. పేదలకు అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ చేతితో చేయి కలిపి.. ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్లగొండలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని నిరూపించాలని ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సీనియర్ నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు బాలూనాయక్, బత్తుల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు అవాస్తవం
హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇటీవల అసెంబ్లీలో కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతానని, సహాయం చేయాలని అడిగాడని.. ఇప్పుడు తనపై తప్పుడు కామెంట్లు చేస్తున్నాడని మండిపడ్డారు.“కాంగ్రెస్‌లోకి వస్తా.. మంత్రి పదవి కావాలని మహేశ్వర్‌రెడ్డి అడిగిండు. కాంగ్రెస్‌లోనే ఉంటే ఇప్పుడు మంత్రిగా ఉండేవాడినని నాతో చెప్పిండు. మాకే సరిపడా మెజార్టీ ఉంది. ఎవరినీ చేర్చుకోవాలనే ఉద్దేశం పార్టీకి లేదని చెప్పిన. అది మనసులో పెట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నడు. నితిన్ గడ్కరీ, అమిత్ షా దగ్గరికి వెళ్లి ఏదో చెప్పానని పనికిమాలిన కామెంట్లు చేస్తున్నడు. ఆయనకు దమ్ముంటే వాళ్లను భాగ్యలక్ష్మి టెంపుల్‌కు తీసుకొని రావాలి.. అక్కడ ప్రమాణం చేద్దాం. ఐదేండ్లకో పార్టీ మారే.. గాలి మాటల మహేశ్వర్ రెడ్డి.. ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీ, మధ్యలో బీఆర్ఎస్ తో టచ్.. ఇట్ల ఒక్కటి కాదు ఆయన పోని పార్టీ ఈ రాష్ట్రంలో లేదు” అని ఫైర్ అయ్యారు. “నేను షిండేను అవునో.. కాదో.. భగవంతుడికి ఎరుక.. ఆయన మాత్రం కిషన్ రెడ్డికి, ఈటల రాజేందర్‌కు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనార్దన్ రెడ్డి’’ అని మండిపడ్డారు. కాగా, పార్టీలోకి చేరికల కోసం కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ ఒక్కటేనని వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పాలిటిక్స్‌లో మహేశ్వర్ రెడ్డి ఓ జోకర్ అని ఫైర్ అయ్యారు.