కోల్ కతా డాక్టర్ కేసు : కొన ఊపిరితో ఉన్నప్పుడు కూడా లైంగికదాడి 

  • = శరీరంపై 14 తీవ్రమైన గాయాలు

  • = గొంతు ఎముకలు విరిగిపోయాయ్

  • = గోళ్లతో గీచిన, కొరికిన దెబ్బలు

  • = అభయ పోస్టుమార్టం రిపోర్టు

కోల్ కతా:   జూనియర్ డాక్టర్ అభయపై కొన ఊపిరితో ఉన్నప్పుడే లైంగికదాడి జరిగినట్టు పోస్టు మార్టం నివేదికలో వైద్యులు తేల్చారు. గొంతునులమడంతో ఎములకు విరిగిపోయాయని తెలిపారు. ఒంటిపై మొత్తం 14తీవ్రమైన గాయాలున్నట్లు వెల్లడించారు. గొంతు ఎముకలు విరిగిపోయాయని, అభయ శరీరంపై కొరికిన గాట్లు, గోళ్లతో గీచిన గాయాలు ఉన్నాయని నివేదికలో తెలిపారు.

బలవంతంగా లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని, దీని కారణంగా ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద లోతైన గాయం జరిగినట్లు ఆ నివేదికలో ఉంది. ఊపిరితిత్తుల్లో అధిక మొత్తం రక్తస్రావం జరిగినట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించారు.ఆ సమయంలో ఆమె నిందితుడితో శక్తిమేరకు పోరాడి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. నిందితుడు సంజయ్‌ రాయ్‌కి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు అతడి శరీరంపై గోళ్లతో రక్కిన గుర్తులు కన్పించాయట. బాధితురాలి మృతదేహాన్ని పరిశీలించగా.. ఆమె గోళ్లలోని చర్మం, రక్త నమూనాలు నిందితుడి నమూనాలతో సరిపోలినట్లు తెలుస్తోంది.

శరీరంపై బెడ్‌షీట్‌ కప్పి 

మరోవైపు, వైద్యురాలి మృతదేహాన్ని తొలిసారి చూసిన ఓ సాక్షి మీడియాతో మాట్లాడారు. ‘‘సెమినార్‌ హాల్‌లోని పోడియం దగ్గర ఆమె విగతజీవిగా కన్పించింది. ఒంటిపై కుర్తా చిందరవందరగా చిరిగిపోయింది. ట్రౌజర్స్‌ కన్పించలేదు. మెడ నుంచి మోకాలి వరకు నీలం రంగు బెడ్‌షీట్‌ కప్పి ఉంది. ఆమె ల్యాప్‌టాప్‌, నోట్‌బుక్‌, సెల్‌ఫోన్‌, వాటర్‌బాటిల్‌ పక్కనే ఉన్నాయి’’ అని ఆ సాక్షి ఓ జాతీయ మీడియాకు వివరించారు.

సెమినార్‌ హాల్‌లో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చిన ఆమె ఒంటరిగా ఉందని గ్రహించి నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.