మమతా బెనర్జీ తప్పులు వ్యతిరేకమయ్యేనా?

ఆగస్టు 9న  పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్​కతాలోని మెడికల్ కాలేజ్​ అండ్​ హాస్పిటల్​లో జరిగిన ట్రైనీ డాక్టర్​ దారుణ రేప్, మర్డర్ ​కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనతో మమతా బెనర్జీ  పాలనా సామర్థ్యంపై సర్వత్రా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమస్య ఇకముందు ఎక్కడికి దారితీస్తుందో ఎవరూ కచ్చితంగా ఊహించలేరు. కానీ, మహిళా జూనియర్​ డాక్టర్​ హత్యోదంతం మమతా బెనర్జీ ప్రభుత్వ పాలనలోని డొల్లతనంను బహిర్గతం చేసింది. ఆమె రాజకీయ నైపుణ్యాలు క్షీణించి ఉండవచ్చనే వాదన రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. మహిళా వైద్యురాలి హత్య ఘటనతో  ఆమె ఇమేజ్ దెబ్బతింది. 

200 సంవత్సరాల క్రితం, ఆంగ్ల చరిత్రకారుడు థామస్ కార్లైల్ ‘చరిత్ర అనేది గొప్ప వ్యక్తుల కథ’ అని చెప్పాడు.  గొప్ప వ్యక్తుల జీవితాలు ఒక కాలం లేదా ప్రదేశం చరిత్రను సరిగ్గా వెల్లడిస్తాయని ఒక సిద్ధాంతం ఉంది. అదే గ్రేట్ లైవ్స్ థియరీ. 

మమతా బెనర్జీ బెంగాల్‌‌లో 1984లో కాంగ్రెస్ ఎంపీ అయినప్పటి నుంచి కీలక రాజకీయ నాయకురాలిగా ఉన్నారు. 1998లో కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన మమతా బెనర్జీ  తృణమూల్ కాంగ్రెస్‌‌ పార్టీను స్థాపించారు. మమత సారథ్యంలోని తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ  2011 పశ్చిమ బెంగాల్​శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఆమె ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు.  ఆ తర్వాత 2016లో మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అనంతరం 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్​ విజయాన్ని సాధించారు. 2021లో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్​ పార్టీ కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌‌ అభ్యర్థులను ఘోరంగా ఓడించింది. అయితే మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పశ్చిమ బెంగాల్​లో  కాంగ్రెస్​, కమ్యూనిస్ట్​ పార్టీలను వెనక్కునెట్టి  ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. బెంగాలీలు పోరాట యోధులను అమితంగా ఇష్టపడతారు. దక్షిణాది రాష్ట్రాల్లో  రాజకీయాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ, పశ్చిమ బెంగాల్‌‌లో మాత్రం మధ్యతరగతి ప్రజలే రాజకీయాలను శాసిస్తున్నారు. 

మహిళలు, మధ్యతరగతి వర్గాల్లో నిరాశ

బెంగాలీ విలువలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విస్మరించారని రాజకీయ నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె మొదటి కేబినెట్‌‌లో చాలామంది ప్రముఖ నాయకులు ఉండేవారు. కానీ. కోల్​కత్తా  మెడికల్ కాలేజీలో తలెత్తిన తీవ్ర సంక్షోభం విచిత్రమైన వాస్తవాలను బయట ప్రపంచానికి బహిర్గతం చేసింది.  ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మమతా బెనర్జీ ఇతర ప్రధాన శాఖలైన.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, శాంతిభద్రతలను పర్యవేక్షించే హోంమంత్రి శాఖలను కూడా తన అధీనంలో ఉంచుకున్నారు.  ప్రతిదీ ఆమె కంట్రోల్​లో ఉంచుకున్నారు.  మమతా బెనర్జీకి మధ్యతరగతి ప్రజలు మద్దతు ఇవ్వడంతోనే ఆమె వరుసగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అయితే, కట్టుదిట్టమైన భద్రత ఉండే బెంగాల్​ రాజధాని కోల్​కతాలో  వారి హృదయాలను కదిలించేలా మహిళా డాక్టర్​ దారుణ హత్య జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  ఈ హత్యాచారంపై  నిరసనలు పెల్లుబుకుతున్నాయి. మధ్యతరగతి వర్గాలు పూర్తిగా నిరాశకు గురయ్యాయి. 

మమత బలాలు

మమత ఎప్పుడూ ప్రజల్లో ఉంటారు. తన ఆందోళనల ద్వారా సామాన్య ప్రజలతో మమేకం అవుతారు.  మమత వ్యక్తిగత నిజాయతీ,  ఆమె తన మధ్యతరగతి విలువలకు కట్టుబడి ఉండటంతో రాజకీయంగానే కాక, ప్రజలలోనూ ప్రత్యేకమైన ఇమేజ్​ను సంపాదించుకున్నారు.  ప్రజల్లో పెరిగిన పలుకుబడిని ఆమె రాజకీయ ఎదుగుదలకు ఉపకరించేలా మార్గం సుగమం చేసుకున్నారు. దశాబ్దాలుగా మమతా 
బెనర్జీకి వ్యక్తిగతంగా గొప్ప ఫాలోయింగ్ ఉంది. మరే ఇతర బెంగాలీ నాయకుడూ సొంతంగా ఆమెస్థాయి వ్యక్తిగత ప్రజాదరణ పొందలేదని చెప్పొచ్చు.  

మమత బలహీనతలు

పశ్చిమ బెంగాల్ ఓటర్లలో  కీలకపాత్ర పోషిస్తూ 34% ఉన్న మైనారిటీలపై మమతా బెనర్జీ పూర్తిగా ఆధారపడి ఉన్నారు.  మమత సారథ్యంలోని తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీకి మైనారిటీల నుంచి 90% ఓట్లు వచ్చాయి. ఆపై హిందూ ఓట్లలో కొద్ది శాతం మాత్రమే ఆమెకు అవసరం. కాబట్టి, మమత ప్రభుత్వం హిందువుల పట్ల నిర్లక్ష్య ధోరణితో  వ్యవహరించింది. ఆమె మైనారిటీ ఓట్లపై ఆధారపడటం హిందువులకు కోపం తెప్పించింది.  ఈ పరిణామం పశ్చిమ బెంగాల్​లో బీజేపీ ఎదుగుదలకు సహకరించింది. టీఎంసీని ఎదుర్కొనే ప్రతిపక్షంగా బీజేపీ ఎదిగింది.  ఇది మమత భవిష్యత్తుకు పెద్ద సమస్య.  

డైనస్టీగా మారిన మమత పాలన

మమత తన పార్టీ సభ్యుల క్రమశిక్షణ పట్ల ఉదాసీనంగా వ్యవహరించింది.  హింస, అత్యాచారాలపై గళమెత్తిన నిరసనకారులపై కరుకుగా ప్రవర్తించింది. దీంతో  ప్రజలు బహిరంగంగా మాట్లాడేందుకు భయపడేవారు.  కానీ, కోల్​కతాలో జరిగిన మహిళా వైద్యురాలి దారుణ హత్య ప్రజల్లో కదలిక తెచ్చింది. వారిలో భయాన్ని తగ్గించి ఆందోళన రూపంలో నిరసన వ్యక్తం చేయడానికి ద్వారాలను తెరిచింది. మమతా బెనర్జీ మొదటిసారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆమె కేబినెట్​లో  దిగ్గజాలు వంటి నాయకులు,  మేధావులు ఉండేవారు. ప్రస్తుతం ఆమె ప్రభుత్వంలో అంతటి స్థాయి ఉన్న నాయకులు లేరు. ఆమె మంత్రివర్గంలో ఉన్న  చాలామంది మంత్రులకు పరిపాలనపై అవగాహన లేదంటే అతిశయోక్తి కాదు. మరోవైపు ఇప్పటివరకు  బెంగాల్‌‌లో  పొలిటికల్​ డైనస్టీలు లేవు. అయితే, మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని రాజకీయ వారసుడిగా ప్రోత్సహించడంతో మమత సారథ్యంలోని తృణమూల్​ కాంగ్రెస్ ​డైనస్టీ పార్టీగా మారింది. 

డేంజర్​ సిగ్నల్స్​

మమతా బెనర్జీ సర్కారు అవలంబిస్తున్న కఠినమైన చర్యలు, నిర్లక్ష్యం కారణంగా  తృణమూల్​ కాంగ్రెస్ ప్రజా మద్దతుని కోల్పోతోంది. చరిత్రలో రాజులను గద్దెదించేలా విప్లవాలు చేసింది మధ్యతరగతి వారేనన్న వాస్తవాన్ని బహుశా మమత విస్మరించి ఉండొచ్చు. మమతా బెనర్జీని అధికారంలోకి తెచ్చింది బెంగాలీ మధ్యతరగతి వర్గాలే. అయితే, మధ్యతరగతి ప్రజలు సాధారణంగా వీధుల్లోకి రారు. కానీ, కీలక సమయంలో వారు తమ నిర్ణయాన్ని తెలిపే విషయంలో చాలా శక్తిమంతులుగా ఉంటారు.  ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలు మమతా బెనర్జీ ప్రభుత్వంతో విసిగిపోయినట్లు కనిపిస్తోంది. అది ప్రమాదకరమైన సంకేతం. 2024 పార్లమెంటు ఎన్నికలలో మధ్యతరగతి ప్రజలే తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీకి గణనీయమైన ఆధిక్యతను అందించారు. ఎందుకంటే  తమ కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదని వారు కలత చెందారు. దీంతో ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ పశ్చిమ బెంగాల్​లో  నష్టపోయిందనే విషయాన్ని మమతా బెనర్జీ మర్చిపోకూడదు. 

మమత పొలిటికల్ స్టైల్ మార్చుకోవాలి

బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది.  అప్పటికి మహిళా వైద్యురాలి దారుణ హత్య ఘటన మరుగున పడిపోవచ్చు.  అయితే, మమత సర్కారు సుపరిపాలన సామర్థ్యాన్ని కోల్పోయిందని ఇలాంటి ఘటనలు గుర్తుచేస్తాయి.  ఆమె కేబినెట్​లో  సమర్థులైన మంత్రులు లేరనే భావన కూడా బెంగాల్‌‌ ప్రజలలో ఉంది.  ఆమె పూర్తిగా బ్యూరోక్రసీపై ఆధారపడి ఉంది. భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు బ్యూరోక్రసీ,  సైకోఫాంట్ల మీద మాత్రమే ఆధారపడ్డ తర్వాత వారి రాజకీయ జీవితం ఖచ్చితంగా ముగింపు దశకు చేరుకుంటుంది. 

మమత తన పొలిటికల్​స్టైల్ మార్చుకుని మెరుగైన పాలన ఇవ్వగలదా  లేదా అనేది ప్రశ్న.  మార్పు అవసరం అయినప్పటికీ రాజకీయ నాయకులు తమకు తాముగా మారడం దాదాపు అసాధ్యం. అదేవిధంగా  మమత కూడా మారడం అనుమానమే. బెంగాలీ ప్రజానీకం ఆమెను క్షమిస్తారా లేక ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతారా అనేది కాలమే తెలియజేస్తుంది. మమత హయాంలో లెక్కలేనన్ని హత్యలు, అత్యాచారాలు జరిగాయి.  కానీ,   వైద్యురాలి హత్య ఘటనపై  ప్రజల ప్రమేయం విభిన్నంగా ఉంది. ఈ సంఘటన ముగిసే విధానం మమత ప్రభుత్వ నిబద్ధతను, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగితే  మమతా బెనర్జీ సర్కార్​ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. 

- డా. పెంటపాటి పుల్లారావు (పొలిటికల్​ ఎనలిస్ట్)​