తెలంగాణ కిచెన్ : వేసవిలో వెరైటీ టేస్ట్​

వేసవిలో శ్నాక్స్ తినాలనిపిస్తుంది. కానీ ‘ఆయిలీ ఫుడ్​ వద్దులే’ అనుకుంటారు. దానికి బదులు ఎక్కువగా డ్రింక్స్ తాగడానికే ఇష్టపడతారు. కానీ ఇక్కడ చెప్పినలాంటి శ్నాక్స్ కళ్లముందు ఉంటే మాత్రం మరో ఆలోచన లేకుండా తినేయొచ్చు. ఆరోగ్యానికి హాని కలిగించని ఆ శ్నాక్స్​ను ఒకసారి ట్రై చేసి టేస్ట్​ చేయండి. 

రసమలై

కావాల్సినవి :

పాలు - లీటర్
బాదం, పిస్తా (సన్నగా తరిగి)- రెండు టేబుల్ స్పూన్లు
కుంకుమ పువ్వు - చిటికెడు
యాలకుల పొడి - అర టీస్పూన్
చక్కెర - అర కప్పు

చీజ్​ కోసం :

పాలు - లీటర్
వెనిగర్, నీళ్లు - రెండు టేబుల్ స్పూన్ల చొప్పున
మైదా - ఒక టీస్పూన్
నీళ్లు - ఆరు కప్పులు, చక్కెర - ఒకటిన్నర కప్పు
ఐస్ క్యూబ్స్ - సరిపడా

తయారీ : ఒక గిన్నెలో పాలు పోసి.. అందులో బాదం, పిస్తా తరుగు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి. పాలు పసుపు రంగులోకి మారే వరకు కాగబెట్టాలి.

చీజ్​ తయారీ : చీజ్​ కోసం మరో గిన్నెలో పాలు కాగబెట్టాలి. చిన్న గిన్నెలో నీళ్లు, వెనిగర్ పోసి కలపాలి. ఈ నీళ్లను కాగిన పాలలో కలిపితే పాలు విరిగిపోతాయి. ఒక పెద్ద గిన్నెలో జల్లెడ పెట్టి, దానిలో కాటన్ క్లాత్ ఉంచాలి లేదా మస్లిన్​ క్లాత్​లో విరిగిన పాలను పోసి చుక్క నీరు లేకుండా వడకట్టాలి. తర్వాత దాన్ని ఒక ప్లేట్​లో వేసి అరచేత్తో కాసేపు అదిమితే చీజ్​ రెడీ. 

రెడీ అయిన చీజ్​లో మైదా పిండి చల్లి ముద్దగా కలపాలి. పాన్​లో చక్కెర వేసి నీళ్లు పోసి చక్కెర కరిగేవరకు మరిగించాలి. తయారుచేసిన పాల ముద్దను చిన్న ఉండలు చేసి అరచేత్తో అదమాలి. వాటిని చక్కెర నీళ్లలో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత మూతపెట్టి పది నిమిషాలు ఉడికించాలి.

ఒక గిన్నెలో ఐస్​ క్యూబ్స్ వేసి, నీళ్లు పోయాలి. ఉడికిన రసమలైని చల్లటి నీళ్లలో వేయాలి. పది నిమిషాల తర్వాత ఒక్కోటి తీసి నీళ్లు పిండాలి. ముందుగా రెడీ చేసి పెట్టిన పాల మిశ్రమంలో రసమలై వేయాలి. రెండు లేదా మూడు గంటలు ఫ్రిజ్​లో పెట్టాలి. తరువాత తింటే చల్లగా, మెత్తగా, తియ్యగా... భలే ఉంటుంది.

బయోటిన్ లడ్డు 

కావాల్సినవి :

బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, అవిసెలు, పొట్టు తీసిన పల్లీలు, పిస్తా, ఓట్స్, కొబ్బరి పొడి- ఒక్కోటి అర కప్పు చొప్పున
నెయ్యి- ఒక కప్పు
బెల్లం- ఒకటిన్నర కప్పు

తయారీ : పాన్​లో బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, అవిసెలు, పొట్టు తీసిన పల్లీలు వేసి ఐదు నిమిషాలు వేగించాలి. వీటన్నింటినీ మిక్సీజార్​లో వేసి గ్రైండ్ చేయాలి. బెల్లాన్ని  విడి​గా గ్రైండ్ చేసి ఈ మిశ్రమంలో కలపాలి. పిండిలో నెయ్యి వేసి చిన్న  చిన్న లడ్డూల్లా చుట్టాలి.

ఓట్స్ బ్రౌనీ

కావాల్సినవి :

ఓట్స్- అర కప్పు
జీడిపప్పులు- ఐదు
నీళ్లు- పావు కప్పు
కొకొవా పౌడర్- రెండు టేబుల్ స్పూన్లు
వెనీలా ఎసెన్స్- ఒక టీస్పూన్
కర్జూరాలు- రెండు
బేకింగ్ పౌడర్- పావు టీస్పూన్
ఉప్పు- చిటికెడు
అరటి పండు (చిన్నది)- ఒకటి
డార్క్ చాకొలెట్- సరిపడా

తయారీ : ఒక కప్పులో ఓట్స్, జీడిపప్పుల్ని విడివిడిగా పావుగంట నానబెట్టాలి. మిక్సీజార్​లో నానబెట్టిన ఓట్స్, జీడిపప్పులతో పాటు  కొకొవా పౌడర్, వెనీలా ఎసెన్స్, కర్జూర, బేకింగ్ పౌడర్, ఉప్పు, అరటిపండు ముక్కలు వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న గిన్నెల్లోకి తీసుకోవాలి. పైన డార్క్​ చాకొలెట్ ముక్కలు వేసి దానిపై మళ్లీ మిశ్రమాన్ని వేయాలి. మరోసారి డార్క్​ చాకొలెట్ ముక్కలు, సన్నగా తరిగిన జీడిపప్పు చల్లాలి. ఒవెన్​లో 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. చల్లారాక  తింటే టేస్ట్ బాగుంటుంది. ఒవెన్​ లేకపోతే పాన్​లో నీళ్లు పోసి ఒక స్టాండ్ పెట్టాలి. దానిపై బ్రౌనీ మిశ్రమం వేసిన గిన్నెలు పెట్టాలి. పాన్​ మీద మూతపెట్టి ఉడికించాలి. ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఫోర్క్ లేదా టూత్​ పిక్ గుచ్చి చూడాలి. వాటికి పిండి అంటుకోకపోతే బ్రౌనీ రెడీ అన్నట్టే.

ఫ్రూట్ క్రీమ్

కావాల్సినవి :

యాపిల్- ఒకటి 
మామిడి, అరటి పండు- ఒక్కోటి రెండు చొప్పున
స్ట్రాబెర్రీ, దానిమ్మ గింజలు, ద్రాక్షలు- ఒక్కోటి ఒక్కో కప్పు చొప్పున
బొప్పాయి ముక్కలు- రెండు కప్పులు
పాలు - రెండు కప్పులు
పెరుగు - ఒక టేబుల్ స్పూన్
ఫ్రెష్ క్రీమ్ - ఒక కప్పు
చక్కెర పొడి - ఒక టేబుల్ స్పూన్
కండెన్స్​డ్ మిల్క్ - రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - అర టీస్పూన్

తయారీ : పాలు బాగా దగ్గర పడేవరకు కాగబెట్టాలి. యాపిల్, మామిడి, బొప్పాయి, అరటి పండ్లను తొక్క తీసి ముక్కలుగా తరగాలి. ద్రాక్ష, స్ట్రాబెర్రీలను కూడా చిన్న ముక్కలు చేయాలి. వీటన్నింటితోపాటు దానిమ్మ గింజలు కూడా కలిపి ఒక గిన్నెలో వేయాలి. మరో గిన్నెలో ఫ్రెష్ క్రీమ్, పెరుగు వేసి బాగా గిలక్కొట్టాలి. అందులో చక్కెర పొడి, మిల్క్ మెయిడ్ వేసి కలపాలి. కాగబెట్టిన పాలు, యాలకుల పొడి వేసి కలపాలి. ఒక కప్​లో అన్ని ఫ్రూట్స్ వేసి వాటి మీద ఈ క్రీమ్ వేయాలి. ఇలా రెండు లేయర్లు వేసుకుని తింటే బాగుంటుంది.

కివీ- పైనాపిల్ పానీపూరీ

కావాల్సినవి :

కివీ పండ్లు - మూడు
పైనాపిల్ - ఒకటి
కొత్తిమీర, పుదీనా - కొంచెం
పచ్చిమిర్చి - రెండు, బెల్లం - ఒక టేబుల్ స్పూన్
నిమ్మరసం - రెండు టీస్పూన్లు
పానీపూరీ మసాలా - ఒక టీస్పూన్
కశ్మీరీ కారం - అర టీస్పూన్, జీలకర్ర - అర టీస్పూన్
ఉప్పు, నీళ్లు, బూందీ, దానిమ్మ గింజలు, పానీపూరీలు- తగినన్ని

తయారీ : మిక్సీజార్​లో కివీ, పైనాపిల్ తరుగు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, బెల్లం, నిమ్మరసం, కశ్మీరీ కారం, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో ఆ మిశ్రమం వేసి, నీళ్లు పోసి కలపాలి. అందులోనే బూందీ వేసి మళ్లీ ఒకసారి కలపాలి. పానీపూరీకి రంధ్రం చేసి దానిమ్మగింజలు వేసి, కివీ– పైనాపిల్ రసంలో ముంచుకుని తింటే టేస్ట్ సూపర్​ అనాల్సిందే. దీన్ని పైనాపిల్​ ఒక్కదానితో కూడా చేసుకోవచ్చు.