కర్ర పెండలంతో..
కర్ర పెండలం దుంపతో బోలెడు వెరైటీలు చేయొచ్చు. కర్రపెండలంను టాపియోకా లేదా కసావా అని అంటారు. దీన్నుంచి సగ్గుబియ్యం, పిండి తయారుచేసి వంటల్లో వాడతారు. కర్ర పెండలంతో కూరలు, శ్నాక్స్, స్వీట్స్ కూడా చేసుకోవచ్చు.
వాటి తయారీ ఎలాగో చదివి తెలుసుకోండి.
కావాల్సినవి :
కర్ర పెండలం దుంపలు (తాజా) - నాలుగు
ఉప్పు, కారం - ఒక్కో టీస్పూన్ చొప్పున
నూనె - సరిపడా
తయారీ : కర్ర పెండలాన్ని శుభ్రంగా కడిగి, తొక్క తీయాలి. మరోసారి కడిగి ముక్కలు తరగాలి. ఒక్కో ముక్కను ఆలుగడ్డను చిప్స్ కోసం ఎలాగైతే తరుగుతారో అలానే గుండ్రంగా తరగాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో తరిగిన కర్ర పెండలం ముక్కలు వేయాలి. అవి వేగాక ఒక పెద్ద గిన్నెలో వేయాలి. వాటిలో ఉప్పు, కారం వేసి కలపాలి. గాలి చొరబడకుండా ఒక డబ్బాలో వేసి పెడితే వారం పది రోజులు నిల్వ ఉంటాయి. ఎప్పుడు తిన్నా టేస్టీగా ఉంటాయి.
బోండా
కావాల్సినవి :
కర్ర పెండలం - రెండు ; శనగపిండి - ఒక కప్పు
పచ్చిమిర్చి - రెండు ; ఉల్లిగడ్డ - ఒకటి
కొత్తిమీర తరుగు - కొంచెం ; అల్లం తురుము - అర టీస్పూన్
జీలకర్ర - ఒక టీస్పూన్ ; పసుపు - అర టీస్పూన్
ఉప్పు, నూనె - సరిపడా ; కరివేపాకు, కొత్తిమీర - కొంచెం
తయారీ : కర్ర పెండలాన్ని శుభ్రంగా కడిగి, బట్టతో తుడవాలి. తరువాత చెక్కు తీసి, ముక్కలు తరగాలి. వాటిని ఒక గిన్నెలో వేసి, ఉప్పు, పసుపు వేయాలి. తర్వాత నీళ్లు పోసి, మూతపెట్టి ఉడికించాలి. అవి ఉడికాక నీళ్లను వడకట్టి, టాపియోకాలను మరో గిన్నెలో వేసి, వాటిని మెదపాలి. అందులో శనగ పిండి, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, అల్లం తురుము, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత మిశ్రమాన్ని ఉండలు చేయాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఈ ఉండల్ని వేగించాలి. బ్రౌన్ కలర్ వచ్చాక బయటకు తీస్తే తినేందుకు బోండాలు రెడీ.
కూర
కావాల్సినవి :
కర్ర పెండలం దుంపలు - అర కిలో
పసుపు - అర టీస్పూన్ ; కారం - ఒక టీస్పూన్
ఆవాలు, మినప్పప్పు - ఒక్కోటి పావు టీస్పూన్
కొబ్బరి నూనె లేదా నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు, నీళ్లు - సరిపడా ; నూనె - ఒక టీస్పూన్
కరివేపాకు - కొంచెం ; ఎండు మిర్చి - మూడు
కొబ్బరి పొడి - మూడు టేబుల్ స్పూన్లు
తయారీ : కర్ర పెండలం దుంపలు శుభ్రంగా కడిగి తొక్క తీయాలి. ముక్కలు తరిగి నీళ్లలో వేసి మరోసారి కడగాలి. పాన్‌లో నీళ్లు పోసి పసుపు, ఉప్పు, కారం, నూనె, దుంప ముక్కలు కూడా కలపాలి. మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. ఒకసారి మూత తీసి మిశ్రమాన్ని గరిటెతో తిప్పి, మళ్లీ మూతపెట్టాలి. మరో పావుగంట ఉడికించాక వడకట్టాలి. పాన్‌లో కొబ్బరి నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండు మిర్చి తాలింపు వేయాలి. అవి వేగాక ఉడికించిన కర్ర పెండలం దుంప ముక్కల్ని వేయాలి. పైనుంచి కొబ్బరి పొడి వేసి కలపాలి. ఈ రెసిపీని నేరుగా లేదా అన్నంతో కలిపి తినొచ్చు.
స్వీట్
కావాల్సినవి :
కర్ర పెండలం దుంపలు - అర కిలో ; చక్కెర లేదా బెల్లం - ముప్పావు కప్పు
పచ్చి కొబ్బరి తురుము - ఒక కప్పు ; బొంబాయి రవ్వ - రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - ఒక టీస్పూన్
నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
జీడి పప్పులు, ఎండు ద్రాక్ష - ఒక్కోటి ఏడు చొప్పున
తయారీ : కర్ర పెండలం దుంపల్ని శుభ్రంగా కడిగి, తొక్క తీయాలి. తర్వాత మరోసారి వాటిని కడిగి, తురమాలి. అందులో చక్కెర లేదా బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, బొంబాయి రవ్వ, యాలకుల పొడి వేసి కలపాలి. నెయ్యిలో జీడి పప్పులు వేగించాలి. తర్వాత నెయ్యితోపాటు జీడిపప్పుల్ని కూడా అందులో వేసి కలపాలి. వెడల్పాటి ప్లేట్‌కి నెయ్యి పూసి మిశ్రమాన్ని అందులో చక్కగా పరవాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఈ ప్లేట్ అందులో పెట్టి మూత పెట్టాలి. ఇరవై నిమిషాలు ఉడికించాక చాకుతో నచ్చిన షేప్‌లో కట్ చేయాలి.
దోసె
కావాల్సినవి :
కర్ర పెండలం దుంపలు - రెండు
బియ్యం - ఒక కప్పు
పచ్చి శగనపప్పు - పావు కప్పు
ఉల్లిగడ్డ తరుగు, ఉప్పు - సరిపడా
కొత్తిమీర - కొంచెం
ఎండు మిర్చి - నాలుగు
జీలకర్ర - ఒక టీస్పూన్
తయారీ : బియ్యం, పచ్చి శనగపప్పును ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి ఆరుగంటలు నానబెట్టాలి. కర్రపెండలం దుంపల్ని కడిగి, తొక్క తీయాలి. తర్వాత మరోసారి వాటిని శుభ్రంగా కడిగి ముక్కలు తరగాలి. మిక్సీజార్‌లో దుంపలు, నానబెట్టిన బియ్యం, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి, నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పిండిని ఒక గిన్నెలో వేసి, కొన్ని నీళ్లు పోసి కలిపి రెండు మూడు గంటలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత పాన్ వేడి చేసి నూనె పూసి నానబెట్టిన పిండితో దోసెలు వేయాలి. దోసె మీద ఉల్లిగడ్డ తరుగు, కొత్తిమీర చల్లాలి. మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి.
కేక్
కావాల్సినవి :
కర్ర పెండలం (తాజా) - అర కిలో
పాలు - 200 గ్రాములు
చక్కెర - నాలుగు టేబుల్ స్పూన్లు
తయారీ : కర్రపెండలాన్ని శుభ్రంగా కడిగి, తొక్క తీయాలి. ఆపై మళ్లీ కడిగి, వాటిని సన్నగా తురమాలి. ఆ తురుముని చేతులతో పిండి తేమ లేకుండా చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి చక్కెర కలపాలి. ఒక స్టీల్ గిన్నె లేదా కేక్ తయారుచేసే బేకింగ్ మౌల్డ్‌లో చక్కెర వేయాలి. దాన్ని వేడి చేసి కరిగించాలి. ఆ తర్వాత అందులో కర్ర పెండలం మిశ్రమాన్ని వేసి అదమాలి.
పాన్‌లో నీళ్లు పోసి అందులో ఒక స్టాండ్ పెట్టాలి. ఆ స్టాండ్ మీద కేక్ మిశ్రమం ఉంచిన గిన్నెను పెట్టాలి. ఆపై పాన్ మీద మూత పెట్టి ముప్పావుగంట ఓ మాదిరి మంట మీద ఉడికించాలి. తర్వాత వాటిని పక్కకు తీసి, చాకుతో అంచులను వదులు చేయాలి. ప్లేట్లో కేక్‌ను బోర్లించాలి. అంతే.. తియ్యని కేక్ రెడీ.