కిచెన్ తెలంగాణ : క్రిస్మస్​ కేక్స్ & కుకీస్!..ఈ స్పెషల్ ఐటెమ్స్ ఒకసారి ట్రై చేయండి

డిసెంబర్​ అంటే చలి ఎలాగో.. క్రిస్మస్​ అంటే కేక్స్, కుకీస్​..​. గుర్తొస్తాయి ఎవరికైనా. ఈ సీజన్​లో  బేకరీలు, కేఫ్​ల్లోనే కాకుండా వీధి దుకాణాల ముందు కూడా అవి కనిపిస్తుంటాయి. అయితే, చాలామందికి వాటిని ఇంట్లో తయారుచేయాలనే ఆసక్తి ఉంటుంది. కాకపోతే తరచూ చేసుకునే పిండి వంటలు, చిరుతిళ్లలా కాదు కాబట్టి ఆలోచిస్తుంటారు. అలాంటివాళ్లు ఒక్కసారి ఈ స్పెషల్ ఐటెమ్స్​ గురించి తెలుసుకున్నారంటే.. వారానికొకసారి కూడా చేస్తానంటారు. మరింకెందుకాలస్యం... పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వీటిని ఒకసారి ట్రై చేయండి. 

క్యారెట్ కేక్

కావాల్సినవి :

క్యారెట్లు – రెండు
చక్కెర, నూనె, పెరుగు – ఒక్కోటి అరకప్పు చొప్పున
వెన్న – రెండు టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క పొడి, బేకింగ్ సోడా, ఉప్పు – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ – ఒక టీస్పూన్
మైదా – ఒకటింపావు కప్పు

తయారీ : మిక్సీజార్​లో క్యారెట్ ముక్కలు, చక్కెర, నూనె, పెరుగు వేసి మిక్సీ పట్టాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో వెన్న, దాల్చిన చెక్క పొడి, వెనీలా ఎసెన్స్ వేసి కలపాలి. ఒక గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపాలి. తర్వాత అందులో క్యారెట్ తురుము కూడా వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి. తర్వాత ఒవెన్​లో పెట్టి ఉడికించాలి. 

ఓట్ మీల్ కుకీస్

కావాల్సినవి :

అరటి పండ్లు – రెండు
ఆల్మండ్ బటర్ – అర కప్పు (ఆన్​లైన్​లో దొరుకుతుంది)
ఓట్స్ – రెండు కప్పులు
చాకొలెట్ చిప్స్ – ముప్పావు కప్పు
బేకింగ్ సోడా – పావు టీస్పూన్

తయారీ : ఒక గిన్నెలో అరటి పండ్లు వేసి మెత్తగా మెదపాలి. అందులో ఆల్మండ్ బటర్ వేసి కలపాలి. అందులో ఓట్స్, చాకొలెట్ చిప్స్, బేకింగ్ సోడా కూడా వేసి కలపాలి. ఒక ట్రేలో బటర్ పేపర్ పెట్టి దానిపై ఈ మిశ్రమాన్ని స్పూన్​తో కుకీస్​లా వేయాలి. ఆ తర్వాత ఆ ట్రేని ఒవెన్​లో పెట్టి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు 180 డిగ్రీ సెల్సియస్​ టెంపరేచర్​లో  ఉడికించాలి. వాటిని చల్లారాక తింటే టేస్ట్ బాగుంటాయి. సింపుల్​గా చేసుకునే  ఈ కుకీస్​ హెల్దీ కూడా. 

గోవాన్ బాత్

కావాల్సినవి :

కోడిగుడ్లు – ఐదు
వెన్న, చక్కెర, బొంబాయి రవ్వ – ఒక్కో కప్పు చొప్పున
కొబ్బరి తురుము – రెండు కప్పులు
దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
వెనీలా ఎసెన్స్ – రెండు టీస్పూన్లు
బేకింగ్ పౌడర్ – ఒక టీస్పూన్

తయారీ : ఒక గిన్నెలో కోడిగుడ్లు, వెన్న, చక్కెర వేసి బాగా కలపాలి. మిక్సీజార్​లో ఈ మిశ్రమంతోపాటు కొబ్బరి తురుము కూడా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అందులో బొంబాయి రవ్వ వేసి కలపాలి. యాలుకల పొడి, జాజికాయ పొడి, వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. మూతపెట్టి ఎనిమిది గంటలపాటు పక్కన ఉంచాలి. తర్వాత ఒవెన్​లో పెట్టి ఉడికిస్తే సరి. 

నోట్​ : ఒకవేళ ఒవెన్​ లేకపోతే పాన్​లో ఉప్పు వేడి చేసి, మధ్యలో ఒక స్టాండ్ పెట్టి దానిపై కుకీస్ లేదా కేక్​ ఉన్న ప్లేట్/ గిన్నె​ని ఉంచి, మూతపెట్టాలి. 20 నుంచి 40 నిమిషాల వరకు ఉడికించాల్సి ఉంటుంది. మధ్యమధ్యలో మూత తీసి అవి ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి.