కిర్లోస్కర్ బ్రదర్స్.. ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియకపోయినా.. ఈ కంపెనీ తయారుచేసే యంత్రాల వల్ల దేశంలోని మెజారిటీ జనాభా ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతోంది. ఈ కంపెనీ తయారుచేసేది ఇంజనీరింగ్ టూల్స్, మెషిన్లు. ఆ యంత్రాలే మన దేశ జనాభాలో 35 శాతం కంటే ఎక్కువ మందికి తాగునీరు అందిస్తున్నాయి. 60 శాతం కంటే ఎక్కువ భూమికి సాగు నీటిని పంపింగ్ చేస్తున్నాయి. నదుల అనుసంధానం, లిఫ్టింగ్, నీటి శుద్ధి, పారుదల ప్రాజెక్టుల్లో కూడా వీటినే వాడుతున్నారు.
కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ కంపెనీని1888లో స్థాపించారు. భారతదేశంలో అతిపెద్ద పంప్ అండ్ వాల్వ్ తయారుచేసే కంపెనీ ఇది. కిర్లోస్కర్ గ్రూప్ స్వదేశీ అరిహంత్ న్యూక్లియర్ సబ్‌మెరైన్ ప్రోగ్రామ్‌కు కాంపోనెంట్ సప్లయర్. కంపెనీ మెయిన్ ఆఫీస్ మహారాష్ట్రలోని పుణేలో ఉంది. మన దేశంలోనే కాదు.. చాలా దేశాల్లో ఈ కంపెనీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి పేరు తెచ్చుకున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఒక సంఘటన గురించి చెప్పుకోవాలి. ఈ కంపెనీ ఒకప్పటి మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కిర్లోస్కర్ 1990లో కైరో వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో చెక్–ఇన్ అయ్యేటప్పుడు రిసెప్షనిస్ట్ అతన్ని పేరు అడిగింది. సంజయ్ తన పూర్తి పేరు ‘సంజయ్ కిర్లోస్కర్’ అని చెప్పాడు. ఆ పేరు విని రిసెప్షనిస్ట్ షాక్ అయ్యింది.
మీ పేరు నిజంగా ఇదేనా?” అని అడిగింది. సంజయ్ ‘‘అవును” అన్నాడు.
‘‘నిజం చెప్పండి?” అని మళ్లీ అడుగుతూ.. నవ్వుతూనే ఉందామె. సంజయ్‌కి అలా ఎందుకు అడుగుతుందో? ఎందుకు నవ్వుతుందో? అర్థం కాలేదు. అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోయాడు. తర్వాత ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే.. ఈజిప్ట్‌లో కిర్లోస్కర్ కంపెనీ పంపులు చాలా ఫేమస్. అది ఎంతలా అంటే.. పంపుని అక్కడివాళ్లంతా కిర్లోస్కర్ అని పిలుస్తుంటారు. ఆ కంపెనీ ప్రొడక్ట్స్‌కి విదేశాల్లో అంతలా గుర్తింపు ఉంది.
సైకిళ్లతో మొదలై..
ఈ కంపెనీని స్థాపించింది లక్ష్మణ్‌రావు కిర్లోస్కర్. ఆయన ఒకప్పటి బొంబాయి ప్రెసిడెన్సీలోని బెల్గాం జిల్లాలోని గుర్లహోసూర్ అనే గ్రామంలో పుట్టాడు. అతను మహారాష్ట్ర కర్హడే బ్రాహ్మణుడు. తండ్రి కాశీనాథ్ పంత్ వేదాంత్ -పండిట్. అందుకే లక్ష్మణ్‌రావు కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచి పండిట్ కావాలని కుటుంబ సభ్యులు కోరుకున్నారు. కానీ.. ఆయన మాత్రం సంప్రదాయాలకు దూరంగా ఉండేవాడు. ఇంజినీరింగ్, టెక్నాలజీ, పెయింటింగ్ మీద ఇష్టం ఉండేది. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా అతని అన్న రామున్న కిర్లోస్కర్ సాయంతో 1885లో బొంబాయిలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరాడు లక్ష్మణరావు. రెండేండ్ల తర్వాత పెయింటింగ్‌ని విడిచిపెట్టి, మెకానికల్ డ్రాయింగ్ నేర్చుకున్నాడు.
తర్వాత విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో మెకానికల్ డ్రాయింగ్ అసిస్టెంట్ టీచర్‌గా నెలకు 45 రూపాయల జీతానికి చేరాడు. ఆ తర్వాత అక్కడ ప్రమోషన్‌లు రాకపోవడంతో సొంతంగా బిజినెస్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అలా 1988లో మొదట్లో సైకిల్ డీలర్‌షిప్ తీసుకున్నాడు. బొంబాయిలో సైకిళ్లను కొని వాటిని బెల్గాంలోని తన అన్న రామున్నకు పంపేవాడు. రామున్న ఒక్కో సైకిల్‌ని 700 నుండి 1000 రూపాయల వరకు అమ్మేవాడు. అంతేకాదు.. ఇప్పుడు కార్లు నడపడం నేర్పుతున్నట్టు అప్పట్లో కొందరు సైకిల్ తొక్కడం నేర్పేవాళ్లు. రామున్న కూడా 15 రూపాయలు తీసుకుని సైకిల్ తొక్కడం నేర్పేవాడు. ఈ బిజినెస్ నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది.
నాగళ్లు..
సైకిళ్ల బిజినెస్‌లో లాభాలు రావడంతో బిజినెస్ విస్తరించాలని డిసైడ్ అయ్యాడు లక్ష్మణరావు. దాంతో వ్యవసాయ పనిముట్ల తయారీ మొదలుపెట్టాలి అనుకున్నాడు. కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ పేరుతో చిన్న కంపెనీ పెట్టాడు. తర్వాత1902లో చాఫ్ కట్టర్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇనుప నాగలిని తయారుచేయడం మొదలుపెట్టారు. కానీ.. అప్పట్లో అందరూ చెక్క నాగళ్లనే వాడేవాళ్లు. పైగా ఇనుప నాగళ్లు వాడితే భూమి విషపూరితంగా మారుతుందని చాలామంది నమ్మేవాళ్లు. దాంతో నాగళ్లకు డిమాండ్ ఉండేది కాదు. కానీ.. రైతుల్లో అవగాహన పెరగడానికి పెద్దగా టైం పట్టలేదు. రెండేండ్లలోనే ఇనుప నాగళ్లను వాడడం మొదలుపెట్టారు. కంపెనీ సేల్స్ బాగా పెరిగాయి.
ఆ తర్వాత ఔంధ్ పాలకుడు రాజా బాలాసాహెబ్ పంత్ దగ్గర 17,000 రూపాయలు అప్పుగా తీసుకుని1910లో పెద్ద ఫ్యాక్టరీ మొదలుపెట్టాడు. అందుకోసం 32 ఎకరాల బంజరు భూమిని 25 మంది కూలీలతో చదును చేయించాడు. పాములు, పురుగులు తిరిగే పనికిరాని ప్లేస్‌లో ఏకంగా ఓ గ్రామాన్నే ఏర్పాటుచేశాడు. ఇప్పటికీ ఆ గ్రామం ఉంది. దాన్ని ఇప్పుడు ‘కిర్లోస్కర్ వాడి’గా పిలుస్తున్నారు. ఇది దేశంలోని మొదటి ఫ్యాక్టరీ విలేజ్‌ల్లో ఒకటి. అలా మొదలైన కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ ప్రయాణం.. ఇప్పటికీ సాగుతూనే ఉంది. మన దేశంలో మెషినరీ రంగంలో విశేషమైన సేవ చేసినందుకు లక్ష్మణ్‌రావు పేరుతో ఒక పోస్టల్ స్టాంప్ కూడా ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది.
యుద్ధం ఎఫెక్ట్
కంపెనీ మొదలు పెట్టాక చాలా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం (1914 –1918) ఎఫెక్ట్ చాలా పడింది. కంపెనీకి వచ్చే ముడి సరుకు చాలావరకు ఆగిపోయింది. ఈసారి ఆగ్నేయ మహారాష్ట్రలోని షోలాపూర్ మహారాజు లక్ష్మణ్‌రావుకు సాయం చేశాడు. రాజు దగ్గర ఉన్న చాలా ఫిరంగులను ఆయనకు అమ్మాడు. వాటిని కరిగించి ఆ ఇనుమును వస్తువులుగా తయారు చేయడానికి వాడుకున్నాడు.
రెండో ప్రపంచ యుద్ధం (1939 –1945) టైంలో బ్రిటిష్ వాళ్లు కిర్లోస్కర్‌ని ఆయుధాలు తయారు చేయమని అడిగారు. కానీ.. లక్ష్మణ్‌రావు అందుకు ఒప్పుకోలేదు. అందుకుబదులుగా ఆయుధాల కోసం ఉపయోగించే యంత్ర పరికరాలను తయారుచేశాడు. అలా యంత్ర పరికరాల తయారీ విభాగంలోకి కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అదే మెయిన్ బిజినెస్ అయ్యింది.
ఎదురు దెబ్బ
వ్యాపారం బాగానే సాగుతుంది అనుకున్నప్పుడు1947లో ఒక ఎదురుదెబ్బ తగిలింది. అప్పట్లో కంపెనీ చెరుకు క్రషింగ్ మెషిన్లను తయారుచేసేది. అయితే.. అవి పదే పదే రిపేర్ అవుతుండడంతో దాన్ని కొన్నవాళ్లు నష్టపోకూడదు అని వాటిని కంపెనీ వెనక్కి తీసుకుంది. దాని లోపానికి పూర్తి బాధ్యత వహించింది. అప్పుడు కంపెనీకి చాలా నష్టాలు వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా...
కిర్లోస్కర్ గ్రూప్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు చేస్తూ.. పంపులకు పర్యాయపదంగా మారింది. ఫ్లూయిడ్ పంపింగ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది. ఎలక్ట్రిసిటీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ, భవన నిర్మాణ రంగం, నీటిపారుదల, సముద్ర, సేఫ్టీ.. ఇలా ఎమినిదికిపైగా రంగాల్లో వాడే అనేక రకాల యంత్రాలను తయారుచేస్తోంది.165 కంటే ఎక్కువ దేశాల్లో ఈ కంపెనీ తయారుచేసిన యంత్రాలను వాడుతున్నారు. ముఖ్యంగా బ్రిటన్‌లో వాటర్ పంపింగ్ మార్కెట్‌లో 80 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. సిడ్నీ ఒపెరా హౌస్, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, లండన్, ఈజిప్ట్‌లోని అనేక ఇతర గ్లోబల్ ఐకానిక్ బిల్డింగ్స్‌లో కిర్లోస్కర్ పంపులను వాడారు.
అతిపెద్ద పంపింగ్..
గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ దగ్గర మూడు కోట్ల మందికి పైగా భారతీయులకు తాగునీటిని అందించే అతిపెద్ద పంపింగ్ స్కీమ్‌ను మొదలుపెట్టింది గవర్నమెంట్. ఇందులో కూడా కిర్లోస్కర్ యంత్రాలను వాడారు. న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రోగ్రామ్‌లో ప్రోటోటైప్ రియాక్టర్‌ను చల్లబరచడానికి కిర్లోస్కర్ పంపులనే వాడుతున్నారు.
టెక్నాలజీ
కంపెనీలో టెక్నాలజీని ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం పంపుల తయారీలో అతిపెద్ద 3డీ ప్రింటర్లను వాడుతున్నారు. ప్రొడక్షన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని కూడా వాడుతున్నారు. కంపెనీలో ఐఓటీతో పనిచేపే మెషిన్లు కూడా ఇన్‌స్టాల్ చేశారు. టెక్నీషియన్స్, ఫీల్డ్ సర్వీస్ ఇంజనీర్ల కోసం వర్చువల్ రియాలిటీని తీసుకొచ్చారు. హ్యాండ్- ఆన్ సర్వీస్ కోసం ఆగ్మెంటెడ్ రియాలిటీని వాడుతున్నారు.
అంచెలంచెలుగా..
పాతిక మంది కార్మికులతో ప్రారంభమైన కంపెనీలో ఇప్పుడు వేల మంది పనిచేస్తున్నారు. వ్యాపారం ఎన్నో దేశాలకు విస్తరించింది. అనేక రకాల పంపులు, మోటార్లు, ఆయిల్ ఇంజిన్లు, ఎలక్ట్రిక్ మోటార్లు, టర్బెయిన్, జనరేటర్ సెట్లు తయారుచేస్తోంది. కంపెనీ ప్రయాణం..
1888: కిర్లోస్కర్ కంపెనీ మొదలు
1914: మొదటి ప్రపంచ యుద్ధం ఎఫెక్ట్.. నష్టాలు.
1940: భారతదేశపు మొట్టమొదటి లాత్ మెషిన్ తయారు
1958: కిర్లోస్కర్ నుంచి ఎక్స్‌పోర్ట్స్ మొదలయ్యాయి.
1969: కౌలాలంపూర్‌లో మరో ఫ్యాక్టరీ మొదలైంది. కిర్లోస్కర్ వాడిలో చేతి పంపు అసెంబ్లింగ్ మొదలైంది.
1973: ఐరోపాకు పెద్ద ఎత్తున పంపుల ఎగుమతి మొదలైంది.
2003: కిర్లోస్కర్ బ్రదర్స్ లండన్‌కు చెందిన ‘ఎస్‌పీపీ పంప్’ కంపెనీని కొనేసింది.
2007: సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ పంపింగ్ పథకంలో కిర్లోస్కర్ పంపులను వాడారు.