Kids Special : చిన్న పిల్లల్ని ఇలా నవ్వించండి.. యాక్టివ్ గా ఉంటారు.. పువ్వల్లే.. నవ్వుల్ నవ్వుల్..!

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు నవ్వుతూ ఉండాలనే కోరుకుంటారు. పుట్టినప్పటి నుంచి ప్రతిక్షణం వాళ్లను నవ్వించడమే పనిగా పెట్టుకుంటారు కూడా. పిల్లలు బోసినోటితో నవ్వుతుంటే... ప్రపంచాన్నే జయించినట్టుగా ఆనందపడతారు. అలాంటి పిల్లలు కొద్దిగా ఏడ్చినా తట్టుకోలేరు. మరి పసిపిల్లలు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలంటే... తల్లిదండ్రులు ఏం చేయాలి?

  • పిల్లలు కాస్తంత డల్ గా  కనిపించినా... వాళ్లను ఎత్తుకుని బయటికి తీసుకెళ్లాలి. పార్క్ లాంటివి అయితే బెటర్. వాళ్ల కదలికలను పెద్దవాళ్లు అనుకరించాలి. అలా చేస్తుంటే పిల్లలు భలేగా నవ్వుతారు.. మళ్లీ మళ్లీ అలాగే చేయాలని కూడా కోరుకుంటారు. అనుకరించక ముందే నవ్వేస్తుంటారు. 
  • పిల్లలకు డైపర్లు మారుస్తున్నా, పాలు తాగిస్తున్నా, స్నానం చేయిస్తున్నా... వాళ్లను ఏదో ఒకవిధంగా నవ్వించడానికి ప్రయత్నించాలి. పిల్లల్లో చాలామంది పొట్ట మీద నొక్కుతుంటే నవ్వ తారు. అంతేకాదు, చెవులు, ముక్కు, మెడ వంటి వాటిపై గిలిగింతలు పెట్టినా నవ్వును ఆపుకోలేరు.
  • ముదరురంగుల్లో ఉన్న ఏ వస్తువైనా పిల్లలను ఆకట్టుకుంటుంది. అందుకే రంగు రంగుల బొమ్మలతో పిల్లలను ఆడించాలి. ముఖ్యంగా మ్యూజిక్ వచ్చే బొమ్మలను వాళ్లు బాగా ఇష్టపడతారు. అది సౌండ్ చేస్తున్న కొద్దీ బాగా నవ్వుతారు.
  • పిల్లల ముందు ఇంట్లో పెద్దలు కోపంగా అరవడం వంటివి చేయకూడదు. వాళ్లతో లేదా ఇతరులతో నవ్వుతూనే మాట్లాడాలి. పిల్లలను ఎత్తుకున్న ప్రతిసారీ పెద్దల పెదవులపై చిరునవ్వు ఉంటేనే... పిల్లలూ నవ్వుతారు. వాళ్లను ఎత్తుకుని మనం గట్టి గట్టిగా నవ్వితే తిరిగి వాళ్లూ నవ్వుతారు.
  • మసాజ్ చేసేటప్పుడు పిల్లల కాళ్లు, చేతులు స్ట్రెచ్ చేసినా కిలకిలా నవ్వుతారు. రెండు కాళ్లను పట్టుకుని చాతీ వరకు తీసు కెళ్తుంటే ఎంజాయ్ చేస్తారు. అలాగే రెండు చేతులను బాగా చాపి, క్రాస్ గా పొట్ట దగ్గరకు తీసుకురావడం లాంటివి చేసినా నవ్వుతారు.

-వెలుగు, లైఫ్-