చూడ్డానికి పదేళ్ల చిన్నారి. కానీ.. ప్రపంచమంత అభిమానాన్ని సంపాదించుకుంది. ఎప్పుడూ చలాకీగా ఉంటుంది. అన్నతో కలిసి అల్లరి చేస్తుంటుంది.ఆ అల్లరి వల్లే ఆమె యూట్యూబ్‌లో స్టార్ కిడ్ అయ్యింది. ఇంత చిన్న వయసులోనే కోట్ల మంది ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంది డయాన. ఉక్రెయిన్‌కు చెందిన డయాన చేసే వీడియోలను యూట్యూబ్‌లో కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. అందుకే స్కూలుకు వెళ్లే వయసులోనే మిలియన్ల కొద్దీ డబ్బు సంపాదిస్తోంది.
పిల్లలు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎవరితో ఎలా మసలుకోవాలి?... ఇలాంటి అవేర్నెస్ కంటెంట్‌ని తన ఏజ్ వాళ్లకు అర్థమయ్యేలా చేస్తుంది. అన్న రోమాతో కలిసి అల్లరి చేస్తూనే తప్పులు చేయొద్దని పిల్లలకు మెసేజ్ ఇస్తుంది. అలాంటి కంటెంట్ చేయడం వల్ల తల్లిదండ్రులే తమ పిల్లలకు డయాన వీడియోలను చూపిస్తున్నారు. డయాన, రోమాల తల్లిదండ్రులు ఒలెనా, వొలోడిమిర్ కిడిస్యుక్. వొలోడిమిర్ ఐటీ ప్రోగ్రామర్‌గా పనిచేసేవాడు. ఒలెనా ఓ నిర్మాణ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేసేది. వాళ్లది ఉక్రెయిన్‌లోని కీవ్ సిటీ. సోషల్ మీడియాలో బాగా ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ల కుటుంబం ఫ్లోరిడాకు వెళ్లింది. కానీ.. అమెరికాలో ఉండడం వల్ల తమ బంధువులు, ఫ్రెండ్స్ కోసం పదే పదే ఉక్రెయిన్‌కు వెళ్లి రావడం ఇబ్బందిగా ఉందని దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యారు. పైగా అక్కడ షూటింగ్ చేయడానికి చాలా ప్లేస్‌లు ఉండడంతో దుబాయ్‌ని ఎంచుకున్నారు.
కిడ్స్ డయాన షో
ఒలెనా, వొలోడిమిర్కు 2012 అక్టోబర్ 22న రోమా, 2014 మార్చి 31న డయాన పుట్టారు. డయానా పుట్టాక ఒలేనా, వొలోడిమిర్ సరదాగా ఆమె వీడియోలు తీయడం మొదలుపెట్టారు. తర్వాత అది అలవాటుగా మారింది. దాంతో ఆ వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయాలనే ఆలోచన వచ్చింది. చివరకు 2015లో ‘ కిడ్స్ డయాన షో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టారు. అదే సంవత్సరం మొదటి వీడియోని అప్లోడ్ చేశారు. అందులో డయాన మాత్రమే కనిపించింది. ప్రామ్‌లో కూర్చొని ఒక ఆకుతో ఆడుకుంది. అయితే.. వొలోడిమిర్ ఛానెల్ పెట్టినప్పుడు అది తన ఫ్రెండ్స్, బంధువులకు రీచ్ అయితే చాలు అనుకున్నాడు. కానీ.. అనుకోకుండా తక్కువ టైంలోనే ఛానెల్‌కు మంచి పేరొచ్చింది.
మిలియన్ సబ్‌స్క్రయిబర్స్
ఛానెల్ పెట్టిన ఏడాదిలోనే 2016లో కిడ్స్ డయాన షో సబ్స్క్రయిబర్ల సంఖ్య మిలియన్‌కు పెరిగింది. దాంతో.. ఒలెనా, వొలోడిమిర్ ఉద్యోగాలు వదిలేసి యూట్యూబ్ కోసమే పనిచేయాలని నిర్ణయించుకున్నారు. వీడియోల కాన్సెప్ట్‌లు, డయాన, రోమాల అల్లరి వల్ల ప్రపంచం నలుమూలల నుంచి వ్యూస్ పెరిగాయి. అప్పటివరకు ఉక్రెనియన్ లాంగ్వేజ్‌లో వీడియోలు చేసేవాళ్లు. కానీ.. అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో 2018లో ఇంగ్లీష్‌లో చేయడం మొదలుపెట్టారు. అప్పటినుంచి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మూడు నెలల్లోనే సబ్స్క్రయిబర్ల సంఖ్య 10 మిలియన్ల నుండి 15 మిలియన్లకు పెరిగింది. అప్పుడే బ్రాండ్ ప్రమోషన్లు కూడా పెరిగాయి.
బిలియన్ల వ్యూస్..
కిడ్స్ డయాన షో ఛానెల్ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందింది. అందుకే ఛానెల్లోని రెండు వీడియోలకు ఏకంగా 2 బిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు.. ఛానెల్లో 100 మిలియన్ల వ్యూస్ దాటిన వీడియోలు బోలెడు ఉన్నాయి. డయానకు చాలా దేశాల్లో ఫేమ్ రావడంతో ఆమె వీడియోలను 20కి పైగా భాషల్లో డబ్ చేస్తున్నారు. ఆ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఆమె ఛానెళ్లకు 200+ మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్లు, 100+ బిలియన్ల వ్యూస్ వచ్చాయి. ప్రతి నెలా సగటున 10 బిలియన్ వ్యూస్ వస్తున్నాయి. అంతేకాదు.. ఈ ఏడు ఆగస్ట్‌లో మెయిన్ ఛానెల్100 మిలియన్ల సబ్స్క్రిప్షన్ మార్క్‌ని దాటి వరల్డ్‌లోని టాప్ పది ఛానెళ్ల లిస్ట్‌లో చేరింది.
పిల్లలకు సమస్యే
ఛానెల్ వల్ల పిల్లలకు ఫేమ్ రావడంతోపాటు రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటర్నెట్ సెలబ్రిటీలుగా మారడంతో వాళ్లకు ఉన్న ఫాలోయింగ్ వల్ల అందరిలా బయట తిరగడం, పిల్లలతో కలిసి ఆడుకోవడం వీలుపడదు. దానివల్ల వాళ్ల మానసిక ఆరోగ్యం మీద కాస్త ఎఫెక్ట్ పడుతుంది. కానీ.. అలాంటి సమస్యలను అధిగమించి డయాన, రోమా వీడియోలు చేస్తున్నారు. వాళ్లకు సెక్యూరిటీ కల్పించడం కూడా ఫ్యామిలీకి పెద్ద సమస్యగా మారింది. అందుకే తమ పిల్లలు ఎప్పుడు ‘నో’ చెప్తే అప్పుడు వీడియోలు తీయడం ఆపేస్తామని వొలోడిమైర్ అంటున్నాడు.
20కి పైగా ఛానెళ్లు
ఇప్పుడు మొత్తం 20 భాషల్లో 20కి పైగా ఛానెళ్లు నడుపుతున్నారు. డయానతోపాటు వాళ్ల అన్న రోమాకు కూడా కిడ్స్ రోమా పేరుతో ఒక ఛానెల్ ఉంది. వాళ్లు నడుపుతున్న ఛానెళ్లలో కొన్ని..
ఛానెల్ పేరు సబ్స్క్రయిబర్ల సంఖ్య
(మిలియన్లలో)
కిడ్స్ డయాన షో 128
కిడ్స్ రోమా షో 38.7
డయాన అండ్ రోమా ఈఎస్పీ 37.9
డయాన అండ్ రోమా ఏఆర్ఏ 29
డయాన అండ్ రోమా హెచ్ఐఎన్ 28
డయాన అండ్ రోమా ఈఎన్ 27.5
డయాన అండ్ రోమా ఐఎన్డీ 15.8
డయాన అండ్ రోమా పీఆర్టీ 12.7