ఖమ్మం జిల్లాలో వరద నష్టం రూ.340 కోట్లు

  • ఖమ్మంలో అంచనాలు రూపొందించిన అధికారులు     
  •    రోడ్ల డ్యామేజీతో అత్యధికంగా నష్టం

ఖమ్మం, వెలుగు: ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లాలో జరిగిన నష్టంపై అధికారులు లెక్కతేల్చారు. ఆదివారం వరకు చేసిన అంచనాల ప్రకారం జిల్లాలో రూ.339.46 కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదించారు. అత్యధికంగా ఆర్​ అండ్​ బీ, పంచాయతీ రాజ్ ​రోడ్లకు రూ.180 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తేల్చారు. ఆ తర్వాత అత్యధికంగా రూ.111 కోట్ల మేర పంట నష్టం జరిగిందని లెక్కతేల్చారు.

రెవెన్యూ శాఖ (హౌజింగ్) కు రూ.30 లక్షలు, పశుసంవర్థక శాఖకు రూ.1.16 కోట్లు, ప్రభుత్వ పాఠశాలలకు రూ.1.20 కోట్లు, ఆరోగ్య శాఖకు రూ.30 లక్షలు, విద్యుత్​ శాఖకు రూ. 7.73 కోట్లు, ఫిషరీస్​ డిపార్ట్ మెంట్ లో రూ.4.29 కోట్ల నష్టం వాటిల్లిందని జిల్లా అధికారులు నివేదికలు రూపొందించారు. జిల్లాలో ఆరుగురు చనిపోగా వారికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్ గ్రేషియాను కుటుంబ సభ్యులకు అందించారు. కూసుమంచి, కారేపల్లి మండలాల్లో ఇద్దరు చొప్పున చనిపోగా, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఒకరు వరదల కారణంగా మృతిచెందారు.

నష్టం వివరాలు ఇలా.

పంట నష్టానికి సంబంధించి మొత్తం 53,528 మంది రైతులు 79,914 ఎకరాల్లో పంట నష్టపోయారని అధికారులు తేల్చారు. ఇందులో అత్యధికంగా 30,460 మంది రైతులు 41,450 ఎకరాల్లో వరి పంటను నష్టపోయారు. 18,375 మంది రైతులు 31,110 ఎకరాల్లో పత్తి, 4,017 మంది రైతులు 5,942 ఎకరాల్లో మిర్చి పంటను నష్టపోయారు. పెసలు 421 మంది రైతులు 1,075 ఎకరాల్లో, 156 మంది రైతులు కూరగాయల పంటలను 132 ఎకరాల్లో నష్టపోయారు. 

180 చెరువులు అలుగు పోయడం వల్ల 4.29 కోట్ల నష్టం వాటిల్లింది. 

52,648 పశువులు చనిపోగా 1.16 కోట్ల నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా 52,153 కోళ్లు చనిపోయాయని లెక్కలేశారు. 

75.77 కిలోమీటర్ల మేర ఆర్​ అండ్​ బీ, పంచాయతీరాజ్​ రోడ్లు డ్యామేజీ కాగా, 82.76 మీటర్ల మేర రోడ్లకు గండ్లు పడ్డాయి. 62 చోట్ల కల్వర్టులు, బ్రిడ్జిలు డ్యామేజీ అయ్యాయి. 

జిల్లాలో మొత్తం 15,055 పక్కా ఇండ్లు, పశువుల కొట్టాలు డ్యామేజీ అయ్యాయని గుర్తించారు. మరో 146 గుడిసెలు డ్యామేజీ అయ్యాయని తేల్చారు. పూర్తిగా కూలిపోయిన, ధ్వంసం అయిన ఇండ్లకు సంబంధించిన సర్వే కొనసాగుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.