సర్వే పల్లెల్లో స్పీడ్.. ఖమ్మంలో స్లో!

  • కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే
  • కార్పొరేషన్​లో హౌస్​ లిస్టింగ్ సగం కూడా కాలే..

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా జరుగుతున్నా.. నగరంలో మాత్రం స్లో గా సాగుతోంది. ఖమ్మం కార్పొరేషన్​లో తప్పించి మున్సిపాలిటీలు, మిగిలిన మండలాల్లో 100 శాతం హౌస్​ హోల్డ్ లిస్టింగ్ పూర్తి చేశారు. ఇంటింటికీ స్టిక్కర్లను అంటించి, ఇంటి నంబర్, ఇంటి యజమాని పేరును దానిపై రాశారు. 

దాని తర్వాత రెండో దశలో ఇంట్లోని కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం సర్వే ప్రాసెస్​ నెమ్మదిగా సాగుతోంది. ఇంత వరకు హౌస్​ హోల్డ్ లిస్టింగ్ ప్రాసెస్​ సగం కూడా పూర్తి కాలేదు. ఖమ్మం నగరంలోని 1,68,875 ఇండ్లకు గాను ఆదివారం సాయంత్రం వరకు కేవలం 70వేల ఇండ్లకు మాత్రమే హౌస్ లిస్టింగ్ పూర్తయినట్టు సమాచారం. 

21 మండలాల్లో 5,71,240 ఇండ్లు..

జిల్లాలో మొత్తం 21 మండలాల్లో 5,71,240 ఇండ్లున్నాయని లెక్కతేలింది. ఇందులో అత్యధికంగా ఖమ్మం అర్బన్ మండలంలో 1,68,875 ఇండ్లున్నాయి. సర్వే సులభతరంగా ఉండేందుకు గాను జిల్లాను మొత్తం 3,654 ఎన్యుమరేటర్ బ్లాక్ లుగా విభజించారు. ఇందులో ఇప్పటి వరకు 3,150 బ్లాక్ లలో సర్వే ప్రారంభం అయింది. ఖమ్మం నగరంలో మొత్తం 965 ఎన్యుమరేటర్ బ్లాక్ లుగా గుర్తించి సర్వే ప్రారంభించారు. ఇంతవరకు మొదటి దశ ఇండ్ల లిస్టింగ్ పూర్తి కాకపోవడంతో, రెండో దశ ఇంకా ప్రారంభం కాలేదు.

 జిల్లాలో 3,810 మంది ఎన్యుమరేటర్లు, 317 మంది సూపర్ వైజర్లు సర్వేలో పాల్గొంటున్నారు. జిల్లాలో మొత్తం 5,71,240 ఇండ్లకు గాను, రూరల్ ప్రాంతంలో 3,71,238 ఇండ్లు ఉండగా, అర్బన్ ప్రాంతంలో 2,00,002 ఇండ్లున్నాయి. ఆదివారం సాయంత్రం వరకు రూరల్ ప్రాంతంలో 28,035, అర్బన్ ప్రాంతాల్లో 2,581 ఇండ్లలో కలిపి మొత్తం 30,616 ఇండ్లలో మాత్రమే సర్వే ప్రక్రియ పూర్తి అయింది. మొత్తం ఇండ్లలో ఇది కేవలం 5.36 శాతం మాత్రమే. అత్యధికంగా కొణిజర్ల మండలంలో 14.48 శాతం, కామేపల్లి మండలంలో 14.22, కారేపల్లి మండలంలో 12.29, బోనకల్ లో 9.13, సత్తుపల్లిలో 8.78, కూసుమంచిలో 8.71, వైరాలో 8.25, తిరుమలాయపాలెంలో 8.08 శాతం సర్వే పూర్తయింది. 

 150 ఇండ్లకు ఒక ఎన్యుమరేటర్..

జిల్లాలో 150 ఇండ్లకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున విభజించి బాధ్యతలు అప్పగించారు. 75 ప్రశ్నలు ఉండడంతో ఒక్కో ఇంటికి 30 నిమిషాల సమయం కేటాయించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు, కానీ ఒక్కో ఇంటికి 45 నిమిషాలు పడుతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, భూమి పాస్ బుక్, ఇతర ఆర్థిక వివరాలు అడుగుతున్న సమయంలో ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. సర్వే పూర్తయిన తర్వాత వివరాలను ఎంపీడీవో కార్యాలయంలో ఆన్ లైన్ లో నమోదు చేయనున్నారు. ఇందుకోసం ప్రతీ మండలానికి 10 మంది చొప్పున డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వీరి పనిని స్టాటిస్టికల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 25వరకు సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

సందేహాలను తీరుస్తూ సర్వే చేస్తున్నాం

సర్వే పట్ల ప్రజలకు ఉన్న అపోహలను తొలగిస్తూ, వారికి అవగాహన కల్పిస్తూ సర్వే చేస్తున్నాం. ఈ సర్వే కారణంగా ఎటువంటి ప్రభుత్వ పథకాలు కట్ కావని ప్రజలకు తెలియజేయాలని సిబ్బందికి చెప్పాం. సర్వే సంబంధిత వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, ప్రజలు ఈ సర్వేలో పాల్గొనడానికి ప్రోత్సహిస్తూ అవగాహన కల్పించాలని సూచించాం.

 ఆయా గ్రామాలు, కాలనీల్లో సర్వే జరిగే సమయం ప్రజలకు ముందుగానే తెలిసేలా ప్రచారం చేయాలని చెప్పాం. సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు తప్పులు లేకుండా ఆన్ లైన్ లో నమోదు చేయిస్తున్నాం. - ముజామ్మిల్ ఖాన్, ఖమ్మం కలెక్టర్