3 లక్షల లీటర్ల కెపాసిటీతో ఇందిరా డెయిరీ యాక్షన్​ ప్లాన్​

  •     పాడి గేదెల కొనుగోలుకు కార్పొరేషన్ల ద్వారా రుణం
  •     ఖమ్మం  కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
  •     ఇందిరా డెయిరీపై అధికారులతో సమీక్ష 

ఖమ్మం టౌన్, వెలుగు : మూడు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా ఇందిరా డెయిరీ విస్తరణ యాక్షన్​ ప్లాన్​ రెడీ చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్​లో స్థానిక సంస్థల అడిషనల్​కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఇందిరా డెయిరీనపై సమీక్ష నిర్వహించారు.   ఇందిరా డెయిరీ పాల ఉత్పత్తి, సేకరణ, మార్కెటింగ్, రవాణాకు సంబంధించి పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలన్నారు.

ఇదివరకే డెయిరీలకు పాల సరఫరా చేస్తున్న వారికి మరో యూనిట్ మంజూరు చేయాలని  చెప్పారు. మధిర నియోజకవర్గ పరిధిలో 8 నుంచి 10 పాల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 4 వేల నుంచి 5 వేల లీటర్ల కెపాసిటీతో చిల్లింగ్​ యూనిట్​కు భవనాన్ని గుర్తించామని, దీన్ని రెనోవేట్​ చేయాలని సూచించారు. వాహనాలు వచ్చి వెళ్లేందుకు రోడ్ల నిర్మాణం చేయాలని చెప్పారు. ఇందిరా డెయిరీ లో సభ్యత్వం కలిగిన 40 వేల మంది సభ్యులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారీగా విభజించి, ఆయా కార్పొరేషన్ల ద్వారా పాడి యూనిట్ల కొనుగోలుకు రుణ సౌకర్యం కల్పించాలని సూచించారు.

ఇదివరకే షెడ్డు, పశుగ్రాసానికి భూమి ఉన్న లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా పశుసంవర్ధక అధికారి వేణు మనోహర్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి. జ్యోతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి విజయలక్ష్మి, విజయ డెయిరీ ఉప సంచాలకులు మురళీమోహన్, ఇన్​చార్జ్ ఈడీ ఎస్సీ కార్పొరేషన్ నవీన్, అధికారులు పాల్గొన్నారు. 

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

కూసుమంచి : ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం సహాయక సంఘాలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. గురువారం కూసుమంచి మండలం జుజ్జుల్​ రావుపేట గ్రామంలో బీఎన్ఆర్ నాటుకోళ్ల ఫామ్, గట్టుసింగారంలో ఏర్పాటు చేసిన మిల్క్ డెయిరీని ఆయన ప్రారంభించారు. అనంతరం కూసుమంచి మండల సమైఖ్య భవనంలో జీవన జ్యోతి మండల సమాఖ్య 18వ వార్షిక సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల సమైఖ్య భవనంలో అదనపు టాయిలెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఏపీఎంను ఆదేశించారు.

సమాజ అభివృద్ధికి సైతం మహిళా సంఘాలు దోహదపడాలని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే అడ్డుకోవాలని, గంజాయి, డ్రగ్స్, వినియోగంపై సమాచారం అందితే వెంటనే తెలియజేయాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా స్కూళ్లలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి 60 శాతానికి పైగా బిల్లులు  చెల్లించామని, మరో 15 రోజుల్లో పెండింగ్ బిల్లులు చెల్టలిస్తామని  తెలిపారు.

కాగా నాయకన్​గూడెంలో వరదలతో మృతి చెందిన యాకూబ్, సైదాబీలకు ప్రభుత్వం పంపిణీ చేసిన రూ.5లక్షల చెక్కులో షేక్​యూసఫ్​ పేరులో ఒక అక్షరం తప్పు రావడంతో సమస్య పరిష్కరించాలని కోరుతూ చెక్కును కలెక్టర్​కు తిరిగి ఇచ్చారు. ఆయా సమస్యలపై పలువురు కలెక్టర్​కు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, అడిషనల్​ డీఆర్డీవో నూరోద్దీన్, కూసుమంచి ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, తహసీల్దార్ సురేశ్, ఏపీఎం సత్యవర్ధన్​రాజు, అధికారులు, డీఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు.