ధాన్యంలో కోతలు పెట్టొద్దు : కలెక్టర్​ ముజామ్మిల్​ఖాన్​

  • వడ్ల కేటాయింపునకు బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి
  • ఖమ్మం కలెక్టర్​ముజామ్మిల్​ఖాన్​ 
  • రైస్ మిల్లర్ల ధాన్యం కేటాయింపుపై సమీక్ష

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలోని రైస్ మిల్లర్లు తాలు పేరుతో ధాన్యంలో కోతలు పెట్టొద్దని ఖమ్మం కలెక్టర్​ ముజామ్మిల్​ ఖాన్​ సూచించారు. మిల్లర్లకు వడ్లు కేటాయించాలంటే బ్యాంకు గ్యారంటీ గానీ, సెక్యూరిటీ డిపాజిట్ గానీ తప్పనిసరి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోఅడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి రైస్​ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అవకతవకలకు తావివ్వకుండా రైస్ మిల్లులకు బ్యాంకు గ్యారంటీ ఆధారంగా కేటాయింపు చేయనున్నట్లు తెలిపారు. 

రైస్ మిల్లుల వద్ద హామాలీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. మిల్లుల వద్ద ఉన్న గన్ని బ్యాగులు కొనుగోలు కేంద్రాలకు త్వరగా అందజేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు దగ్గరలోని  రైస్ మిల్లులకు ధాన్యం ట్యాగింగ్ చేయాలని, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎప్పుడు, ఎంత వస్తుందో ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు.  అనంతరం జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేసి రిటైర్​ అయిన సిబ్బందిని బుధవారం కలెక్టరేట్ లో సన్మానించారు. 

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి

జిల్లాలో లాభసాటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంట సాగును ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలను  ప్రచారం చేయాలని అధికారులకు కలెక్టర్​ సూచించారు. వ్యవసాయాన్ని లాభ సాటిగా చేయడం ద్వారా సమాజంలో అంతరాలను తగ్గించవచ్చని చెప్పారు. వరి పంట సాగు విస్తీర్ణం తగ్గించాలని, కూరగాయలు, పండ్లు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని సూచించారు. రాబోయే నెల రోజుల్లో జిల్లాలోని ప్రతి క్లస్టర్ పరిధిలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఇద్దరు రైతులతో ఆయిల్ పామ్ వేయించేలా  వ్యవసాయ విస్తరణ అధికారులు పనిచేయాలని ఆదేశించారు. రైతుల నుంచి ఆయిల్ పామ్ మొక్కలకు డ్రిప్ ఇరిగేషన్ డీడీలు సేకరించి పొలాల్లో డ్రిప్ సౌకర్యం పూర్తి చేయాలన్నారు. 

అభిప్రాయాలు తెలపాలి 

రాష్ట్రంలో స్థానిక సంస్థలల్లో రిజర్వేషన్లపై  రాజకీయపార్టీలు, సంఘాల, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం నవంబర్ 5న  ఖమ్మం కలెక్టరేట్ లో సమావేశం కానున్నదని కలెక్టర్​ తెలిపారు. అభిప్రాయాలు తెలియజేయాలనుకునే వారు హాజరై రాతపూర్వకంగా సమర్పించాలని సూచించారు. 

ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలి

ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల  ప్రజలలో విశ్వాసం కల్పించాలని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య శాఖ సేవా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.   వైద్య ఆరోగ్యశాఖ పని తీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సివిల్ ఇన్ ఫ్రా,  వైద్య శాఖ సిబ్బంది హాజరు నమోదు, వైద్య కళాశాలలో అవుట్ సోర్సింగ్  నియామకాల ప్రక్రియ, డ్రగ్స్ నిల్వల సద్వినియోగం,  ఆసుపత్రుల నిధుల వినియోగం తదితర వివిధ అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు.  ఈ సమావేశంలో ఖమ్మం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్​ ఎస్. రాజేశ్వర్ రావు, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, డీఎంహెచ్​వో వి. సుబ్బారావు, డీసీహెచ్ఎస్ సూపరింటెండెంట్ కే.రాజశేఖర్,  అధికారులు, తదితరులు పాల్గొన్నారు