హైదరాబాద్​లో ముగిసిన మహా నిమజ్జనం

  • ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్​వినాయకుడి శోభాయాత్ర
  • మధ్యాహ్నం 1.39 గంటలకు గంగమ్మ ఒడికి.. 
  • ఏడు గంటలపాటు కొనసాగిన ఊరేగింపు
  • రూ.30 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ  
  • బండ్లగూడ జాగీర్​లో లడ్డూ రూ.కోటి 87 లక్షలు
  • హైదరాబాద్​లో లక్షకుపైగా  విగ్రహాలు నిమజ్జనం

హైదరాబాద్​ సిటీ/పంజాగుట్ట, వెలుగు: ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి నిమజ్జనం శోభాయమానంగా సాగింది. పదకొండు రోజులు భక్తులతో పూజలు అందుకున్న మహా గణపతి మంగళవారం గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. బడా గణేశ్​ను దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు హుస్సేన్​ సాగర్​కు తరలివచ్చారు. చివరిరోజు పూజలందుకున్న భారీ గణనాథుడు శోభాయాత్రగా హుస్సేన్​సాగర్​కు చేరుకోగా, అక్కడ డీజే పాటలు, యువత డ్యాన్సులు, కేరింతలతో సందడి నెలకొన్నది. ఉదయం 6.32 గంటలకు ఖైరతాబాద్​గణేషుడి శోభాయాత్ర ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1.39 గంటలకు నిమజ్జనం ముగిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 7 గంటల 7 నిమిషాలపాటు వైభవంగా మహా గణపతి ఉత్సవ యాత్ర కొనసాగింది. 

మధ్యాహ్నంలోపు నిమజ్జనాన్ని పూర్తి చేయాలనే నిర్ణయం ప్రకారం ఆ సమయంలోపే ముగించారు. శివపార్వతులు, శ్రీనివాస కల్యాణం విగ్రహాలను కూడా మరో ట్రక్​ లో తీసుకొచ్చి నిమజ్జనం చేశారు.  గత కొన్నేండ్లుగా ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం నీటిలో పూర్తిగా మునిగేది కాదు. కానీ ఈ ఏడాది విగ్రహం పూర్తిస్థాయిలో మునగడం విశేషం. అక్కడక్కడ స్వల్ప తోపులాటలు జరగ్గా.. పోలీసులు రంగంలోకి దిగి, కంట్రోల్​చేశారు.

శోభాయాత్ర సాగిందిలా..

ఖైరతాబాద్​ మహాగణపతి శోభాయాత్ర 7 గంటల 7 నిమిషాల పాటు అట్టహాసంగా సాగింది. ఉదయం 6.32 గంటలకు పూజల అనంతరం ఖైరతాబాద్ నుంచి గణనాథుడు బయలుదేరాడు. 7.58 గంటలకు ఎమ్మెల్యే దానం నాగేందర్ మహా గణనాథుడి వద్దకు చేరుకొని డ్యాన్స్​ చేసి, అక్కడికి వచ్చినవారిలో జోష్​ నింపారు. అనంతరం 8.35 గంటలకు గణ నాథుడు వాసవి సేవా కేంద్ర వద్దకు చేరుకున్నాడు. టెలిఫోన్ భవన్ వద్దకు 9.20 గంటలకు చేరుకోగా... ఎదురుగా వేరే గణేషుడి విగ్రహాలు ఉండడంతో శోభాయాత్ర గంటకు పైనే నిలిచిపోయింది. 

గణేషుడి వెంట వచ్చిన దానం నాగేందర్ టెలిఫోన్​భవన్​వద్ద దిగిపోయారు. ఈ గంట సమయంలో యువత డీజే స్టెప్పులు, వలంటీర్లుగా వచ్చిన ఎన్​సీసీ పిల్లలు, భక్తుల డ్యాన్సులు భక్తులకు కనువిందు చేశాయి. అనంతరం 10.36 గంటలకు మళ్లీ శోభాయాత్ర ప్రారంభమైంది .11.13 గంటలకు బడా గణేశ్.. సెక్రటేరియెట్​ వద్దకు​ చేరుకున్నాడు. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు తెలుగుతల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియెట్​ ముందు, పరిసర ప్రాంతాల్లో నిండిపోయారు. కనుచూపుమేరలో ఎక్కడ చూసిన ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. మహాగణపతితో ఫొటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడానికి పోటీపడ్డారు. 

11.19 గంటలకు భారీ గణనాథుడు సెక్రటేరియెట్​వైపు టర్నింగ్​తీసుకోగా, అక్కడి నుంచి  శోభాయాత్ర స్పీడ్​గా సాగింది. తొలుత క్రేన్​ నెంబర్ 5 వద్ద  ఖైరతబాద్ లో గణనాథుడికి ఇరువైపులా ఏర్పాటు చేసిన శివపార్వతుల కల్యాణం విగ్రహాలను 12. 12 గంటలకు, శ్రీనివాస కల్యాణం విగ్రహాన్ని 12.20 గంటలకు నిమజ్జనం చేశారు. 12.25 గంటల సమయంలో మహా గణపతి క్రేన్​ నంబర్​ 4  వద్దకు చేరుకున్నాడు. అనంతరం 12.50 గంటలకు  గణనాథుడి విగ్రహానికి చేసిన సపోర్టింగ్​ వెల్డింగ్​ తొలగించారు. 1.02 గంటలకు చివరి పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు. అనంతరం గుమ్మడి కాయ కొట్టి, కలశం తీశారు. మధ్యాహ్నం1.20 గంటలకు విగ్రహాన్ని సూపర్​ క్రేన్ సహాయంతో కదిలించారు. 

1.23  గంటలకు గణపతి గంగమ్మ ఒడికి ప్రయాణం ప్రారభం కాగా, 1.31 గంటలకు నీళ్లలోకి దిగాడు. 1.39 గంటల సమయంలో  నీటిలో పూర్తిగా ముగినిపోవడంతో మహా గణనాథుడి నిమజ్జనం ముగిసింది.

గ్రేటర్​ పరిధిలో లక్షకుపైగా గణపతుల నిమజ్జనం

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో గణపతుల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం రాత్రి వరకు లక్షకు పైగా గణపతుల నిమజ్జనం పూర్తయినట్టు  అధికారులు తెలిపారు.

అక్కడక్కడ స్వల్ప తోపులాటలు

మహాగణపతి శోభాయాత్ర సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు, నిఘా ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవే క్షించారు. దాదాపు 700 మంది పోలీసులు విధులు నిర్వహించారు. అలాగే, ఎన్​సీసీ స్టూడెంట్స్, హిందూస్థాన్​స్కౌట్స్​​అండ్​ గైడ్స్​ భక్తులకు సేవలందించారు. అయినా..అక్కడ క్కడ స్వల్ప తోపులాటలు జరిగాయి. ఉద యం 11 గంటల తర్వాత భక్తులు భారీ సంఖ్య లో రావడంతో బడా గణేషుడి విగ్రహ పరిసరా లన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. 

రోప్​పార్టీ లు భక్తులను కంట్రోల్​చేయలేకపోయాయి.  గణేషుడు సెక్రటేరియెట్​వైపునకు మళ్లగానే  భక్తుల తాకిడిని తట్టుకోలేక ఎన్​సీసీ స్టూడెం ట్స్​ ఒక సందర్భంలో తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. తోపులాటలో కిందపడిపోయారు. అలాగే గణేషుడు సెక్రెటేరియెట్​ దాటగానే మరోసారి స్వల్ప తోపులాట జరిగింది. దీంతో అశ్వకదళం గుర్రాలతో సమూహాలను చెల్లచెదురు చేయగా.. పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది.