వడ్ల కొనుగోళ్లకు సబ్​ కమిటీ

  •     కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, తుమ్మల, శ్రీధర్​బాబు
  •     రైతులకు, మిల్లర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సర్కారు చర్యలు
  •     విడివిడిగా కొనుగోళ్లు.. సన్నాల బస్తాలకు ఎరుపు.. దొడ్డుకు ఆకుపచ్చ దారం
  •     మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తం.. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించం
  •     సబ్ ​కమిటీ భేటీ అనంతరం మీడియాతో మంత్రులు

హైదరాబాద్, వెలుగు : వడ్ల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కొనుగోళ్లలో రైతులకు, మిల్లర్లకు ఎక్కడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎస్​ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, సివిల్​ సప్లయ్స్​ మినిస్టర్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర​రావు

 ఐటీ, ఇండస్ట్రీస్​మినిస్టర్ శ్రీధర్​ బాబు ఉన్నారు.  సజావుగా వడ్ల కొనుగోళ్లు, రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం, ధాన్యం నిల్వకు ఇబ్బందులు రాకుండా గోదాముల లీజ్, రైస్ మిల్లర్లకు బ్యాంక్ గ్యారంటీ, తడిచిన ధాన్యం  కొనుగోళ్లు  అంశాలపై సమస్యలు రాకుండా కేబినేట్​సబ్​ కమిటీ పనిచేయనున్నది.

సమగ్ర ప్రణాళిక సిద్ధం : మంత్రి ఉత్తమ్​

ఈ వానాకాలం సీజన్‌లో ధాన్యం సేకరణకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్టు మంత్రి ఉత్తమ్​కుమార్  రెడ్డి తెలిపారు. సన్నాలు, దొడ్డు రకం ధాన్యం సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, శ్రీధర్​ బాబుతో కూడిన  కేబినెట్​ సబ్​ కమిటీ సివిల్​ సప్లయ్స్​ భవన్​లో  గురువారం సాయంత్రం సమావేశమైంది. అనంతరం ఉత్తమ్​కుమార్​రెడ్డి మీడియాతో మాట్లాడారు.   సన్న రకం వడ్లను సులువుగా గుర్తించేందుకు ఆ సంచులను ఎరుపు దారంతో, దొడ్డురకం సంచులను ఆకుపచ్చ దారంతో కుట్టిస్తామని తెలిపారు. 

రెండూ విడివిడిగా రవాణా చేస్తారని చెప్పారు. కొనుగోళ్లలో వివాదాలను పరిష్కరించడానికి రెవెన్యూ డివిజనల్, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  అదనపు ప్రోత్సాహకంతో సహా రైతులకు చెల్లింపులు ఆర్థిక శాఖ నిర్వహించే ఈ–-కుబేర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రాసెస్ చేస్తామని చెప్పారు. ఇక మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.  గ్రామీణ ప్రాంతాల్లో రైస్ మిల్లింగ్ పరిశ్రమ వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.  

కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను మిల్లర్లకు అందజేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ ఆన్​లైన్ లో​ నమోదు చేసిన డేటా ప్రకారం వరి ఏ రకం పండించారనే దానిపై ఓపీఎంస్​లో కచ్చితమైన సమాచారం తీసుకుంటామని తెలిపారు. ఈ వ్యవస్థతో  రైతుల అకౌంట్లకు నేరుగా చెల్లింపులు చేస్తామని చెప్పారు. 

సన్నాహాలకు ప్రోత్సాహకంపై రైతులకు అవగాహన

సన్న రకం వడ్లకు క్వింటాల్‌కు రూ.500 ప్రోత్సాహకంపై రైతులకు అవగాహన కల్పించేలా ప్రచారం చేపడతామని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. సన్న రకం వరిని  గుర్తించేందుకు పీపీసీ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఈ సీజన్​లో వచ్చే వరి ధాన్యం సేకరణకు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకారం అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్​ బాబు  కోరారు.  ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. 

వానాకాలం సీజన్​లో  రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని నిర్ణీత గడువు లోగా బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందించాలన్నారు.  రైస్ మిల్లర్ల సమస్యలను కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. పెరిగిన ధరలు. మారిన అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం  సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.  

పెండింగ్​ బకాయిలు క్లియర్​ చేయండి

ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న  సమస్యలను సబ్‌కమిటీకి తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నివేదించింది. ఈ ఏడాది వరి మిల్లింగ్ 14 శాతం తగ్గడంతో వరి లభ్యత తగ్గిందని తెలిపింది. ధాన్యం సేకరణ తగ్గిన కారణంగా పెద్ద మిల్లులు  55% నుంచి 60% వరకు తగ్గాయని పేర్కొన్నది.  ఆహార, ప్రజా పంపిణీ శాఖ (డీఎఫ్​పీడీ) విధించిన ఒక శాతం లెవీతో ఇబ్బంది ఉందని తెలిపింది. పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలని, లెవీ తగ్గించాలని కోరింది.   

కేబినెట్​ సబ్​ కమిటీ బాధ్యతలివే..

ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల వడ్లకు రూ.500 బోనస్​ చెల్లిస్తున్నది. సన్నాల కోసం కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక కాంటాలు ఏర్పాటు చేయిస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో సరిడా  గోనె సంచులు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్ల కొరత లేకుండా కేబినేట్​ సబ్ కమిటీ చూడనున్నది. ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా వ్యవహరించనున్నది.   

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పుతున్నారు.  రాష్ట్రంలో ఈ  వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో 146 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో   ట్రేడర్లు, మిల్లర్లు, కొనుగోలు చేసే ధాన్యం, రైతులు తమ అవసరాలకు ఉంచుకునే నిల్వలు 55 లక్షల మెట్రిక్ టన్నులు​పక్కనపెడితే.. 

91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నది. అందులో 44 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 47 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉండనున్నాయి. వీటి సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా సబ్​ కమిటీ చూడనున్నది.

79.57 కోట్ల పంట నష్టపరిహరం నిధులు రిలీజ్ చేసిన మంత్రి తుమ్మల

రాష్ట్రంలో ఈ ఏడాది భారీ వర్షాలతో జరిగిన పంట నష్టానికి పరిహారం నిధులను విడుదల చేస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. 79,216 మంది రైతులకు చెందిన 79,574 ఎకరాలకు సంబంధించి రూ.79.57 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టు బుధవారం ప్రకటనలో తెలిపారు. రైతుల అకౌంట్లకే నేరుగా నిధులను జమ అయ్యేటట్టు ఏర్పాట్లు చేశామన్నారు. 

రాష్ట్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు కురిసిన వర్షాలకు 79,574 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు తేలిందన్నారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తున్నామన్నారు. అత్యధిక పంటనష్టం వరుసగా ఖమ్మం (28,470 ఎకరాలు), మహబూబాబాద్ (14,669 ఎకరాలు), సూర్యాపేట (9,828 ఎకరాలు) జిల్లాల్లో  సంభవించిందని వెల్లడించారు.