హైడ్రా ఆగితే.. హైదరాబాద్ మరో వయనాడే: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

నిజామాబాద్: ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఆగిపోతే.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరో వయనాడ్ అవుతోందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అంశంలో వెనక్కి తగ్గేది లేదని.. హైడ్రా, మూసీ ప్రక్షాళన నిరంతరంగా కొనసాగుతోందని తేల్చి చెప్పారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన మీద కేటీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డిలవి చిల్లర మాటలని ఫైర్ అయ్యారు. ఇవాళ (అక్టోబర్ 14) నిజామాద్ జిల్లాలో పర్యటించిన మహేష్ కుమార్ గౌడ్.. ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కార్యకర్తలతో చర్చించారు.

 అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‎దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్ళలో యువతకు ఉద్యోగాలు ఇవ్వని బీఆరెస్‎కు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఉద్యోగలిచ్చామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటానికి బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయని.. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 

ALSO READ | నైతిక విలువలే లేవు.. బీఆర్ఎస్, కాంగ్రెస్‎పై కిషన్ రెడ్డి ఫైర్

 

కాళేశ్వరం సహా బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై ఉక్కుపాదం మోపతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనను వివరిస్తూనే స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి బీఆర్ఎస్, బీజేపీ నేతలకు లేదని అన్నారు. నిలిచిపోయిన ఎల్ఆర్ఎస్, మాస్టర్ ప్లాన్ అంశాలపై అందరితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.