రెండ్రోజుల్లో రిజైన్​ చేస్త ... ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​ ప్రకటన

  • నిర్దోషినని జనం తీర్పిస్తే తప్ప సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ
  • అరెస్టయితే రాజీనామా చేయొద్దంటూ సీఎంలకు సూచన

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవల తీహార్ జైలు నుంచి రిలీజ్ అయిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. రాబోయే రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తనకు నిర్దోషిగా సర్టిఫికెట్(ఎన్నికల ఫలితాలు) ఇచ్చే వరకు సీఎం కుర్చీలో కూర్చోనని ప్రతిజ్ఞ చేశారు. లిక్కర్ స్కాం కేసులో గత శుక్రవారం జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ తొలిసారి ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. కేజ్రీవాల్ భార్య సునీత ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ...‘ప్రజలు మనం నిజాయితీపరులమని చెప్పినప్పుడు మాత్రమే నేను సీఎం, మనీశ్ సిసోడియా డిప్యూటీ సీఎం అవుతాం. రెండు రోజుల్లో నేను సీఎం పదవికి రాజీనామా చేస్తా. నేను నిజాయితీపరుడిని కానా? అని ప్రజలనే అడుగుతా. వారు నా నిజాయితీకి సర్టిఫికేట్ ఇచ్చేవరకు సీఎం కుర్చీలో కూర్చోను’ అని స్పష్టంచేశారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అయితే.. మహారాష్ట్రతో పాటే ఢిల్లీలోనూ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్​ డిమాండ్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయంలో తాను అగ్నిపరీక్షను స్వీకరించాలనుకుంటున్నట్లు తెలిపారు. కానీ బీజేపీ తనను అవినీతిపరుడిగా నిరూపించాలని చూస్తోందని విమర్శించారు. అవినీతికి పాల్పడిన కాషాయ పార్టీ ప్రజలకు మంచి స్కూల్స్, ఉచిత విద్యుత్ ను అందించలేకపోయిందని ఫైర్ అయ్యారు.

జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపండి..

బీజేపీయేతర ముఖ్యమంత్రులపై కేంద్రంలోని బీజేపీ తప్పుడు కేసులు బనాయిస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. అందువల్ల సీఎంలను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తే రాజీనామాలు చేయొద్దని, జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే తాను లిక్కర్ స్కాంలో అక్రమంగా అరెస్ట్ చేసినా సీఎం పదవికి రాజీనామా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. దేశంలో బీజేపీ కుట్రలకు నిలబడగలిగేది ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మాత్రమే అన్నారు. జన్ లోక్ పాల్ బిల్లుపై 2014 లో సీఎం పదవికి రాజీనామా చేశానన్నారు. తర్వాత ప్రజా తీర్పుతో కేవలం 49 రోజుల్లో ఆ పదవిని చేపట్టినట్లు గుర్తు చేశారు. తనకు సీఎం పదవిపై వ్యామోహం లేదన్నారు. లిక్కర్ స్కాం కేసు చాలాకాలం సాగుతుందని... అయితే తాను నిజాయితీపరుడినా? దోషినా? అనేది ప్రజలే చెప్పాలన్నారు. ప్రజలు తనను నిజాయితీపరుడని భావిస్తే... ఆప్ కు అనుకూలంగా ఓటు వేయాలని రిక్వెస్ట్ చేశారు. తనకు ప్రజలే ముఖ్యమన్నారు. ఆప్ నేతలు సత్యేంద్ర కుమార్ జైన్, అమానతుల్లా ఖాన్ లు ఇంకా జైల్ లోనే ఉన్నారని, వారు త్వరలో బయటకు వస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. 

సీఎం రేసులో సునీతా, ఆతిశీ, గోపాల్ రాయ్...

రెండ్రోజుల్లో పార్టీ నేతలతో చర్చించి నెక్ట్స్ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు. దీంతో ఢిల్లీ నెక్ట్స్​ సీఎం రేసులో ప్రధానంగా ఆయన భార్య సునీత, మంత్రులు ఆతిశీ, గోపాల్ రాయ్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 21న సీఎం ను ఈడీ అరెస్ట్ చేసినప్పుడు.. ఢిల్లీ, గుజరాత్ హర్యానా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సునీత కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఆమె రెవెన్యూ శాఖ మాజీ అధికారి కావడంతో.. ప్రభుత్వం, బ్యూరోక్రసీ పనితీరును ఈజీగా హ్యాండిల్ చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆమెను సీఎంగా ఎన్నుకుంటే పార్టీలో వ్యతిరేకత కూడా ఉండదంటున్నారు. ఇక ఆతిశీ ప్రస్తుతం 14 మంత్రిత్వ శాఖలకు ఇన్​చార్జ్ గా ఉన్నారు. దీంతో ఆమె కూడా సీఎం పనితీరును తేలికగా అర్థం చేసుకోగలరంటున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆతిశీ కూడా ఫ్రంట్ రోల్ లో విపక్షాలను ఎదుర్కోనున్నారు. ఇక పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్​కు ఆప్ ఢిల్లీ విభాగం చీఫ్ గా మంత్రి గోపాల్ రాయ్ ఉన్నారు. పలు సందర్భాల్లో కేజ్రీవాల్​కు గోపాల్ రాయ్ కుడి భుజంగా వ్యవహరించారు. దీంతో ఈయన పేరు కూడా పరిశీలనలో ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అది పబ్లిక్ స్టంట్..

కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనను బీజేపీ, కాంగ్రెస్ నేతలు పబ్లిక్ స్టంట్ గా కొట్టిపారేశారు. భార్య సునీత ను సీఎం చేయాలనే ఆలోచనలో భాగమే కేజ్రీవాల్ ప్రకటన అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల అన్నారు. కేజ్రీవాల్ పుణ్యం ఎలా చేయాలో పీహెడ్ డీ చేశారని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కాంలో ఆయన నిర్దోషి అని కోర్టు ప్రకటించక పోవడంతో ఈ రాజీనామా డ్రామాకు తెర లేపారని ప్రదీప్ భండారి విమర్శించారు. సీఎం పదవి నుంచి తప్పుకోవడం త్యాగమేమి కాదని, సీఎం ఆఫీస్ లోకి తిరిగి ప్రవేశం, ఫైళ్లపై సంతకాలు చేయరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ మరో నేత మణిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఈ అంశంపై స్పందిస్తూ... సీఎం నిర్ణయం కేవలం ప్రచార ఎత్తుగడ అని అన్నారు. ఆయన ఎప్పుడో రాజీనామా చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఆధారాలను మాయంచేసే అధికారం ఉందనే ఆందోళన సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో కనిపిస్తోందన్నారు.