న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) స్కీమ్స్‌ను అడ్డుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ఆరోపించారు. తమ పార్టీ సంక్షేమ పథకాల రిజిస్ట్రేషన్‌ను ఆపేందుకు బీజేపీ గూండాలను, పోలీసులను పంపుతోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ దీక్షిత్ ఫిర్యాదు మేరకు ఆప్ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో శనివారం కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ఎన్నికలకు ముందు మహిళలు, వృద్ధుల కోసం ఆప్ తీసుకురానున్న పథకాలను ఆపడానికి ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
బీజేపీకి నేరుగా ఢీకొనే దమ్ములేకే.. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ తో ఫిర్యాదు చేయించిందని మండిపడ్డారు. ‘‘ఎన్నికల్లో గెలిచిన తర్వాత మహిళలకు రూ.2,100, 60 ఏండ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పాం. ఈ రెండు పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పటికే లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో తమ పథకాలపై బీజేపీ భయాందోళనకు గురవుతోంది’’ అని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే, సందీప్ దీక్షిత్ ఆరోపణలపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. “అన్నింటిని ఆపడం కోసమే బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
వారు గెలిస్తే.. అన్ని పథకాలను నిలిపివేస్తారు. బీజేపీకి ఓటేస్తే ఢిల్లీ వదిలి వెళ్లాల్సి వస్తుంది. బీజేపీకి మహిళలు, వృద్ధుల సంక్షేమం అక్కర్లేదు. వారు మహిళా వ్యతిరేకులు, వారు అభివృద్ధి చెందాలని కోరుకోరు”అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజల కోసం మళ్లీ జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధమని ఆయన అన్నారు. ‘‘వారు నన్ను జైలుకు పంపితే.. నేను మళ్లీ వెళ్తాను. కానీ, నేను మీ కోసం పోరాడుతూనే ఉంటాను’’ అని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్‌ను విశ్వసించాలని, ఆప్ ప్రతిపాదిత సంక్షేమ పథకాల కోసం నమోదు చేసుకోవడం కొనసాగించాలని ఆయన ప్రజలకు సూచించారు.
ఆప్ పథకాలపై దర్యాప్తుకు ఎల్జీ ఆదేశం..
వచ్చే ఏడాది జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సంక్షేమ పథకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే. సక్సేనా శనివారం దర్యాప్తునకు ఆదేశించారు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎల్జీ కార్యాలయం ఢిల్లీ సీఎస్, పోలీస్ కమిషనర్ కు వేర్వేరుగా ఆదేశాలు జారీ చేసింది. మహిళా సమ్మాన్ యోజన పథకం పేరుతో ఆప్ మోసపూరితంగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, కాంగ్రెస్ అభ్యర్థుల వద్ద ఇంటి వద్ద పంజాబ్ ఇంటెలిజెన్స్ అధికారులను ఉంచుతుందని, ఎన్నికల్లో పంచడానికి పంజాబ్ నుంచి ఢిల్లీకి డబ్బులను తరలిస్తుందని సందీప్ దీక్షిత్ ఆరోపించారు. ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ మాత్రం తమ పార్టీపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు.