Arvind -Kejriwal: మోదీ దేవుడేం కాదు.. ఢిల్లీ అసెంబ్లీలో అర్వింద్ కేజ్రీవాల్ నిప్పులు

ఢిల్లీ: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలకు గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. ప్రధాన మంత్రి అత్యంత శక్తిమంతుడు అయితే అయ్యుండొచ్చని అంతమాత్రాన ఆయనేం దేవుడు కాదని కేజ్రీవాల్ చెప్పారు. తనను, మనీశ్ సిసోడియాను అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి రావడం తమ విపక్ష సభ్యులను కూడా బాధించే విషయమని ఆయన తెలిపారు.

మోదీ ఏం దేవుడు కాదని, దేవుడు తమతోనే ఉన్నాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాను మూడు నాలుగు రోజుల క్రితం ఒక బీజేపీ నేతను కలిశానని, తనను జైలులో పెట్టడం వల్ల ఏమైనా ప్రయోజనం చేకూరిందా అని ఆయనను అడిగానని కేజ్రీవాల్ చెప్పారు. అందుకు ఆ బీజేపీ నేత ఆ పరిణామం వల్ల ఢిల్లీ ప్రభుత్వం పట్టాలు తప్పే పరిస్థితి తీసుకురావడం తప్ప ఒరిగిందేమీ లేదని సమాధానమిచ్చారని ఢిల్లీ మాజీ సీఎం చెప్పుకొచ్చారు.

కేజ్రీవాల్ అవినీతిపరుడని ఢిల్లీలో ఏ ఒక్కరూ అనడం లేదని, తప్పుడు కేసుల్లో తనను, ఆప్ నేతలను బీజేపీ జైలుకు పంపించిందని మాట్లాడుకుంటున్నారని అసెంబ్లీలో కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. నైతిక విలువలకు కట్టుబడే తాను రాజీనామా చేశానని కేజ్రీవాల్ తెలిపారు. రావణుడి అహంకారం ఎల్లకాలం మనుగడ సాగించలేదని, ఢిల్లీ ప్రజలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీలో సంఖ్యా బలం 70 నుంచి 66కి పడిపోయింది. అధికార ఆమ్ ఆద్మీ నుంచి 59 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. నలుగురు ఎమ్మెల్యేల అనర్హత, రాజీనామాలపై ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ ప్రకటన చేశారు.